ఆస్ట్రేలియాతో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ సెమీస్‌లో టీమిండియా 96 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. 291 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన  ఆస్ట్రేలియా 41.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. భారత కెప్టెన్ యష్ ధుల్ (110: 110 బంతుల్లో, పది ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీ చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ షేక్ రషీద్ (94: 108 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్) త్రుటిలో సెంచరీ మిస్ అయ్యాడు. ఆస్ట్రేలియా జట్టులో లక్లన్ షా (51: 66 బంతుల్లో, నాలుగు ఫోర్లు) మాత్రమే అర్థ సెంచరీ సాధించాడు.  ఫిబ్రవరి ఐదో తేదీన జరగనున్న ఫైనల్లో భారత్.. ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ భారత్ గెలిస్తే.. అత్యధిక అండర్-19 వరల్డ్ కప్ ట్రోఫీలు గెలిచిన జట్టుగా భారత్ నిలవనుంది.


టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఇన్నింగ్స్ మందకొడిగా మొదలు అయింది. మొదటి వికెట్‌కు 7.4 ఓవర్లలో 16 పరుగులు జోడించాక ఓపెనర్ ఆంగ్‌క్రిష్ రఘువంశీ (6 : 30 బంతుల్లో) అవుటయ్యాడు. అనంతరం వెంటనే 13వ ఓవర్లో 37 పరుగుల వద్ద మరో ఓపెనర్ హర్‌నూన్ సింగ్ (16: 28 బంతుల్లో, మూడు ఫోర్లు) కూడా పెవిలియన్ బాట పట్టడంతో టీమిండియా కష్టాల్లో పడింది.


అయితే వన్‌డౌన్ బ్యాటర్ షేక్ రషీద్, కెప్టెన్ యష్ ధుల్ జట్టును ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 33.2 ఓవర్లలోనే 204 పరుగులు జోడించి భారీ స్కోరుకు బాటలు వేశారు. వీరిద్దరూ 46వ ఓవర్లో వరుస బంతుల్లో అవుటవ్వడమే కాస్త దురదృష్టకరం. కేవలం ఆరు పరుగుల తేడాలో రషీద్ సెంచరీ మిస్ అయింది. చివర్లో దినేష్ బానా (20 నాటౌట్: 4 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) మెరుపు వేగంతో ఆడటంతో భారత్ 50 ఓవరల్లో ఐదు వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో జాక్ నిస్బెట్, విలియమ్ సల్జ్‌మాన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.







291 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు కూడా ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్లోనే సూపర్ ఫాంలో ఉన్న టీగ్ వైల్ (1: 3 బంతుల్లో) అవుటయ్యాడు. రెండో వికెట్‌కు క్యాంప్‌బెల్ కెల్లావే (30: 53 బంతుల్లో, ఒక ఫోర్), కోరే మిల్లర్ (38: 46 బంతుల్లో, ఆరు ఫోర్లు) 68 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే ఆ తర్వాత లక్లన్ షా మినహా ఎవరూ సరిగ్గా ఆడకపోవడంతో ఆస్ట్రేలియా 41.5 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో విక్కీ ఓస్ట్వాల్ మూడు వికెట్లు తీశాడు. రవి కుమార్, నిషాంత్ సింధులకు రెండేసి వికెట్లు దక్కాయి. కౌషల్ తంబే, రఘువంశీ చెరో వికెట్ పడగొట్టారు.


ఇప్పటివరకు టీమిండియా అండర్-19 వరల్డ్ కప్‌లో ఏడు సార్లు ఫైనల్ చేరింది. 2000, 2008, 2012, 2018 సంవత్సరాల్లో భారత్ కప్పు కొట్టగా.. 2006, 2016, 2020ల్లో ఓటమి పాలైంది. గత ప్రపంచ కప్ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలవడం మింగుడు పడని అంశం. అయితే భారత బ్యాటర్లు, బౌలర్లు తిరుగులేని ఫాంలో ఉండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. ఈ కప్ కొడితే యువ కెప్టెన్ యష్ ధుల్.. మహ్మద్ కైఫ్ (2000 జట్టు కెప్టెన్), విరాట్ కోహ్లీ (2008), ఉన్ముక్త్ చంద్ (2012), పృథ్వీ షా (2018)ల సరసన చేరనున్నాడు.