ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా సినిమా టిక్కెట్లను తామే ఆన్‌లైన్‌లో అమ్మాలని నిర్ణయించుకుని జారీ చేసిన జీవోపై మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 142 రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన  హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. 


Also Read: తెలంగాణలోనూ ఏపీ తరహా మార్పులు... త్వరలో ఆన్‌లైన్‌ ప్రక్రియ: తలసాని


సినీ పరిశ్రమ కలెక్షన్ల విషయంలో  అబద్దాలు చెబుతూ పన్నులు ఎగ్గొడుతున్నారన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల అమ్మకాలను తామే ఆన్‌లైన్‌లో చేపట్టాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు అసెంబ్లీలో చట్టాన్ని సవరించింది. ఆ తర్వాత గత డిసెంబర్ 19వ తేదీన జీవో నెం. 142ని విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం సినిమా టికెట్ల అమ్మకాలను ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు అప్పగించారు. బుక్ మై షో, పేటీఎం లాంటి ఆన్‌లైన్ యాప్స్‌ ద్వారా ఏపీలో సినిమా టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ఉండదు. అలాగే మల్టిప్లెక్స్ యాజమాన్యాలు కూడా తమంతటకు తాము టిక్కెట్లు అమ్ముకోవడానికి లేదు. 


Also Read: టిక్కెట్ రేట్ల తగ్గింపును విమర్శించేవారు శత్రువులే.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు !


వచ్చే కలెక్షన్లను  ట్యాక్స్ మినహాయించుకుని ... మిగిలిన మొత్తాన్ని ఆయా థియేటర్స్ ఖాతాలకు జమ చేస్తామని తెలిపింది. ఈ విధానానికి ఏపీ ఫిలిం ఛాంబర్ అంగీకరించినట్లు జీవోలో ఏపీ ప్రభుత్వం తెలిపింది. అయితే జీవో ఇంకా జీవో అమల్లోకి రాలేదు. ఏపీఎస్‌ఎఫ్‌డీసీ యాప్‌ను ఇంకా సిద్ధం చేయలేదు. ఎప్పట్లోపు సిద్ధమవుతుందో క్లారిటీ లేదు. అయితే సిద్ధమైన మరుక్షణం నుంచి టిక్కెట్ల అమ్మకాలు కేవలం ఆ యాప్ ద్వారా ప్రభుత్వ గెట్‌వే ద్వారా మాత్రమే సాగుతాయి. 


Also Read: ఇద్దరు, ముగ్గురు సినిమా హీరోలపై కక్షతో పరిశ్రమను దెబ్బతిస్తారా?


ఇప్పటికే ఈ విధానం విషయంలో నిర్మాతలకు చాలా అనుమానాలు ఉన్నాయి. కానీ బహిరంగంగా వ్యక్తం చేయలేకపోతున్నారు. మల్టిప్లెక్స్ యాజమాన్యాలు మాత్రం న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే టిక్కెట్ ధరలపై వివాదం కొనసాగుతోంది. ప్రభుత్వం నియమించిన కమిటీ టిక్కెట్ ధరల ఖరారు కోసం సమావేశాలు నిర్వహిస్తోంది. ఇప్పుడు ఆన్ లైన్ టిక్కెట్ల యాప్‌పైనా కోర్టులో పిటిషన్లు పడ్డాయి.



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి