తప్పు చేసిన వారిని దండించే పోలీసే అడ్డదారి పడ్డారు. తలపై టోపీ ఉందని ఏం చేసినా చెల్లుతుందనుకున్నారు. అడిగేవాడెవరు అనుకున్నారేమో డమ్మీ డీఎస్పీని రంగంలోకి దింపి హైదరాబాదుకు చెందిన ఓ వ్యాపారిని బెదిరించారు. పెట్టుబడి పేరుతో 1.2 కోట్ల రూపాయలు స్వాహా చేశారు. వ్యాపారి ఫిర్యాదుతో ఆ పోలీసు బాసు చేసిన ఘనకార్యం అంతా బయటకు వచ్చింది..


ఆయనో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (ఏఎస్పి)గా ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఎం.మునిరామయ్య.. తిరుమలకు వచ్చే భక్తులకు భధ్రత కల్పించడం ఆయన ఉద్యోగం.. అయితే విధులను మరిచి‌ అధిక సొమ్ము కోసం వక్ర మార్గాలను ఎంచుకుని అబాసుపాలయ్యాడు.  
ఈ పోలీసు బాసు మోసానికి హైదరాబాద్‌ సెంట్రల్ క్రైం స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది.. వ్యాపారి నుంచి డబ్బును కాజేసేందుకు ఓ డమ్మీ డీఎస్పీని రంగంలోకి దింపి ఓ వ్యాపారి వద్ద 1.2 కోట్లు కాజేశాడీ ఏసీపీ. 


అయితే ఈ‌కేసు విచారణ అధికారిగా ఏసిపి వై.వెంకటరెడ్డి నియమించింది పోలీసు శాఖ.. ఈ క్రమంలో లోతుగా దర్యాప్తు సాగించిన ఏసీపి వెంకటరెడ్డి... మునిరామయ్య కేసుకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు సేకరించారు.. వ్యాపారిని మోసం చేసింది నిజమే అంటూ ఆధారాలు సేకరించారు. సీఆర్పిసి 41ఏ మునిరామయ్యకు కింద నోటీసుని‌ కూడా జారీ చేశారు.. 


వ్యాపారిని మునిరామయ్య ఎలా కలిసాడంటే....???


హైదరాబాదులోని మొహిదీపట్నం ప్రాంతానికి చెందిన విద్యాసంస్థలు నిర్వహిస్తున్న చుండూరు సునీల్‌ కుమార్‌ను తెలివిగా ముగ్గులోకి దించారు. ఇతని స్నేహితుడైన కోడటి జయప్రతాప్‌తో కథ నడిపించారు. 2018 డిసెంబర్‌లో ఓ ప్రతిపాదన తీసుకొచ్చాడు. 


చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి 5 కోట్ల రూపాయలు ఇస్తే.‌.. అతను వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టి 15 రోజుల్లో 18 కోట్ల రూపాయలు తిరిగి ఇస్తాడని సునీల్‌కు జయప్రతాప్‌ చెప్పాడు. ఇది నమ్మశక్యంగా లేదన్నాడు సునీల్. దీంతో 2019వ సంవత్సరంలో సునీల్‌ను నమ్మించేందుకు జయప్రతాప్‌తో మునిరామయ్య హైదరాబాద్ వచ్చాడు. వ్యాపారి సునీల్ కుమార్‌ను కలిశారు. ఆ టైంలో మునిరామయ్య సీఐడి విభాగంలో డీఎస్పీగా పని చేస్తున్నాడు. 


సునీల్‌తో మాట్లాడుతూ కచ్చితంగా పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మబలికాడు. 1.2 కోట్లు ఇస్తే 15రోజుల్లో 3 కోట్లు ఇస్తామని మాయ మాటలు చెప్పాడు. డబ్బులు తీసుకున్న తర్వాత తిరిగి ఇవ్వకుంటే పరిస్థితి ఏంటని అనుమానం వ్యక్తం చేశాడు సునీల్ కుమార్. అప్పుడే తన పోలీస్‌ బుర్రకు పదను పెట్టి డమ్మీ డీఎస్పీని రంగంలోకి దించాడు ముని రామయ్య. కెవీ.రాజు అనే వ్యక్తిని తీసుకువచ్చి టాస్క్ ఫోర్స్ డీఎస్పీగా పరిచయం చేశాడు. గతంలో తామిద్దరం కలిసి పనిచేశామని.. అవతలి వ్యక్తి నుంచి డబ్బు రాబట్టడం పెద్ద పనికాదని నచ్చజెప్పాడు. 1.2 కోట్ల రూపాయలకు తను గ్యారెంటీగా ఉంటానంటూ మునిరామయ్య భరోసా కల్పించాడు. 


అంతేననా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బోల్తాకొట్టించారు. మూడు కోట్లకు ఆర్టీజిఎస్ ఫామ్ క్రియేట్ చేసి ఫోన్ ద్వారా సునీల్ కుమార్‌కి పంపాడు మునిరామయ్య. ఆర్కె క్లీన్ రూమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరుతో మొత్తం మూడు కోట్ల రూపాయలు ఇచ్చాడు. దీంతో 1.25 కోట్లు ఇవ్వడానికి సునీల్ అంగీకరించాడు. 


2019 నవంబర్‌లో ఓ గుర్తు తెలియని పంపించి కోటీ పాతికలక్షలు తీసుకున్నాడు మునిరామయ్య. 
ఈ పని పూర్తి అయ్యి రెండేళ్ళు గడిచింది.. కానీ ఇచ్చిన డబ్బుకు రెట్డింపు డబ్బు రాక పోవడంతో అనుమానం వచ్చిన సునీల్‌కుమార్ మునిరామయ్యపై ఒత్తిడి తెచ్చాడు.. 


సునీల్ కుమార్ ఒత్తిడి ఎక్కువ కావడంతో మునిరామయ్య మరో ప్లాన్ వేశాడు. తన కుమార్తె పేరు ీద హైదరాబాద్‌లో ఉన్న స్థలాన్ని తాకట్టు పెట్టి బ్యాంకులో రెండు కోట్లు లోన్ తీసుకోవాలని సునీల్‌కు సూచించాడు. అయితే దానిపై లోన్ ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు  అంగీకరించలేదు.. దీంతో జరిగిన విషయాన్ని మునిరామయ్యకు తెలియజేశాడు.. 


అంతే తర్వాత నుంచి మునిరామయ్య స్పందించడం మానేశాడు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్‌ చేయలేదు. రెండు మూడు సార్లు తిరుపతికి వచ్చిన సునీల్‌ నేరుగా మునిరామయ్యను కలిశాడు.  కలిసిన ప్రతిసారీ పొంతన లేని‌ సమాధానాలు చెప్పి మునిరామయ్య తప్పించుకునే వాడు. అనుమానం వచ్చిన సునీల్.. ముందు పరిచయమైన డీఎస్పీ కేవీ రాజును కలిసేందుకు యత్నించాడు. అప్పుడుగాని అదంతా డమ్మీ అని తెలియలేదు.కే.వి.రాజు అనే వ్యక్తి డిఎస్పిగా లేడు అన్న తెలుసుకున్న సునీల్ కుమార్ మోస పోయాయని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. 


విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయిన హైదరాబాదు‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు తీసుకున్నారు. విచారణ అధికారిగా ఉన్న వెంకటరెడ్డి కేసును ఛేదించారు. నివేదిక కూడా ఉన్నతాధికారులకు ఇచ్చేశాడు. 
 
ఉచ్చు బిగుస్తుందని గ్రహించిన మునిరామయ్య కాళ్ల బెరానికి దిగాడు. సునీల్ కుమార్‌తో సదికి యత్నించాడు. తనను సాక్షిగా తీసుకోవాలని ప్రాధేయపడ్డాడు. కానీ సునీల్ ఒప్పుకోలేదు. ఈ‌ కేసులో ఇంకా విచారణ కొనసాగుతుంది.. 


మునిరామయ్యపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో సస్పెండ్ చేశారు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ. డిజిపి కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. 


చిత్తూరు జిల్లాలో‌ ఎస్సైగా చేరిన మునిరామయ్య అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు పొందే వరకూ ఆ జిల్లా దాటి వెళ్ళలేదంటే అర్ధం చేసుకోవచ్చు పోలీసు శాఖలో ఆయనకున్న పట్టు ఏంటో. గతంలో‌ కూడా మునిరామయ్య ఏసీబి అధికారులకు చిక్కి ఆరోపణలు ఎదుర్కొన్నారు. 


అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకు కొమ్ముకాస్తూ, వారికి సహకరించి పనులు చక్క బెట్టే విషయంలో‌ సిద్ద హస్తుడని పేరుంది మునిరామయ్యకు. తిరుమలలోనే డీఎస్పీగా ఉంటూ అదే స్ధానంలో అడిషనల్ ఎస్పీగా మునిరామయ్య బాధ్యతలు తీసుకున్నారంటే ఏ స్ధాయిలో పోలీసుల ఉన్నతాధికారులతో ఆయన పరిచయాలు ఉన్నాయో అర్ధం అవుతుంది.


ఈ కేసుతో మునిరామయ్య చేసిన పలు అక్రమాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ విషయంపై పోలీసు శాఖలోని అధికారులు వద్ద నుంచి చిన్న స్ధాయి ఉద్యోగుల వరకూ చెవులు కొరుకుంటున్నారు..