You will always be my captain: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి యువ పేసర్ మహ్మద్ సిరాజ్ ధన్యవాదాలు తెలియజేశాడు. తాను చెత్తగా ఆడుతున్నప్పుడు తనలో అత్యుత్తమ ఆటతీరును గమనించాడని పేర్కొన్నాడు. ఇన్నాళ్లూ తనను ఒక సోదరుడిగా ప్రోత్సహించాడని భావోద్వేగానికి గురయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడికి కృతజ్ఞతలు చెబుతూ ఓ పోస్టు పెట్టాడు.
'నా సూపర్ హీరో..! నీ నుంచి వచ్చిన మద్దతు, ప్రోత్సాహానికి కేవలం కృతజ్ఞతలు చెబితే సరిపోదు. నువ్వెప్పుడూ నాకు పెద్దన్నవే. ఇన్నేళ్లూ నన్ను నమ్మినందుకు, విశ్వాసం ఉంచినందుకు ధన్యవాదాలు. నేను చెత్తగా ఆడుతున్నప్పుడే నాలోని అత్యుత్తమ ఆటతీరును గమనించి వెలికితీశావు. నువ్వెప్పుడూ నా కెప్టెన్‌వే కింగ్ కోహ్లీ' అని మహ్మద్ సిరాజ్ ఇన్‌స్టాలో పోస్టు చేశాడు.
విరాట్ కోహ్లీ సారథ్యంలోనే హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ టీమ్‌ఇండియాలో అరంగేట్రం చేశాడు. మొదట్లో ఎక్కువ భావోద్వేగానికి గురవుతూ సరైన ప్రదర్శన చేయలేదు. నిలకడ లోపంతో బాధపడ్డాడు. అయినా అతడిని విరాట్ ప్రోత్సహించాడు. వైఫల్యాలతో సంబంధం లేకుండా జట్టులో చోటిచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగులో సన్‌రైజర్స్ హైదరాబాద్ వదిలేసినప్పుడు అతడిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తీసుకున్నాడు. కాలం గడిచే కొద్దీ ఆత్మవిశ్వాసం సాధించిన సిరాజ్ చక్కని పేసర్‌గా ఎదిగాడు.
ఇప్పుడు సిరాజ్ పోస్టు చేసిన తీరు ఒకప్పడు విరాట్ కోహ్లీ మాటలను గుర్తు చేసింది. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పుడు విరాట్ ఇలాగే అన్నాడు. 'నువ్వెప్పటికీ నాకు కెప్టెన్‌వే' అంటూ పోస్టులు పెట్టాడు. ఇప్పటికీ సందర్భం వస్తే అలాగే అంటుంటాడు. ఏదేమైనా విరాట్ హఠాత్తుగా నాయకత్వం నుంచి తప్పుకోవడం అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే.
2014, ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు కెప్టెన్‌గా ఎంపికైన విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీసు ఓటమి తర్వాత ఆ బాధ్యతల నుంచి నిష్క్రమించాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగిందో తెలియదు! జట్టు యాజమాన్యం ఏమైనా అందా తెలియదు! నాయకుడిగా జట్టును ముందుకు నడిపించలేక పోతున్నానని భావించాడా తెలియదు! వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం బాధించిందా తెలియదు! అనూహ్య నిర్ణయమైతే తీసుకున్నాడు. ఇక ఆటగాడిగానే కొనసాగనున్నాడు.
Also Read: Team India Next Captain: విరాట్ కోహ్లీ వారసుడి పేరు సూచించిన గావస్కర్..! లాజిక్ ఇదే!
Also Read: Virat Kohlis Successor: టీమిండియా టెస్టు పగ్గాలు అతడి చేతికే.. రోహిత్ శర్మకు మాత్రం నో ఛాన్స్!