వెస్టిండీస్‌తో సిరీసుకు ముందు టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. వన్డే క్రికెట్లో అతడు మరో ఆరు పరుగులు చేస్తే సచిన్‌ తెందూల్కర్‌ రికార్డును బద్దలు కొట్టేస్తాడు. అతి తక్కువ ఇన్నింగ్సుల్లోనే ఉపఖండంలో 5000 పరుగులు చేసిన క్రికెటర్‌గా ఆవిర్భవిస్తాడు.


సొంతగడ్డపై అభిమానుల ముంగిట పరుగులు చేయాలని ప్రతి క్రికెటర్‌ కోరుకుంటాడు. ఇప్పుడు అలాంటి సందర్భం విరాట్‌ కోహ్లీకి వచ్చింది. ఇప్పటి వరకు భారత గడ్డపై కోహ్లీ 98 వన్డేలు ఆడాడు. 60.16 సగటు, 96.59 స్ట్రైక్‌రేట్‌తో 4994 పరుగులు సాధించాడు. ఇందుకోసం 5170 బంతులు ఎదుర్కొన్నాడు. 19 సెంచరీలు, 25 అర్ధశతకాలు సాధించాడు. అతడు మరో 6 పరుగులు చేస్తే భారత్‌లో 5000 పరుగులు సాధించిన క్రికెటర్‌గా అవతరిస్తాడు.


ఇంతకు ముందు భారత్‌లో వన్డే క్రికెట్లో 5000 పరుగులు చేసిన ఘనత ఒక సచిన్‌ తెందూల్కర్‌కు మాత్రమే ఉంది. అతడు 121 ఇన్నింగ్సుల్లో వెస్టిండీస్‌పైనే ఈ రికార్డు సృష్టించాడు. ఫిబ్రవరి 6న టీమ్‌ఇండియా అహ్మదాబాద్‌లోని మొతేరా వేదికగా వెస్టిండీస్‌తో తొలి వన్డేలో తలపడబోతోంది. కోహ్లీ కెరీర్లో ఇది 96వ ఇన్నింగ్స్‌ అవుతుంది. ఆ మ్యాచులో 6 పరుగులు చేస్తే అతి తక్కువ ఇన్నింగ్సుల్లో భారత గడ్డపై 5000 పరుగులు చేసిన క్రికెటర్‌గా అతడు అవతరిస్తాడు.


ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ ప్రశాంతంగా ఉన్నాడు. కెప్టెన్సీ రచ్చ నుంచి ఇప్పుడిప్పుడే సాంత్వన పొందుతున్నాడు. వెస్టిండీస్‌ సిరీసుకు సన్నద్ధం అవుతున్నాడు. అతడు జట్టు కోసం కీలక భాగస్వా్మ్యాలు నెలకొల్పుతున్నా సెంచరీ చేయక మూడేళ్లవుతోంది. అతడు సెంచరీల కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి గనక అతడు శతకం అందుకున్నాడంటే ఇక పరుగుల వరద పారించడం ఖాయమే!


భారత్‌, వెస్టిండీస్‌ మధ్య ఫిబ్రవరి 6, 9, 11న  మొతేరాలో వన్డేలు జరుగుతాయి. ఫిబ్రవరి 16, 18, 20న కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌లో టీ20లు జరుగుతాయి. ఈ సిరీసుకు ముందు టీమ్‌ఇండియాను కరోనా మహమ్మారి వెంటాడింది. శిఖర్ ధావన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, నవదీప్‌ సైని, శ్రేయస్‌ అయ్యర్‌కు వైరస్‌ సోకింది. దాంతో వారిని క్వారంటైన్‌కు పంపించారు. ఓపెనర్‌గా మయాంక్‌ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుతం జట్టు సాధన చేస్తోంది.


Also Read: Sourav Ganguly: ఐపీఎల్ 2022 ఇక్కడే.. త్వరలో మహిళల ఐపీఎల్ కూడా.. గంగూలీ ఏమన్నారంటే?


Also Read: India Enters U19 Finals: కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు.. అండర్-19 ప్రపంచకప్ సెమీస్‌లో ఆసీస్‌పై ఘనవిజయం.. ఫైనల్స్ గెలిస్తే చరిత్రే!