" ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు" పేరుతో 36 గంటల పాటు దీక్ష చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం, జిల్లా కార్యాలయాలు, టీడీపీ నేతల ఇళ్లపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మూక దాడికి వ్యతిరేకంగా ఈ దీక్ష చేపట్టనున్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 8 గంటల వరకు 36 గంటల వరకు మంగళగిరిలో కేంద్ర పార్టీ ఆఫీసులో దీక్ష చేయనున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉగ్రవాదం పేట్రేగిపోతోందని.. ఫ్యాక్షనిజానికి అధికారం తోడయ్యిందని చంద్రబాబు భావిస్తున్నారు. దీనిలో పోలీసులు అంతర్భాగమయ్యారని.. ప్రశ్నించిన వారిని భౌతికంగా అంతమొందించే ఉన్మాద, మూక దాడులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెరతీశారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఇది కచ్చితంగా ప్రభుత్వ ప్రేరేపిత టెర్రరిజమేనని.. ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయంపై మూక దాడి చేయడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదని గుర్తు చేస్తున్నారు. ముందస్తు కుట్రతో పార్టీ కార్యాలయాలు, టీడీపీ నేతల ఇళ్లపై దాడి చేసి.. కుటుంబ సభ్యులు ప్రాణభయంతో వణికి పోయేలా దాడులకు తెగబడ్డారని టీడీపీ మండిపడింది. ప్రభుత్వ ఉగ్రవాదాన్ని నిలువరించాల్సిన బాధ్యత ప్రతి రాష్ట్రంలోని ప్రతి పౌరునిపై ఉందని టీడీపీ పిలుపునిచ్చింది. ప్రజలు, ఇతర ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు, పౌర సంఘాలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.
Also Read : బూతులు వినలేక .. అభిమానించే వాళ్లకు బీపీ వచ్చి రియాక్టయ్యారు : జగన్
తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఇతర పార్టీల నేతలు పరిశీలిస్తున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పరిశీలించి.. పథకం ప్రకారమే దాడులు చేశారని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆఫీసులు, నాయకులపై దాడులు అనుకోకుండా జరిగినవి కాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ చూడలేదని.. ఇలా జరగటం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో డీజీపీ కార్యాలయం ఉందని అయినా అడ్ుడకోలేదంటే కచ్చితంగా పోలీసుల ప్రోద్బలం ఉందని రామకృష్ణ ఆరోపించారు. గత రెండేళ్ల నుంచి రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్నారు.
మరో టీడీపీ ఆఫీసు వద్ద ఇవాళ కూడా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో గాయపడిన వాని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. వారని అంబులెన్స్‌లలో టీడీపీ ఆఫీసుకు తీసుకొస్తున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ ఆఫీసులోకి వెళ్లడానికి వీల్లేదన్నారు. అయితే విషయం తెలుసుకుని లోకేష్ రోడ్డు మీదకు రావడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. అంబులెన్స్‌ను వదిలి పెట్టారు. గురువారం చంద్రబాబుతో పాటు వారు కూడా దీక్షలో కూర్చునే అవకాశం ఉంది.
దీక్ష తర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. హోంమంత్రి అమిత్ షాని కలిసి ప్రభుత్వ టెర్రరిజంపై ఫిర్యాదు చేయనున్నారు. ఈమేరకు అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఘటనపై చంద్రబాబు కేంద్ర మంత్రి అమిత్ షాకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. దాడి విషయం ఇంకా తన దృష్టికి రాలేదని పార్టీ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారు. దీంతో నేరుగా కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.