దిల్ రాజు ఫ్యామిలీ నుంచి ఆశిష్ హీరోగా నటించిన తొలి సినిమా ‘రౌడీ బాయ్స్’ శుక్రవారం సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆశిష్ పక్కన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. హుషారు లాంటి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కు దర్శకత్వం వహించిన శ్రీ హర్ష కొనుగంటి ఈ సినిమాకు డైరెక్టర్. టీజర్, ట్రైలర్‌లు చూశాక కాలేజీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ స్టోరీ చూడబోతున్నామనే ఫీలింగ్ కలిగింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు ప్రచారం చేయడంతో సాధారణంగానే సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉంది?


కథ: అక్షయ్ (ఆశిష్) బాధ్యత లేకుండా తిరిగే కుర్రాడు. బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో చేరడానికి కాలేజీకి వెళ్తూ మెడికల్ స్టూడెంట్ కావ్యను (అనుపమ పరమేశ్వరన్) చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఆ మెడికల్ కాలేజీకి, ఆశిష్ చేరబోయే కాలేజీకి అస్సలు పడదు. రెండు కాలేజీల విద్యార్థులు ఎప్పుడు ఎదురుపడినా కొట్టుకుంటూనే ఉంటారు. కావ్య క్లాస్ మేట్ విక్రమ్ (విక్రమ్ సహిదేవ్) కూడా తనను ప్రేమిస్తూ ఉంటాడు. వీరి ప్రేమకథ ఎన్ని మలుపులు తిరిగింది? ఇద్దరూ లైఫ్‌లో సక్సెస్ అయ్యారా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..


విశ్లేషణ: హుషారు లాంటి యూత్‌ఫుల్ సినిమా తీసిన శ్రీహర్ష మీద దిల్ రాజు పెద్ద బాధ్యతనే పెట్టారు. ఒక డెబ్యూ హీరో సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. డాన్స్, యాక్షన్, కామెడీ, హీరో, హీరోయిన్లు నటించడానికి స్కోప్.. ఇలా అన్ని హంగులు ఉన్న కథను శ్రీహర్ష ఎంచుకున్నారు. అయితే ఇది పూర్తి స్థాయిలో స్క్రీన్ మీదకు ట్రాన్స్‌లేట్ అవ్వలేదు. కొన్ని ఎపిసోడ్లు బాగా వర్కవుట్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో కాలేజీ స్టూడెంట్స్ ప్రవర్తించే తీరు మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ సినిమాలో హీరో తండ్రి ఒక సన్నివేశంలో అంటాడు ‘ఇంత విచిత్రంగా ఉన్నావేంట్రా’ అని. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కొన్ని సీన్లు ప్రేక్షకులకు కూడా అలానే అనిపిస్తాయి. సినిమా కథనం ప్రెడిక్టబుల్‌గా సాగడం మరో మైనస్.


ప్రథమార్థాన్ని కాలేజీ నేపథ్యంలో నడిపించిన శ్రీహర్ష.. సెకండాఫ్‌లో పూర్తి లివ్-ఇన్ రిలేషన్ వైపు వెళ్లిపోయాడు. ఇటువంటి పాయింట్ ఉందని తెలిస్తే కుటుంబ ప్రేక్షకులు దూరం అవుతారని భావించారేమో.. అందుకే ట్రైలర్‌లో కూడా దీన్ని అస్సలు టచ్ చేయలేదు. శ్రీహర్ష రాసుకున్న కామెడీ కొన్నిసార్లు బాగా పేలింది. ఆర్కెస్ట్రా ఎపిసోడ్ అయితే హిలేరియస్ అని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో ప్రీ-క్లైమ్యాక్స్ ఎపిసోడ్ ఎమోషనల్‌గా ఉంటుంది. క్లైమ్యాక్స్‌లో ఏం జరుగుతుందో ఊహించడం పెద్ద కష్టం కాదు.


ఇక నటీనటుల విషయానికి వస్తే.. ఆశిష్ దగ్గర హీరోకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయి. డ్యాన్స్, యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీశాడు. ఎమోషనల్ సీన్లలో కొంచెం ఇంటెన్సిటీ తగ్గినా.. మొదటి సినిమాలోనే మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తన కెరీర్‌లో ‘బోల్డెస్ట్’ రోల్ ఇదే. కేవలం పాటలకు మాత్రమే పరిమితమైన పాత్ర కాదు తనది. కథలో చాలా కీలకమైన పాత్ర. ముఖ్యంగా ఈ సినిమా ఇంటర్వెల్‌లో తన పెర్ఫార్మెన్స్ కెరీర్ బెస్ట్. ప్రీ-క్లైమ్యాక్స్, క్లైమ్యాక్స్‌ల్లో కూడా తన నటనతో హీరోను కూడా డామినేట్ చేస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో తన పాత్ర మజిలీలో సమంత క్యారెక్టర్ తరహాలో ఉంటుంది. నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియాలో మొదటి సారి స్క్రీన్‌పై కనిపించిన విక్రమ్ సహిదేవ్‌కు ఇందులో ఫుల్ లెంత్ పాత్ర లభించింది. కార్తీక్ రత్నం, శ్రీకాంత్ అయ్యంగార్, జయప్రకాష్ ఇలా మిగిలిన నటీనటులందరూ తమ పాత్రల పరిధిలో బాగానే నటించారు.


దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు వినడానికి, చూడటానికి కూడా బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా అలరించింది. స్క్రీన్ మీద సినిమా ఇంత అందంగా కనిపించడానికి కారణం మది. ఆయన సినిమాటోగ్రఫీకి 100కి 100 మార్కులు వేయవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఫ్యామిలీ హీరో మొదటి సినిమా కాబట్టి దిల్ రాజు ఖర్చుకు వెనకాడినట్లు కనిపించలేదు.


ఓవరాల్‌గా చెప్పాలంటే.. ఈ రౌడీ బాయ్స్ అక్కడక్కడా ఆకట్టుకుంటారు. శ్రీహర్ష మంచి కథను ఎంచుకున్నా.. కథనం కొంచెం దెబ్బకొట్టింది. ఆశిష్, అనుపమల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. సినిమా అక్కడక్కడా కొంచెం స్లో అయినా.. అక్కడక్కడ విచిత్రంగా అనిపించినా.. నిరాశ మాత్రం పరచదు.


Also Read: లిప్ లాక్ సీన్స్ పై ట్రోలింగ్.. స్పందించిన అనుపమ..


Also Read: మొన్న 'RRR'.. ఇప్పుడు 'BBB'.. క్రేజీ మల్టీస్టారర్ సెట్ అవుతుందా..?


Also Read: సమంతతో త్రివిక్రమ్ ప్లాన్.. నిజమేనా..?


Also Read: 'అవతార్ 2' రిలీజ్ డేట్ లాక్ చేసిన మేకర్స్.. ఫ్యాన్స్ కు పండగే..


Also Read: మలైకాకి బ్రేకప్ చెప్పేశాడా..? ఇదిగో క్లారిటీ..


Also Read: మెగా హీరో కొత్త సినిమా టైటిల్ ఇదేనా..?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి