దేశమంతా మకర సంక్రాంతి పండుగను ఆహ్లాదకరంగా జరుపుకుంటున్న వేళ..! టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఊహించని షాకిచ్చాడు. సుదీర్ఘ ఫార్మాట్‌ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు. కొత్త ఏడాదిలో సరికొత్త రికార్డులు సృష్టిస్తాడని.. సెంచరీల వరద పారిస్తాడని ఆశగా ఎదురు చూస్తున్న అభిమానుల గుండెలు బద్దలు చేశాడు! 







ఏడేళ్ల సారథ్యంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశానని కోహ్లీ చెప్పాడు. తనకు అవకాశం ఇచ్చిన బీసీసీఐ, తనను వ్యక్తిగా, ఆటగాడిగా వెలుగులోకి తీసుకొచ్చిన ఎంఎస్ ధోనీకి ధన్యవాదాలు తెలిపాడు. సోషల్‌ మీడియాలో సుదీర్ఘ లేఖను పోస్టు చేశాడు.


2014, ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు కెప్టెన్‌గా ఎంపికైన విరాట్‌ కోహ్లీ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీసు ఓటమి తర్వాత ఆ బాధ్యతల నుంచి నిష్క్రమించాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఏం జరిగిందో తెలియదు! జట్టు యాజమాన్యం ఏమైనా అందా తెలియదు! నాయకుడిగా జట్టును ముందుకు నడిపించలేక పోతున్నానని భావించాడా తెలియదు! వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం బాధించిందా తెలియదు! అనూహ్య నిర్ణయమైతే తీసుకున్నాడు. ఇక ఆటగాడిగానే కొనసాగనున్నాడు.






'టీమ్‌ఇండియాను నడిపించేందుకు ఏడేళ్లుగా శక్తివంచన లేకుండా ప్రతి రోజూ కష్టపడ్డాను. అత్యంత నిజాయితీతో నా బాధ్యతలు నిర్వర్తించాను. ఏ పనైనా ఏదో ఒక చోట వదిలేయాల్సిందే. నా వరకు టెస్టు సారథిగా ఆ సమయం ఇప్పుడే! ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు చవిచూశాను. ఎప్పుడూ నమ్మకంతోనే ఉన్నాను. ప్రతి క్షణం శ్రమించాను. నేను చేసే ప్రతి పనిలో 120 శాతం కష్టపడ్డాను. అలా చేయకపోతే సరికాదనే నా అభిప్రాయం. నా హృదయంలో ఎంతో స్పష్టత ఉంది. నా జట్టును నేను మోసం చేయలేను' అని విరాట్‌ లేఖలో ప్రస్తావించాడు.


'సుదీర్ఘ కాలం నా దేశాన్ని నడిపించేందుకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు. అలాగే నా దార్శనికతను పంచుకున్న, ఎక్కడా వదిలేయని జట్టులోని ప్రతి ఆటగాడికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ ప్రయాణాన్ని మీరే అందంగా తీర్చిదిద్దారు. టెస్టు క్రికెట్‌లో నిరంతరం ముందుకెళ్లేలా ఈ వాహనం ఇంజిన్‌కు మద్దతిచ్చిన రవిశాస్త్రి, సహాయ బృందానికి ధన్యవాదాలు. ఈ విజన్‌ కోసం మీరంతా ఎంతో కష్టపడ్డారు. చివరగా ఎంఎస్‌ ధోనీకి బిగ్‌ థాంక్స్‌. ఒక కెప్టెన్‌గా ఆయన నన్ను నమ్మాడు. భారత క్రికెట్‌ను ముందుకు నడిపించే వ్యక్తిగా నన్ను గుర్తించాడు' అని కోహ్లీ పేర్కొన్నాడు.


Also Read: IND vs SA, 3rd Test: కోహ్లీ.. స్టంప్‌మైక్‌ వద్ద ఆ మాటలేంటి? ఇంకేం ఆదర్శంగా ఉంటాడని గౌతీ విమర్శ


Also Read: IND vs SA: 1 గెలిచి 2 ఓడటం: మనకిదేం కొత్త కాదు బాబూ.. ఓసారి వెనక్కి వెళ్లండి!!


Also Read: IND vs SA ODI Series Schedule: టెస్టు సిరీసు పోయింది! ఇక వన్డేల్లోనైనా గెలుస్తారా? షెడ్యూలు ఇదే