టీ20 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 166 పరుగులు సాధించగా.. న్యూజిలాండ్ 19 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ ఓపెనర్ డేరిల్ మిషెల్(72 నాటౌట్: 47 బంతుల్లో, నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. న్యూజిలాండ్ టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లోకి వెళ్లడం ఇదే మొదటిసారి కావడం విశేషం.


అదరగొట్టిన మొయిన్ అలీ


టాస్ ఓడి ఇంగ్లండ్ బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు అంత మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్లలో జోస్ బట్లర్ (29: 24 బంతుల్లో, నాలుగు ఫోర్లు) పర్వాలేదనిపించగా.. జానీ బెయిర్‌స్టో (13: 17 బంతుల్లో, రెండు ఫోర్లు) క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బందిగా కనిపించాడు. మొదటి వికెట్‌కు 37 పరుగులు జోడించిన అనంతరం బెయిర్‌స్టో అవుటయ్యాడు. పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో ఇష్ సోధి.. బట్లర్‌ను అవుట్ చేసి న్యూజిలాండ్‌కు రెండో వికెట్ అందించాడు. ఇంగ్లండ్ 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి కేవలం 67 పరుగులు మాత్రమే చేయగలిగింది.


ఆ తర్వాత డేవిడ్ మలన్ (41: 30 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), మొయిన్ అలీ (51 నాటౌట్: 37 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) వేగంగా ఆడటంతో స్కోరు పరుగులు పెట్టింది. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో డేవిడ్ మలన్ అవుటైనా.. లియాం లివింగ్ స్టోన్‌ (17: 10 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్)తో కలిసి మొయిన్ అలీ ఇన్నింగ్స్‌ను టాప్ గేర్‌కు చేర్చాడు. 20వ ఓవర్లో లియాం లివింగ్ స్టోన్ అవుటయ్యాడు. వెంటనే బౌండరీతో మొయిన్ అలీ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 20 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ నాలుగు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. కివీ బౌలర్లలో సౌతీ, ఆడం మిల్నే, ఇష్ సోధి, జేమ్స్ నీషం తలో వికెట్ తీశారు.


నీషం, మిషెల్ షో
167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ పేలవంగా ప్రారంభం అయింది. 13 పరుగులకే కీలకమైన ఓపెనర్ గుప్టిల్(4: 3 బంతుల్లో), కెప్టెన్ కేన్ విలియమ్సన్‌లను(5: 11 బంతుల్లో) అవుట్ చేసి క్రిస్ వోక్స్ న్యూజిలాండ్‌కు భారీ షాక్ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత మరో ఓపెనర్ డేరిల్ మిషెల్(72 నాటౌట్: 47 బంతుల్లో, నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), డెవాన్ కాన్వే (46: 38 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) కలిసి న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను ట్రాక్ మీదకి తీసుకువచ్చారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించారు.


అనంతరం ఇన్నింగ్స్ 14వ ఓవర్లో కాన్వే అవుటయ్యాడు. వెంటనే గ్లెన్ ఫిలిప్స్(2: 4 బంతుల్లో) కూడా అవుట్ కావడంతో న్యూజిలాండ్ మళ్లీ కష్టాల్లో పడింది. న్యూజిలాండ్ విజయానికి 24 బంతుల్లో 57 పరుగులు కావాల్సిన దశలో క్రిస్ జోర్డాన్ వేసిన 17వ ఓవర్లో జిమ్మీ నీషం (27: 11 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 23 పరుగులు సాధించాడు. ఆ తర్వాత 18వ ఓవర్లో 14 పరుగులు, 19వ ఓవర్లో 20 పరుగులు రావడంతో మ్యాచ్ ముగిసిపోయింది. దీంతో 19 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ లక్ష్యాన్ని ఛేదించింది. మొదటి సారి ఫైనల్లోకి దూసుకెళ్లింది.


Also Read: Ravi Shastri Coaching Record: ఇదీ రవిశాస్త్రి అంటే..! మీమ్‌ క్రియేటర్లూ.. మీకు తెలియని శాస్త్రిని చూడండి ఓసారి..!


Also Read: T20 World Cup: టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా ముందుగానే నిష్క్రమించటానికి ప్రధాన కారణాలేంటి?


Also Read: Team India 'RRR' Glimpse: టీమ్‌ఇండియా క్రికెట్‌ చరిత్రలో సరికొత్తగా 'RRR' శకం..! ఎవరీళ్లు? ఏం చేస్తారు?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి