జాక్‌పాట్‌ అంటే బీసీసీఐదే! చిటికేస్తే చాలు కనక వర్షం కురుస్తోంది! ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి వివో తప్పుకొని టాటా గ్రూప్‌ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలతో బీసీసీకి అదనంగా రూ.130 కోట్లు, మొత్తంగా రెండేళ్లకు రూ.1124 కోట్లు ఆదాయం రానుంది. ఇక కొత్త జట్ల వేలం, ప్రసార హక్కుల ద్వారా అర లక్ష కోట్లకు మించే రాబడి వస్తుందని అంచనా!


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగు ప్రధాన స్పాన్సర్‌ మారుతున్నట్టు ఐపీఎల్‌ పాలక మండలి ఛైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ మంగళవారం మీడియాకు తెలిపారు. ఇప్పటి వరకు కొనసాగుతున్న 'వివో' లీగుతో బంధం తెంచుకోనుందని వెల్లడించారు. దాని స్థానంలో భారతీయ కంపెనీ 'టాటా గ్రూప్‌' రానుందని వివరించారు. మంగళవారం జరిగిన సమావేశంలో ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్లను మార్చాలని పాలక మండలి నిర్ణయించింది. ఈ విషయం గురించి ప్రశ్నించగా 'అవును, ఐపీఎల్‌ టైటిల్‌ ప్రధాన స్పాన్సర్‌గా టాటా గ్రూప్‌ రానుంది' అని బ్రిజేశ్‌ పటేల్‌ పీటీఐకి తెలిపారు.


ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌కు ఎక్కువ క్రేజ్‌ ఉంటుంది. ఇందుకోసం చాలా కంపెనీలు పోటీపడుతుంటాయి. 2018-2022 కాలానికి ఈ హక్కులను చైనీస్‌ మొబైల్‌ కంపెనీ వివో దక్కించుకుంది. ఏడాదికి రూ.440 కోట్ల చొప్పున రూ.2200 కోట్లకు హక్కులను కైవసం చేసుకుంది. అయితే 2020లో గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో భారత సైనికుల ఘర్షణ తర్వాత పరిణామాలు మారిపోయాయి.


Also Read: IPL New Sponsor: వివో ఔట్‌! ఇకపై 'టాటా ఐపీఎల్‌'! చైనా కంపెనీకి గుడ్‌బై!!


Also Read: IPL Auction 2022 Date: క్రికెటర్లూ కాచుకోండి! ఇక డబ్బుల పండగే!! ఫిబ్రవరి 12, 13న ఐపీఎల్‌ మెగా వేలం


తాజా ఆర్థిక వ్యవహారానికి వస్తే.. కొత్త సీజన్లో రెండు కొత్త జట్లు రాబోతున్నాయి. అంటే మ్యాచులు సంఖ్య పెరుగుతుంది. ఒప్పందం ప్రకారం  2023 వరకు వివో స్పాన్సర్‌షిప్‌ ద్వారా బీసీసీఐకి రూ.996 కోట్లు లాభం వస్తుంది. సీజన్‌ వ్యవధి పెరుగుతుండటంతో ఏడాది రూ.440 కోట్ల బదులు 2022కు రూ.484 కోట్లు, 2023కు రూ.512 కోట్లు ఇచ్చేందుకు వివో సిద్ధమైంది.


ఇప్పుడు టాటా గ్రూప్‌ రంగంలోకి రావడంతో పరిణామాలు వేగంగా మారిపోయాయి. సీజన్‌కు రూ.335 కోట్లు బీసీసీఐకి ఇచ్చేందుకు టాటా సిద్ధమైందట. అంతేకాకుండా వివో ఎలాంటి ఇబ్బందులు, షరుతులు లేకుండా వెళ్లిపోయేముందు అసైన్‌మెంట్ ఫీజుతో కలిపి మరో రూ.450 కోట్లు ఇవ్వనుందని తెలిసింది. మొత్తంగా ఈ లావాదేవీల వల్ల రెండు సీజన్లకు బీసీసీఐకి రూ.1124 కోట్ల ఆదాయం వస్తుందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా రిపోర్టు చేసింది. వందేళ్ల వారసత్వం, ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రతిష్ఠలున్న టాటా గ్రూప్ లీగులో భాగస్వామిగా మారడంతో ఐపీఎల్‌ అత్యున్నత శిఖరాలు అధిరోహిస్తుందని బీసీసీఐ కార్యదర్శి జేషా ధీమా వ్యక్తం చేశారు.


Also Read: Ind vs SA, 3rd Test, 1st Day Highlights: 223 పరుగులకు ఇండియా ఆలౌట్.. విరాట్ సూపర్ ఇన్నింగ్స్.. ఆదరగొట్టిన రబాడ