ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్-12 తొలిపోరులో ఆస్ట్రేలియా బోణీ చేసింది. దక్షిణాఫ్రికాపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని ఆఖరి ఓవర్లో ఛేదించింది. ఉత్కంఠంగా మారిన ఛేజింగ్‌లో స్టీవ్‌స్మిత్ (35: 34 బంతుల్లో 3x4), స్టాయినిస్ (24*: 16 బంతుల్లో 3x4) కీలకంగా ఆడారు. అంతకు ముందు సఫారీ జట్టులో అయిడెన్ మార్‌క్రమ్ (40: 36 బంతుల్లో 3x4, 1x6) ఒక్కడే రాణించాడు.
తేలికేం కాదు!
లక్ష్యం తక్కువే కావడంతో ఆస్ట్రేలియా విజయం సులభమే అనుకున్నారు! కానీ అంత తేలిక కాదని సఫారీ బౌలర్లు చాటిచెప్పారు. షార్జా పిచ్, పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. కంగారూలను కంగారు పెట్టారు. దాంతో ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు. తెంబా బవుమా తమ బౌలర్లను చక్కగా ప్రయోగించడంతో ఆసీస్ పవర్‌ప్లేలో 2 వికెట్లు చేజార్చుకొని 28 పరుగులే చేసింది. జట్టు స్కోరు 4 వద్దే ఆరోన్ ఫించ్ (0)ను నార్జ్ ఔట్ చేశాడు. 20 వద్ద డేవిడ్ వార్నర్ (14)ను రబాడా పెవిలియన్ పంపించాడు. మిచెల్ మార్ష్ (11)ను మహరాజ్ బుట్టలో పడేశాడు.
మాక్సీ, స్మిత్ కీలక భాగస్వామ్యం
ఒత్తిడి పెరిగిన వేళ స్టీవ్ స్మిత్, మాక్స్‌వెల్ (18: 21 బంతుల్లో 1x5) నాలుగో వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యం అందించారు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు పరుగులను నియంత్రించినా ఓపిక పట్టారు. ప్రమాదకరంగా మారిన స్మిత్‌ను నార్జ్ 14.5 వద్ద ఔట్ చేశాడు. అప్పడు స్కోరు 80. మరో పరుగుకే మాక్సీని శంషీ క్లీన్‌బౌల్డ్ చేయడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. రన్‌రేట్ పెరుగుతుండటంతో ఆసీస్‌పై ఒత్తిడి పెరిగింది. 12 బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన తరుణంలో స్టాయినిస్ మూడు బౌండరీలు బాదేసి విజయం అందించాడు.
వణికించిన ఆసీస్ బౌలర్లు
తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు కోరుకున్న ఆరంభం దక్కలేదు. మిచెల్ స్టార్క్ (2), హేజిల్‌వుడ్ (2), ఆడమ్ జంపా (2) తమ బౌలింగ్‌తో ప్రత్యర్థిని వణికించారు. దాంతో పవర్‌ప్లేలోనే సఫారీ జట్టు మూడు కీలక వికెట్లను చేజార్చుకుంది. జట్టు స్కోరు 13 వద్ద తెంబా బవుమా (12), 16 వద్ద రసి వాన్‌డర్ డుసెన్ (2), 23 వద్ద క్వింటన్ డికాక్ (7) పెవిలియన్ చేరారు. తీవ్ర ఒత్తిడితో హెన్రిక్ క్లాసెన్ (13) కూడా 8 ఓవర్ ఆఖరి బంతికి ఔటయ్యాడు. ఈ క్రమంలో డేవిడ్ మిల్లర్ (16) సహకారంతో అయిడెన్ మార్‌క్రమ్ మంచి షాట్లు ఆడాడు. దాంతో స్కోరు 80 దాటింది. కానీ 14వ ఓవర్లో మిల్లర్, ప్రిటోరియస్ (1)ను ఆడమ్ జంపా ఔట్ చేయడంతో సఫారీలు వందైనా చేస్తారా అనిపించింది. జట్టు స్కోరు 98 వద్ద మార్‌క్రమ్‌ను స్టార్క్ ఔట్ చేశాడు. ఆఖర్లో రబాడా 23 బంతుల్లో 19 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో స్కోరు 118కి చేరుకుంది.
Also Read: విండీస్‌ను ఢీకొట్టనున్న ఇంగ్లండ్.. మోర్గాన్ సేన గెలిస్తే రికార్డే.. ఎందుకంటే?
Also Read: ఈ క్రికెటర్లు రిచ్చో రిచ్చు! టీ20 ప్రపంచకప్ ఆడేస్తున్న కోటీశ్వరులు వీరే!