టీ20 క్రికెట్‌ చాలా విచిత్రమైన ఆట! ఎప్పుడెవరిని గెలిపిస్తుందో ఎవరిని ఓడిస్తుందో తెలియదు! ఈ ఆటలో సెంటిమెంట్లు కూడా అలాగే పనిచేస్తాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2021 అందుకు తాజా ఉదాహరణ. ఈ మెగాటోర్నీలో '6' సెంటిమెంట్‌ నాలుగు జట్లను ఘోరంగా వెంటాడింది. రెండు జట్లకు ఆరంభంలో మరో రెండు జట్లకు సెమీస్‌లో చుక్కలు చూపించింది.


మొదట భారత్‌, ఆపై పాక్‌


ఈ టీ20 ప్రపంచకప్‌ ముందు వరకు దాయాది పాకిస్థాన్‌పై భారత్‌కు ఎదురేలేదు. ప్రతిసారీ విజయం టీమ్‌ఇండియానే వరించేది. ప్రత్యర్థిపై మన జట్టుది అద్భుతమైన రికార్డు. వరుసగా ఐదుసార్లు పాక్‌ను చిత్తు చేసింది. అలాంటిది ఎదుర్కొన్న ఆరో మ్యాచులో కోహ్లీసేన ఘోర పరాభవం  చవిచూసింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి 17.5 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా ఛేదించింది. అయితే ఇదే '6' సెంటిమెంట్‌ పాక్‌నూ వెంటాడింది. ఈ టోర్నీలో ఆ జట్టు వరుసగా ఐదు మ్యాచుల్లో విజయ దుందుభి మోగించింది. కానీ ఆరో మ్యాచైనా సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడింది. ఆఖరి వరకు విజయంపై ఆశలున్నా హఠాత్తుగా మాథ్యూవేడ్‌ హ్యాట్రిక్‌ సిక్సర్లతో పాక్‌ కలచెదిరింది.


తొలుత విండీస్‌, ఆనక ఇంగ్లాండ్‌


మరో గ్రూపులో ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ కథా ఇదే! టోర్నీకి ముందు ఆంగ్లేయులపై కరీబియన్లకు తిరుగులేని చరిత్ర ఉంది. టీ20 ప్రపంచకప్పుల్లో తలపడిన ఐదుసార్లు విండీస్‌దే విజయం. వారిద్దరూ ఈ టోర్నీలో తలపడిన మ్యాచ్‌ ఆరోది. విచిత్రంగా హిట్టర్లతో నిండిన విండీస్‌ 55కే ఆలౌటై ఊహించని ఘోర పరాభవం ఎదుర్కొంది. ఇక భీకరంగా ఆడిన ఇంగ్లాండ్‌ ఈ టోర్నీలో వరుసగా ఐదు మ్యాచులు గెలిచి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆరో మ్యాచైన సెమీస్‌లో న్యూజిలాండ్‌తో తలపడింది. ఇక్కడా '6' సెంటిమెంట్‌ ఆంగ్లేయులను వెక్కిరించింది. ఇంగ్లాండ్‌ మొదట 166 పరుగులు చేయగా ఛేదనలో జిమ్మీ నీషమ్‌ దెబ్బకు ఆంగ్లేయులు డీలాపడ్డారు. టోర్నీ నుంచి నిష్క్రమించారు.


5 వికెట్లు 6 బంతులు


విచిత్రంగా ఈ రెండు సెమీ ఫైనళ్లు ఒకేలా జరిగాయి. ఛేదన జట్లు తీవ్ర ఒత్తిడిలో పడిపోయాయి. మిడిలార్డర్లోని మ్యాచ్ ఫినిషర్లే ఆ జట్లను గెలిపించారు. పైగా ఐదు వికెట్ల తేడాతో మరో ఆరు బంతులు మిగిలుండగానే విజయాలు అందించారు. మొత్తానికి '6' సెంటిమెంట్‌ మాత్రం నాలుగు జట్లను వెంటాడిన తీరు అభిమానులను బాధించింది!


Also Read: Team India: న్యూజిలాండ్ తో టీట్వంటీ సిరీస్ జట్టును ప్రకటించిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ


Also Read: T20 World Cup 2021 : T20 వరల్డ్‌ కప్‌ ఫైనల్ చేరుకున్న చిరకాల ప్రత్యర్థులు


Also Read: T20 World Cup: మనోళ్లు ఐపీఎల్‌ను తిడుతుంటే..! కేన్‌ మామ మాత్రం ఐపీఎల్‌ వల్లే సెమీస్‌ చేరామన్నాడు!


Also Read: Watch Video: పాకిస్తాన్ ఓటమిని జీర్ణించుకోలేక వెక్కి వెక్కి ఏడ్చిన బాలుడు.. వీడియో షేర్ చేసిన అక్తర్ 


Also Read: PAK vs AUS, Match Highlights: ఈసారి కొత్త విజేత ఖాయం.. పాక్‌ను చిత్తు చేసి ఫైనల్స్‌కు చేరిన ఆస్ట్రేలియా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి