సోషల్‌ మీడియాలో మీమ్స్‌ చూస్తే నవ్వొస్తుంది. మనసు గిలిగింతలు పెడుతుంది. కానీ ఆ మీమ్స్‌ అవతలి వ్యక్తిని పూర్తిగా అంచనా వేస్తాయా? అవతలి వారిని నొప్పించకుండా ఉంటాయా? ఒక వ్యక్తిలోని నిజమైన అంతరంగాన్ని ఆవిష్కరిస్తాయా? అంటే లేదనే చెప్పాలి. టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి వ్యక్తిత్వమే ఇందుకు ఉదాహరణ!


టీమ్‌ఇండియా ఓడిపోయినప్పుడల్లా రవిశాస్త్రిపై దారుణంగా ట్రోలింగ్‌ జరుగుతుంది! అతడు రెండు చేతుల్లో రెండు వైన్‌ బాటిళ్లు పెట్టి మద్యపాన వ్యసనపరుడిగా చిత్రీకరిస్తుంటారు. అతడు జట్టు గెలుపు కోసం వ్యూహాలే రచించనట్టుగా విమర్శిస్తుంటారు. ఆటగాళ్లను పట్టించుకోనట్టే చూపిస్తుంటారు. నిజానికి రవిశాస్త్రి వ్యక్తిత్వం గురించి చాలామందికి తెలియదు. అతడి మ్యాన్‌ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌, అతడి మాటల్లోని పదును, ఆటగాళ్లలో స్ఫూర్తినింపే తీరు ఎంతో మందికి తెలియదు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో నిష్క్రమణ తర్వాత అతడిపై ట్రోలింగ్‌ బాధాకరం!


కీలక సమయంలో ఎంట్రీ
నిజానికి రవిశాస్త్రి చాలా విచిత్రమైన పరిస్థితుల్లో టీమ్‌ఇండియాలోకి అడుగుపెట్టాడు. ఎంఎస్‌ ధోనీ సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ అతడిపై విమర్శలు వస్తున్నాయి. అప్పుడప్పుడే విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలో మెల్లమెల్లగా ఎదుగుతున్నాడు. విదేశాల్లో వరుస సిరీసులు గెలిపించిన దాఖలాలు లేవు. అలాంటి స్థితిలో శాస్త్రి కోచింగ్‌ బాధ్యతలు చేపట్టాడు. అటు సీనియర్లు ఇటు జూనియర్ల మేళవింపుతో జట్టు కూర్పును మెరుగుపర్చేందుకు ప్రయత్నించాడు. ఆటగాళ్ల మానసిక ధోరణిలో మార్పు తెచ్చాడు. విదేశాల్లో టెస్టు విజయాలు అందించాడు. ఐదేళ్లలో తనదైన ముద్ర వేశాడు. ఈ కాలంలో టీమ్‌ఇండియా 42లో 24 టెస్టులు, 79లో 53 వన్డేలు, 67లో 43 టీ20లు గెలిచింది. మొత్తంగా అన్ని ఫార్మాట్లలో విజయాల శాతం 65 మీదే.


కలిసిపోయే తత్వం
శాస్త్రి ఆటగాళ్లతో సులభంగా కలిసిపోతాడు. మ్యాన్‌ మేనేజ్‌మెంట్‌లో అతడికి తిరుగులేదు. ఎప్పుడు ఏది మాట్లాడాలో అదే మాట్లాడతాడు! ఒకసారి ధర్మశాల టెస్టులో టీమ్‌ఇండియా చిత్తుగా ఓడిపోయింది. మ్యాచ్‌ ముగిశాక ఆటగాళ్లను శాస్త్రి పిలిచాడు. అతడి చేతిలో తిట్లు ఖాయమే అనుకున్నారంతా! కానీ అతడు అంత్యాక్షరి ఆడించాడు. ఆ రోజు రాత్రి 2 గంటల వరకు ధోనీ హిందీపాటలు పాడుతూ గడిపాడు. ఇది కుర్రాళ్లలో ప్రేరణనింపింది. ఒత్తిడిని మాయం చేసింది. మహ్మద్‌ షమీ కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడ్డప్పుడూ అతడి ఫోకస్‌ను క్రికెట్‌వైపు మలిపాడు. ఒక అంశంపై ఏకాగ్రత ఎలా నిలపాలో నేర్పించాడు. అతడి మాటలు నిజానికి మంత్రముగ్ధుల్ని చేస్తాయని సహచరులు అంటుంటారు! వాషింగ్టన్‌ సుందర్‌ టెస్టుల్లో అదరగొడతాడని ఎంతో నమ్మాడు. అతడిలో ఆ ఆత్మవిశ్వాసం కల్పించాడు. ఆస్ట్రేలియా సిరీసులో అదే నిజమైంది. కుర్రాళ్లలోని అసలు సిసలు బలాన్ని గుర్తించి మెరుగులు దిద్దడంలో శాస్త్రి మేటి!




