ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ఇండియాకు ఓ సిరీస్‌ ఓటమి ఎదురైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీసులో 1-2 తేడాతో ఓటమి చవిచూసింది. మొత్తంగా సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసే పరిస్థితుల నుంచి ఓటమి బాట పట్టింది. మరికొన్ని రోజుల్లోనే సఫారీ జట్టుతో వన్డే సిరీస్‌లో తలపడబడబోతోంది.


వన్డే షెడ్యూలు
మూడో టెస్టు తర్వాత టీమ్‌ఇండియా నాలుగు రోజులు విశ్రాంతి తీసుకుంటుంది. జనవరి 19న పార్ల్‌లో బొలాండ్‌ పార్క్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో తలపడుతుంది. ఇదే వేదికలో జనవరి 21న రెండో వన్డే ఆడుతుంది. సిరీసులో చివరిదైన మూడో వన్డేను మాత్రం కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌ మైదానంలోనే ఆడనుంది. ఈ మ్యాచ్‌ జనవరి 23,  ఆదివారం జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచులన్నీ మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతాయి.


వాస్తవంగా దక్షిణాఫ్రికాతో టీమ్‌ఇండియా మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సింది. పర్యటనకు ముందు భారత క్రికెట్లో జరిగిన కొన్ని పరిణామాల వల్ల షెడ్యూలు మారింది. విరాట్‌ కోహ్లీని వన్డే  కెప్టెన్సీ నుంచి తప్పించడం, దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ వేరియెంట్‌ విస్తృతంగా వ్యాపించడంతో టీ20 మ్యాచులను వాయిదా వేశారు. ముందుగా జరగాల్సిన సుదీర్ఘ ఫార్మాట్‌ను వారం రోజులు వెనక్కి జరిపారు.


Also Read: IPL New Sponsor: వివో ఔట్‌! ఇకపై 'టాటా ఐపీఎల్‌'! చైనా కంపెనీకి గుడ్‌బై!!


Also Read: IPL Auction 2022 Date: క్రికెటర్లూ కాచుకోండి! ఇక డబ్బుల పండగే!! ఫిబ్రవరి 12, 13న ఐపీఎల్‌ మెగా వేలం


Also Read: Tata Group IPL Sponsor: మైదానంలో సిక్సర్ల వర్షం.. బీసీసీఐకి కాసుల వర్షం..! టాటా రావడంతో బోర్డుకు ఎంత డబ్బు వస్తోందంటే?


ఇక సఫారీ గడ్డపై టీమ్‌ఇండియా 30 ఏళ్ల చరిత్రను తిరగరాసే అవకాశం కోల్పోయింది. తొలిసారి అక్కడ టెస్టు సిరీసును గెలిచే అవకాశం చేజార్చుకుంది. బ్యాటర్ల వైఫల్యంతో ప్రత్యర్థికి తక్కువ లక్ష్యాలను నిర్దేశించింది. రెండో టెస్టులో డీఎన్‌ ఎల్గర్‌ ఆతిథ్య జట్టును గెలిపిస్తే మూడో టెస్టులో కీగన్‌ పీటర్సన్‌ భారత ఆశలను ఆవిరి చేశాడు.


మూడు టెస్టులో 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆడుతూ పాడుతూ మ్యాచ్ గెలిచేసింది. భారత బౌలర్లు దక్షిణాఫ్రికాను ఏ దశలోనూ ఇబ్బంది పెట్టలేకపోయారు. బుమ్రా, షమి, శార్దూల్ ఠాకూర్‌లకు తలో వికెట్ దక్కింది. కీగన్ పీటర్సన్ (82: 113 బంతుల్లో, 10 ఫోర్లు), వాన్ డర్ డసెన్ (41 నాటౌట్: 95 బంతుల్లో, మూడు ఫోర్లు), టెంపా బవుమా (32 నాటౌట్: 58 బంతుల్లో, ఐదు ఫోర్లు), డీన్ ఎల్గర్ (30: 96 బంతుల్లో, మూడు ఫోర్లు) రాణించారు.