యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌కు రాజీనామా చేసి బయటకు వచ్చిన స్వామి ప్రసాద్ మౌర్య ఈరోజు సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. యూపీ మాజీ సీఎం, సమజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సమక్షంలో ఆయన పార్టీలోకి చేరారు. ఎన్నికల సంఘం చెప్పిన కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా వర్చువల్ ర్యాలీగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మౌర్యతో పాటు ఆయన మద్దతుదారులు కూడా పెద్ద ఎత్తున పార్టీలో చేరారు.


9 మంది రాజీనామా..







స్వామి ప్రసాద్ మౌర్యతో మొదలైన రాజీనామాల పర్వం యూపీలో కొనసాగుతోంది. ఆయన రాజీనామా చేసిన తర్వాత 3 రోజుల్లో మరో 8 మంది ఎమ్మెల్యేలు భాజపాను వీడారు. అంటే మొత్తం 9 మంది రాజీనామా చేసినట్లైంది. ఇందులో ముగ్గురు మంత్రులు ఉన్నారు.


దళితులను విస్మరించారు..


స్వామి ప్రసాద్ మౌర్య ఓబీసీ వర్గానికి చెందిన బలమైన నాయకుడు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి 2016లో ఆయన భాజపాలో చేరారు. అప్పటి నుంచి అఖిలేశ్ యాదవ్ పార్టీకి ఓబీసీ ఓటర్లను దూరం చేసే ప్రణాళికల్లో ముఖ్యపాత్ర పోషించారు మౌర్య.


తాను రాజీనామా చేయడానికి దళితులపై భాజపా చిన్నచూపు వైఖరే కారణమని మౌర్య రాజీనామా పత్రంలో పేర్కొన్నారు.



దళితులు, వెనుకబడిన వర్గాలు, రైతులు, నిరుద్యోగ యువత, చిన్న వ్యాపారులను భాజపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఈ కారణంగానే నేను యోగి ఆదిత్యనాథ్ మంత్రి మండలికి రాజీనామా చేశాను. నా రాజీనామా.. భాజపాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో 2022 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తేలుతుంది.                                            "
- స్వామి ప్రసాద్ మౌర్య   






 

ఆయనే కారణమా?

 

యోగి ఆదిత్యనాథ్‌ నాయకత్వంపై యూపీ భాజపాలో అసంతృప్తి ఉందని ఇప్పటికే పలువురు నాయకులు బహిరంగంగానే చెప్పారు. అయితే ఇప్పుడు తాజాగా రాజీనామాలతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రెండు నెలల ముందే యోగి ఆదిత్యనాథ్ గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మౌర్య ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కానీ దాన్ని అధిష్ఠానం పెద్దగా పట్టించుకోలేదు.