కెప్టెన్‌గా ఆడుతున్నా..! ఆటగాడిగా ఆడుతున్నా..! తాను మాత్రం తగ్గేదే లే అంటున్నాడు విరాట్ కోహ్లీ! మ్యాచ్ ఆడేటప్పుడు ప్రత్యర్థిపై దూకుడు తగ్గించనని చెప్పకనే చెప్పాడు. దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో తెంబా బవుమాతో దూకుడుగా మాట్లాడటమే ఇందుకు కారణం!
పార్ల్ వేదికగా రెండు జట్లు తలపడ్డ సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ 36వ ఓవర్‌ను యుజ్వేంద్ర చాహల్ విసిరాడు. నాలుగో బంతిని తెంబా బవుమా షార్ట్ కవర్స్‌లోకి ఆడాడు. ఆ బంతిని అందుకున్న కోహ్లీ వెంటనే రిషభ్ పంత్‌కు విసిరాడు. కానీ అది బవుమా క్రీజులోకి అడుగుపెడుతుండగా మీద నుంచి వెళ్లింది. ఇది నచ్చని అతడు కోహ్లీని ఏదో అన్నాడు. అప్పుడు తన స్థానానికి వెళ్తున్న కోహ్లీ వెంటనే వెనక్కి తిరిగి బవుమాను గట్టిగా ఏదో అన్నాడు. అక్కడితో ఆ ఘటన ముగిసింది. అంతకు మించి వివాదం ముదరలేదు!
ఇన్నాళ్లు టీమ్‌ఇండియా కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచులో ఒక సాధారణ ఆటగాడిగా ఆడాడు. దాంతో అందరి చూపూ అతడి వైపే ఉంది. మునుపటితో పోలిస్తే అతడు మైదానంలో అంత చురుకుగా కనిపించలేదు. కొన్ని బంతులు మిస్‌ఫీల్డ్ కూడా అయ్యాయి. అయితే జట్టులోని ఆటగాళ్లతో మాత్రం కలివిడిగానే ఉన్నాడు. వికెట్లు తీస్తున్నప్పుడు సహచరులను ఉత్తేజపరుస్తూ కనిపించాడు. అవసరమైనప్పుడు మాత్రం ప్రత్యర్థిని కవ్వించేందుకు మాత్రం విరాట్ వెనుకాడలేదు. ఎప్పటిలాగే 'తగ్గేదే లే' అన్నట్టు ప్రవర్తించాడు.
ఈ మ్యాచులో సఫారీలు దుమ్మురేపారు! టీమ్‌ఇండియాతో తొలి వన్డేలో ఇరగదీశారు! కఠిన పిచ్‌పై తెంబా బవుమా (110; 143 బంతుల్లో 8x4 ) అద్వితీయ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. శతకంతో మురిశాడు. అతడికి తోడుగా వాన్ డర్ డుసెన్ (129*; 96 బంతుల్లో 9x4, 4x6) అజేయ శతకం బాదేసిన వేళ దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ సేనకు 297 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. వికెట్లు తీసేందుకు టీమ్‌ఇండియా బౌలర్లు శ్రమించాల్సి వచ్చింది. జస్ప్రీత్ బుమ్రా 2, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తీయడం గమనార్హం.
Also Read: Team India Next Captain: విరాట్ కోహ్లీ వారసుడి పేరు సూచించిన గావస్కర్..! లాజిక్ ఇదే!
Also Read: Mohammed Siraj on Kohli: నువ్వెప్పుడూ నా కెప్టెనే! ధోనీకి కోహ్లీ.. కోహ్లీకి సిరాజ్!
Also Read: Lucknow IPL Franchise: కేఎల్ రాహుల్ ఓకే! లఖ్‌నవూ మిగతా ఆటగాళ్లెవరో తెలుసా!!