టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై విమర్శల వర్షం కురుస్తోంది. అతడు యువతకు ఎలా ఆదర్శంగా నిలుస్తాడని మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. అతడు పరిణతి ప్రదర్శించడం లేదని మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. స్టంప్‌ మైక్‌ వద్ద మాట్లాడాల్సిన పద్ధతి అదికాదంటూ విమర్శించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే!!


కేప్‌టౌన్‌ వేదికగా భారత్‌, దక్షిణాఫ్రికా మూడో టెస్టులో తలపడుతున్న సంగతి తెలిసిందే. మూడో రోజు ఛేదనలో సఫారీ జట్టు 60/1తో ఉన్నప్పుడు రవిచంద్రన్‌ అశ్విన్‌ ఓ ఫ్లయిటెడ్‌ డెలివరీ వేశాడు. ఆ బంతి డీన్‌ ఎల్గర్‌ ప్యాడ్లకు తగలడంతో అంపైర్‌  మారియస్ ఎరాస్మస్‌ ఎల్బీ ఇచ్చాడు. అయితే దక్షిణాఫ్రికా కెప్టెన్‌ ఎల్గర్‌ సమీక్ష కోరాడు. అయితే ట్రాజెక్టరీ చూసినప్పుడు బంతి ఇన్‌లైన్‌లోనే పిచ్‌ అయినట్టు కనిపించింది. అయితే వికెట్లకు తగలకుండా పోతున్నట్టు చూపించింది.






నిర్ణయం భిన్నంగా రావడంతో అంపైర్‌ మరియస్‌ 'ఇది అసాధ్యం' అన్నాడు. ఇదే సమయంలో టీమ్‌ఇండియా ఆటగాళ్లంతా చిరాకుకు గురయ్యారు. చూస్తుంటే మొత్తం దేశం కేవలం 11 మందికి వ్యతిరేకంగా ఆడుతున్నట్టు కనిపిస్తోందని కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. రానురాను ఆట చెడ్డగా మారుతోందని మయాంక్‌ అగర్వాల్‌ అన్నాడు. ఇదే సమయంలో స్టంప్‌ మైక్‌ వద్దకు వచ్చిన కోహ్లీ 'కేవలం ప్రత్యర్థిపైనే కాకుండా వాళ్లు బంతిని నునుపు చేస్తున్నప్పుడు నీ జట్టుపైనా దృష్టి పెట్టు. ప్రతిసారీ జనాల గురించే ప్రయత్నిస్తావు' అని అన్నాడు.


కోహ్లీ మాట్లాడిన విధానాన్ని చాలామంది విమర్శిస్తున్నారు. అతడు అపరిణతితో వ్యవహరించాడని గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. ఇలాగైతే టీమ్‌ఇండియా కెప్టెన్‌ యువకులకు ఆదర్శంగా ఉండలేడని పేర్కొన్నాడు. స్టంప్‌మైక్‌లో ఇలా మాట్లాడటం అస్సలు సరికాదని వెల్లడించాడు.