టీ20 వరల్డ్‌కప్ రెండో సెమీఫైనల్‌లో పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా ఐదు వికెట్లతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా 19 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించారు. 19వ ఓవర్లో మాథ్యూ వేడ్ మూడు సిక్సర్లు కొట్టడంతో మ్యాచ్ ఆస్ట్రేలియా చేతికి వచ్చింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల మధ్య ఆదివారం ఫైనల్ జరగనుంది. వీరిలో ఎవరు గెలిచినా.. మనం ఈసారి కొత్త చాంపియన్‌ను చూడవచ్చు.


రిజ్వాన్, జమాన్ షో
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్(67: 52 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), బాబర్ ఆజమ్(39: 34 బంతుల్లో, ఐదు ఫోర్లు) ఆస్ట్రేలియా బౌలర్లకు వికెట్ తీసే అవకాశం ఇవ్వలేదు. పవర్‌ప్లే ఆరు ఓవర్లలో పాకిస్తాన్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 47 పరుగులు చేసింది. మొదటి వికెట్‌కు 71 పరుగులు జోడించిన అనంతరం బాబర్ ఆజమ్ అవుటయ్యాడు. దీంతో పది ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది.


అనంతరం మహ్మద్ రిజ్వాన్, ఫకార్ జమాన్ (55 నాటౌట్: 32 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) కలిసి పాకిస్తాన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు కేవలం 7.2 ఓవర్లలోనే 72 పరుగులు జోడించారు. రిజ్వాన్ అవుట్ అయ్యాక కూడా ఫకార్ జమాన్ అద్భుతమైన బ్యాటింగ్‌ను కొనసాగించాడు. దీంతో పాకిస్తాన్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. మొదటి 10 ఓవర్లలో 71 పరుగులు మాత్రమే చేసిన పాకిస్తాన్.. చివరి 10 ఓవర్లలో 105 పరుగులు సాధించింది. వీటిలో చివరి నాలుగు ఓవర్లలోనే 55 పరుగులు రావడం విశేషం.


అదరగొట్టిన మ్యాథ్యూ వేడ్


177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఊహించని విధంగా ప్రారంభం అయింది. మొదటి ఓవర్లోనే ఆరోన్ ఫించ్‌ను(0: 1  బంతి) డకౌట్ చేసి షహీన్ అఫ్రిది పాకిస్తాన్‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత మిషెల్ మార్ష్ (28: 22 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), డేవిడ్ వార్నర్ (49: 30 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించారు.






ఇన్నింగ్స్ మెల్లగా గాడిలో పడుతున్న టైంలో పాకిస్తాన్ స్పిన్నర్ షాదబ్ ఖాన్ ఆస్ట్రేలియాను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. మిషెల్ మార్ష్, స్టీవ్ స్మిత్(5: 6 బంతుల్లో, ఒక ఫోర్), డేవిడ్ వార్నర్, మ్యాక్స్‌వెల్‌లను(7: 10 బంతుల్లో) పెవిలియన్‌కు పంపాడు. తను వేసిన ప్రతి ఓవర్లో పాకిస్తాన్‌కు వికెట్ దక్కింది. కీపర్‌కు క్యాచ్ ఇచ్చిన డేవిడ్ వార్నర్ రివ్యూ కోరకుండా వెనుదిరిగాడు. అయితే రీప్లేలో బంతి బ్యాట్‌ను తాకలేదని కనిపించింది. 


ఆ తర్వాత మార్కస్ స్టోయినిస్ (40 నాటౌట్: 31 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు), కీపర్ మాథ్యూ వేడ్ (41 నాటౌట్: 17 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. చివరి నాలుగు ఓవర్లలో 50 పరుగులు చేయాల్సిన దశలో మూడు ఓవర్లలోనే వీరిద్దరూ మ్యాచ్‌ను ముగించారు. షహీన్ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ మూడో బంతికి హసన్ అలీ.. మ్యాథ్యూ వేడ్ క్యాచ్ వదిలేశాడు. అప్పటికి పాకిస్తాన్ విజయానికి 10 బంతుల్లో 20 పరుగులు కావాలి. క్యాచ్ వదిలేయడంతో రెండు పరుగులు పూర్తి చేశాక.. తర్వాత మూడు బంతుల్లో మూడు సిక్సర్లతో మ్యాథ్యూ వేడ్ మ్యాచ్‌ను పూర్తి చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 19 ఓవర్లలోనే విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది.


Also Read: Indian Team Squad: 'హిట్‌ మ్యాన్‌' శకం మొదలు..! కెప్టెన్‌గా ఎంపిక చేసిన బీసీసీఐ.. కివీస్‌ సిరీసుకు జట్టు ఎంపిక


Also Read: Rape Threats Arrest : క్రికెటర్ కుమార్తెకు అత్యాచార బెదిరింపుల కేసులో హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్ !


Also Read: ENG vs NZ, Match Highlights: మొదటిసారి ఫైనల్స్‌కు న్యూజిలాండ్.. బై.. బై.. ఇంగ్లండ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి