హిట్‌మ్యాన్‌ అభిమానులకు శుభవార్త! టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌ సారథి రోహిత్‌ శర్మ కోలుకున్నాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో నిర్వహించిన ఫిట్‌నెస్‌ పరీక్షలో పాసయ్యాడు. వెస్టిండీస్‌తో సిరీసుకు పునరాగమనం చేయనున్నాను. పూర్తి స్థాయి కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు. బీసీసీఐ వర్గాలు ఈ మేరకు ఏఎన్‌ఐకి సమాచారం ఇచ్చాయి.


'అవును, రోహిత్‌ ఫిట్‌నెస్‌ పరీక్ష నెగ్గాడు. త్వరలో జరిగే వెస్టిండీస్‌ సిరీసులో జట్టుకు నాయకత్వం వహించనున్నాడు' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దక్షిణాఫ్రికా సిరీసుకు ముందు అతడు పిక్క కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. ఇక్కడే ఉండిపోయాడు.


దక్షిణాఫ్రికా పర్యటనలో రోహిత్‌ శర్మ లోటు స్పష్టంగా కనిపించింది. పూర్తి స్థాయి కెప్టెన్‌ లేకపోవంతో మైదానంలో టీమ్‌ఇండియా దిశానిర్దేశం లేకుండా సాగింది. కేఎల్‌ రాహుల్‌ నాయకత్వం వహించినప్పటికీ చురుగ్గా నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. సఫారీలతో మూడు వన్డేల్లో ఒక్కదాంట్లోనూ గెలిపించలేకపోయాడు. దాంతో ఆతిథ్య జట్టుపై మనల్ని 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసేసింది. జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌ సేవలను సరిగ్గా వినియోగించుకోలేక పోయాడు. బీసీసీఐ కూడా ఈ ఓటమిపై నిరాశగా కనిపిస్తోంది. దాంతో హిట్‌మ్యాన్‌ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.


రోహిత్‌ కోలుకోవడంతో సెలక్షన్‌ కమిటీ త్వరలోనే సమావేశం నిర్వహించనుంది. టీమ్‌ఇండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సైతం దీనికి హాజరవుతాడు. ఇక పనిభారం దృష్ట్యా జస్ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతినిస్తారని తెలిసింది. 'జస్ప్రీత్‌ బుమ్రాకు దాదాపుగా విశ్రాంతినివ్వడం ఖాయం. అంతర్జాతీయ షెడ్యూలు దృష్ట్యా అతడి పనిభారం సమీక్షించడం అత్యంత అవసరం. దక్షిణాఫ్రికాపై అన్ని టెస్టులు, వన్డేల్లో అతడు ఆడాడు. అందుకే అతడికి విశ్రాంతి అవసరం' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.


వెస్టిండీస్‌ సిరీసుకు సమయం దగ్గరపడింది. ఫిబ్రవరి 6 నుంచే మ్యాచులు మొదలవుతాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో షెడ్యూల్లో బీసీసీఐ మార్పులు చేసింది. ఆరు వేదికలకు బదులుగా రెండు వేదికలనే ఖరారు చేసింది. అహ్మదాబాద్‌లో మూడు టీ20లు, కోల్‌కతాలో మూడు వన్డేలు జరుగుతాయి.


Also Read: Yuvraj Blessed with Baby: ఫ్యాన్స్‌కు యువరాజ్ గుడ్‌న్యూస్.. తండ్రి అయ్యానని పోస్ట్ చేసిన మాజీ ఆల్ రౌండర్


Also Read: IND vs WI: విండీస్‌ సిరీసుకు ఈ వారమే జట్టు ఎంపిక! రోహిత్‌ ఫిట్‌నెస్‌ టెస్టు సంగతేంటి?