సెలక్షన్‌ కమిటీ ఎంపికలపై ప్రభావం చూపిస్తున్నాడన్న ఆరోపణలను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కొట్టిపారేశారు. కొన్నేళ్లు టీమ్‌ఇండియాకు నాయకత్వం వహించిన తనకు నిబంధనల గురించి తెలుసన్నారు. అసలు అలాంటి ఆరోపణలపై స్పందించాల్సిన అవసరమే లేదన్నారు. సంబంధం లేని ఒక పాత్ర చిత్రాన్ని పట్టుకొని వదంతులు సృష్టిస్తున్నారని వెల్లడించారు.


టీమ్‌ఇండియా నాయకత్వ బాధ్యతలను విరాట్‌ కోహ్లీ వదిలేసినప్పటి నుంచి గంగూలీపై విమర్శలు పెరిగాయి. దురుద్దేశ పూర్వకంగానే విరాట్‌ను తొలగించేందుకు ఒత్తిడి చేశాడని వదంతులు వచ్చాయి. పైగా నిబంధనలకు విరుద్ధంగా సెలక్షన్‌ కమిటీ సమావేశాల్లో పాల్గొంటున్నాడని వార్తలు వచ్చాయి. వాటిపై గంగూలీ ఆచితూచి   స్పందిస్తున్నారు.


'ఈ విషయంపై ఎవరికీ నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నిరాధార ఆరోపణలకు స్పందించి వాటికి గౌరవం తేలేను! నేను బీసీసీఐకి అధ్యక్షుడిని. ఒక అధ్యక్షుడి బాధ్యతలనే నేను నెరవేరుస్తాను. నేను సెలక్షన్‌ కమిటీ సమావేశంలో పాల్గొన్నట్టు సోషల్‌ మీడియాలో ఓ చిత్రాన్ని చూశాను. మీ అందరికీ స్పష్టంగా చెబుతున్నా. అది సెలక్షన్‌ కమిటీ సమావేశమే కాదు. జయేశ్‌ జార్జ్‌ అసలు సెలక్షన్ కమిటీ సమావేశాల్లోనే ఉండడు. నేను టీమ్‌ఇండియాకు 424 అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడాను. దీని గురించి మళ్లీ మళ్లీ గుర్తు చేయాల్సిన అవసరం లేదనే అనుకుంటున్నా' అని గంగూలీ అన్నారు.


బోర్డు కార్యదర్శి జే షా, అరుణ్‌ ధుమాల్‌, జయేశ్‌ జార్జ్‌తో తన అనుబంధం బాగుందని దాదా వెల్లడించారు. జే షా తనకు ప్రియమైన మిత్రుడు, నమ్మకస్థుడైన సహచరుడని పేర్కొన్నారు. కొవిడ్‌-19 వేధిస్తున్నా గత రెండేళ్లుగా తామంతా కలిసి భారత క్రికెట్‌ కోసం పనిచేశామని తెలిపారు. ఒక బృందంగా తామంతా బాగా పనిచేశామని స్పష్టం చేశారు.


అన్ని పరామితులను అనుసరించే టీమ్‌ఇండియాకు టెస్టు కెప్టెన్‌ను ఎంపిక చేస్తామన్నారు. వచ్చే ఏడాది పూర్తి స్థాయిలో మహిళల ఐపీఎల్‌ ఉంటుందని వెల్లడించారు. టీమ్‌ఇండియా 1000 వన్డే నేపథ్యంలో ఎలాంటి సంబరాలు నిర్వహించడం లేదన్నారు. కరోనా వల్ల ఆటగాళ్లందరూ బయో బడుగల్లోనే ఉంటున్న విషయం గుర్తు చేశారు. అహ్మదాబాద్‌, కోల్‌కతా మ్యాచులు అభిమానులు లేకుండానే జరుగుతాయని వెల్లడించారు.


Also Read: Virat Kohli Record: సచిన్‌ మరో రికార్డుకు కోహ్లీ ఎసరు! వెస్టిండీస్‌పై మరో 6 పరుగులు చేస్తే..!


Also Read: Sourav Ganguly: ఐపీఎల్ 2022 ఇక్కడే.. త్వరలో మహిళల ఐపీఎల్ కూడా.. గంగూలీ ఏమన్నారంటే?


Also Read: India Enters U19 Finals: కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు.. అండర్-19 ప్రపంచకప్ సెమీస్‌లో ఆసీస్‌పై ఘనవిజయం.. ఫైనల్స్ గెలిస్తే చరిత్రే!