Virat Kohli Steps down: విరాట్‌ కోహ్లీ తర్వాత సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్‌ఇండియాను ముందుకు నడిపించే నాయకుడు ఎవరు? శనివారం విరాట్‌ ఇచ్చిన షాక్‌ తర్వాత మొదలైన చర్చ ఇది. మాజీ క్రికెటర్లకు తమకు నచ్చిన పేర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ టీమ్‌ఇండియా వికెట్‌కీపర్‌ రిషభ్ పంత్‌ పేరు సూచిస్తున్నారు. ఇందుకు కారణాలు వివరించారు.


'టీమ్‌ఇండియాను ఇకపై ఎవరు ముందుకు తీసుకెళ్తారన్నది సెలక్షన్‌ కమిటీకి ఆందోళన తప్పదు! మూడు ఫార్మాట్లు ఆడుతున్న వారికే తొలి ప్రాధాన్యం ఉంటుంది. ఆ తర్వాత ఎంపిక సులభం అవుతుంది. నన్నడిగితే, భారత తర్వాత కెప్టెన్‌గా రిషభ్‌ పంత్‌ పేరే చెబుతాను. రికీ పాంటింగ్‌ దిగిపోయాక ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ఎంపికయ్యాడు. ఆ తర్వాత అతడి బ్యాటింగ్‌ ఎంతో మారింది. అతడు నిలకడగా చేసే 30, 40, 50లు ఆ తర్వాత అందమైన సెంచరీలు, డబుల్‌ సెంచరీలుగా మారిపోయాయి. పంత్‌ విషయంలోనూ నేనిదే చెబుతాను' అని సన్నీ అన్నాడు.


'బాధ్యత అనేది రిషభ్ పంత్‌ మరిన్ని పరుగులు చేసేందుకు ఉపయోగపడుతుంది. న్యూలాండ్స్‌లో అతడెంత అందమైన సెంచరీ కొట్టాడో మనం చూశాం. అందుకే చెబుతున్నా. నారీ కాంట్రాక్టర్‌ గాయపడటంతో 21 ఏళ్ల వయసులోనే టైగర్‌ పటౌడీ కెప్టెన్సీ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నీటిలోని బాతులా అతడు నాయకత్వం వహించాడు. ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు నాయకుడిగా ఎంపికయ్యాకా రిషభ్‌ పంత్‌ అలాగే కనిపించాడు. అతడు టీమ్‌ఇండియాకు చక్కగా ముందుకు తీసుకుపోగలడని నా నమ్మకం. జట్టును మరింత ఆసక్తికరంగా మార్చేస్తాడు' అని గావస్కర్‌ పేర్కొన్నాడు.


టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్‌ కోహ్లీ తప్పుకోవడం అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే.  హఠాత్తుగా అతడు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడోనని అంతా ఆశ్చర్య పోతున్నారు. ఇక అభిమానులైతే హార్ట్‌ బ్రేక్‌ అయిందంటూ పోస్టింగులు పెడుతున్నారు. మరోవైపు అతడి సేవలను కొనియాడుతూ చాలామంది మాజీ క్రికెటర్లు, ఆటగాళ్లు కృతజ్ఞతలు తెలియజేశారు.


'టెస్టు జట్టును అత్యున్నత శిఖరాలకు చేర్చిన టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నాయకత్వ లక్షణాలను బీసీసీఐ అభినందిస్తోంది. అతడి కెరీర్‌ పట్ల అభినందనలు తెలియజేస్తున్నాం. భారత జట్టును అతడు 60 మ్యాచుల్లో నడిపించాడు. 40 విజయాలతో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు' అని బీసీసీఐ ట్వీట్‌ చేసింది. 'నువ్వేమైనా చేయి. టెస్టు క్రికెట్‌ నుంచి మాత్రం వెళ్లిపోవద్దు. కనీసం కొన్నైళ్ల వరకైనా ఆడాలి. నీ నిష్క్రమణను తట్టుకొనేందుకు మేం రెడీగా లేము' అని గౌరవ్‌ కపూర్‌ అన్నాడు.


Also Read: ప్రపంచంలోని బెస్ట్‌ కెప్టెన్‌లలో కోహ్లీ స్థానం ఇదే! ఫ్యాన్స్‌ డోన్ట్‌ వర్రీ ప్లీజ్‌!!


Also Read: ఈ రికార్డులు ఎవరైనా కొడతారా.. మళ్లీ తనే ట్రై చేయాలా..విరాట్ తిరుగులేని కెప్టెన్సీ రికార్డులు!


Also Read: షాక్‌..! టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ గుడ్‌బై.. బీసీసీఐ, ధోనీకి థాంక్స్‌ చెబుతూ లేఖ