Yuvraj Blessed with Baby Boy: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన అభిమానులకు, మద్దతుదారులకు శుభవార్త చెప్పాడు. తాను తండ్రి అయ్యానని శుభవార్తను మంగళవారం రాత్రి సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. తన భార్య, నటి హజెల్ కీచ్ ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని యువరాజ్ పోస్ట్ చేశాడు. యువరాజ్, నటి హజెల్ కీచ్‌లు 2016లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
యువీ ఈ శుభవార్త ఎప్పుడు చెబుతాడా అని మాజీ ఆల్ రౌండర్ ఫ్యాన్స్ చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. కొన్ని నెలల కిందట టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మలు తల్లిదండ్రులయ్యారు. ఆ సమయంలో యువరాజ్, హజెల్ కీచ్‌ల టాపిక్ తెరమీదకు వచ్చింది. తాము ఎంతో కాలం నుంచి వేచిచూస్తున్న క్షణం రానే వచ్చిందంటూ యువరాజ్ తాను తండ్రి అయ్యానని తెలిపాడు.
2007 టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్‌ను టీమిండియా నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్. అనూహ్యంగా 2019 వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కకపోవడం, జట్టు నుంచి పిలుపు వస్తుందనే నమ్మకం లేక 2019 జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు యువీ. దాదాపు 17 ఏళ్లకు పైగా జాతీయ క్రికెట్ జట్టుకు విశేష సేవలు అందించిన యువీకి సరైన వీడ్కోలు మాత్రం లభించలేదని అతడి అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు.
40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20లలో టీమిండియాకు యువీ ప్రాతినిథ్యం వహించాడు. టెస్టుల్లో 1900 పరుగులు, వన్డేల్లో 8700 పరుగులు, టీ20ల్లో 1,177 పరుగులు చేయడంతో పాటు 9, 111 , 28 వికెట్లు ఆయా ఫార్మాట్లలో పడగొట్టాడు. ప్రపంచంలో అత్యుత్తమ ఆల్ రౌండర్లలో యువీ స్థానం ఎప్పటికీ పదిలమే. అతడు లేకపోతే ధోనీ సారథ్యంలో టీమిండియా టీ20, వన్డే వరల్డ్ కప్ నెగ్గడం దాదాపు అసాధ్యమేనని క్రికెట్ విశ్లేషకులు సైతం భావిస్తారు.
కెరీర్ చివరి దశకు వస్తున్న సమయంలో 2016లో బాలీవుడ్ నటి హజెల్ కీచ్‌ను యువరాజ్ వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో జట్టులో అవకాశాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూశాడు. కానీ క్యాన్సర్‌ను జయించిన అనంతరం బరువు పెరగడం, ఫిట్ నెస్ వేగంగా సాధించకపోవడం.. టెక్నిక్ మార్చుకోకపోవడం, కంటిన్యూగా ఛాన్స్ రాకపోవడంతో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.