మాటల్లో తిరుగులేదు
క్రికెటర్లలో శాస్త్రి ప్రేరణనింపుతాడు. బుమ్రా గాయాల పాలైనప్పుడు 'బూమ్‌, మేమంతా నిన్ను మిస్సవుతున్నాం. నువ్వొక ఛాంపియన్‌. ఈ గాయం నీ బౌలింగ్‌పై ప్రభావం చూపించదు' అని చెప్పాడు. కోల్‌కతాలో ఓ టెస్టు సిరీసుకు ముందు కుల్‌దీప్‌ యాదవ్‌ ఆత్మవిశ్వాసం కోల్పోయాడు. ఫిట్‌నెస్‌ ఇబ్బందులతో ఉన్న అతడికి ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హర్ట్‌ సాయం చేస్తున్నాడు. దీనిని గమనించిన శాస్త్రి ' కుల్‌దీప్‌ ఈ రోజు నువ్వే మ్యాచును గెలిపిస్తున్నావు. కాలర్‌ పైకి అనుకో. జట్టును ఎలా గెలిపించాలన్న ఆలోచనతో నేరుగా మైదానంలోకి వెళ్లు' అని చెప్పాడు. ఆ మ్యాచులో అతడు హ్యాట్రిక్‌ తీశాడు. టెస్టుల్లో ఓపెనింగ్ చేసే ముందు రోహిత్‌ శర్మ ఎంతో మథనపడ్డాడు. అలాంటి సమయంలో శాస్త్రి ఏకంగా రెండున్నర గంటలు అతడితో అన్ని రకాలుగా మాట్లాడాడు. అవసరం అనుకుంటే శాస్త్రి కోప్పడతాడు. రిషభ్‌ పంత్‌ను అలాగే మ్యాచ్‌ విన్నర్‌ను చేశాడు.


అధికారం ధిక్కరించడు!
శాస్త్రి నిబంధనలను గౌరవించే వ్యక్తి! ఇతరుల అధికార పరిధిలోకి అస్సలు చొరబడడు. సెలక్షన్‌ కమిటీ, కెప్టెన్‌ నిర్ణయాలను గౌరవిస్తాడు. ఫలానా ఆటగాళ్లను తీసుకుంటే మంచిదని, జట్టు అవసరాలకు ఏ మేరకు సరిపోతాడో వివరిస్తాడు. అంతేకానీ చెప్పిన ఆటగాడిని కచ్చితంగా తీసుకోవాలని పట్టుబట్టడు. అందుకే కోహ్లీ ప్రతి మ్యాచుకు ఆటగాళ్లను మార్చినా ఏం అన్లేదు. కోచింగ్‌ సహచరులతోనూ వ్యక్తిగత, అనవసర విషయాలు చర్చించడు. ఎప్పుడూ క్రికెట్‌ గురించే మాట్లాడతాడు. 1980ల్లో వెస్టిండీస్‌ జట్టు, వారి విజయాలు, వారిని టీమ్‌ఇండియా ఎదుర్కొన్న వైనం గురించి రోజులు తరబడి మాట్లాడేస్తాడట. వ్యూహరచనలోనూ అతడు దిట్టే. ఆస్ట్రేలియా సిరీసులో కుర్రాళ్లతో మిడిల్‌అండ్‌ లెగ్‌స్టంప్స్‌తో బౌలింగ్‌ చేయించాడు. తొలిరోజే అశ్విన్‌తో బౌలింగ్‌ చేయించాడు. బయట ప్రపంచానికి తెలియని కోణాలు, విశేషాలు అతడితో చాలా ఉన్నాయి.


థాంక్యూ.. శాస్త్రీజీ!
ఒక కోచ్‌గా రవిశాస్త్రి విజయవంతం అయ్యాడనే చెప్పాలి. టెస్టు క్రికెట్లో టీమ్‌ఇండియాను ఎదురులేని జట్టుగా మలిచాడు. విదేశీ పిచ్‌లపై ఫిర్యాదు చేయకుండా వాటిపై ఆడేలా జట్టును తయారు చేశాడు. కొందరు ఆటగాళ్లను తీర్చిదిద్దాడు. అయితే ఐసీసీ ట్రోఫీలు అందించకపోవడం మాత్రం అసంతృప్తే. ఆ విషయం అతడికీ తెలుసు. ఏదేమైనా అతడు టీమ్‌ఇండియాకు చేసిన సేవకు 'ధన్యవాదాలు'!


Also Read: అయిపాయె..! అటు టీమ్‌ఇండియా ఇటు అఫ్గాన్‌ ఔట్‌.. సెమీస్‌కు కివీస్‌


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి