స్వాతంత్ర్య పోరాటంలో ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. ఈ పోరాటంలో పాల్గొన్న తెలుగు తేజాలు ఎందరో ఉన్నారు. అలాంటి వారి ఉద్యమ రూపానికి జీవం పోశారు చిత్తూరు జిల్లా కాళహస్తికి చెందిన సుధీర్ ఆయన మిత్ర బృందం. వీరు జీవం పోసిన కలంకారి చిత్రం మరో రెండు రోజుల్లో దిల్లీ రాజ్ పథ్ లో నిర్వహించే గణతంత్ర వేడుకల ప్రదర్శనకు ఎంపికైంది.


దిల్లీ రాజ్ పథ్ గ్యాలరీలో ప్రదర్శనకు ఎంపిక


ఈ నెల 26న జరిగే గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీ రాజ్ పథ్ లో నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్స్ 750 మీటర్ల పొడవుతో భారీ స్క్రోల్ ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 500 మంది కళాకారులచే చిత్రీకరించిన చిత్రాలు ఉంచాలని నిర్ణయం తీసుకుంది. మోడ్రన్ ఆర్ట్ గ్యాలరీలో తన చిత్రాన్ని ప్రదర్శించేందుకు  శ్రీకాళహస్తికి చెందిన సుధీర్ దరఖాస్తు చేసుకున్నారు. సుధీర్ తో పాటు అతని మిత్ర బృందం వేసిన ఈ కలంకారీ చిత్రం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి దిల్లీలో జరిగే మోడరన్ ఆర్ట్ గ్యాలరీకి ఎంపిక అయింది. 30 మీటర్ల  పొడవు కలిగిన కలంకారీ వస్త్రంపై  స్వాతంత్రోద్యమంలో అమరులైన తెలుగు వీరులు అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతులు, గౌతు లచ్చన్న, పింగళి వెంకయ్య, తదితర దేశ భక్తుల చిత్రాలతో రూపొందించారు.  ఈ చిత్రం రాజ్ పథ్ గ్యాలరీలో ప్రదర్శించేందుకు అర్హత సాధించింది.


Also Read: సివిల్ సర్వీస్ కేడర్ రూల్స్‌లో మార్పులకు కేంద్రం సిద్దం - వ్యతిరేకిస్తూ కేసీఆర్ లేఖ !


చిత్రలేఖనంలో ప్రావీణ్యం 


ఇక సుధీర్ విషయానికి వస్తే అతను ఓ మధ్య తరగతి వ్యవసాయాధారిత కుటుంబానికి చెందిన వ్యక్తి. సుధీర్ కు హస్తకళలు అంటే చాలా ఇష్టం. హంపిలోని కన్నడ విశ్వవిద్యాలయంలో  చిత్ర లేఖనం బ్యాచిలర్ ఇన్ విజువల్ ఆర్ట్ విద్యను పూర్తి చేశారు. అంతే కాదు శ్రీకాళహస్తి కలంకారికి మోడరన్ ఆర్ట్ ను మేళవించి ఎన్నో అద్బుతమైన కళా ఖండాలకు జీవం పోశారు ఆయన. సుధీర్ తో పాటు ఆయన సతీమణి జమున కూడా కలంకారి ఆర్ట్ లో ఎంతో ప్రావీణ్యం పొందారు. వీరు రేణిగుంటలో నివాసం ఉంటూ శ్రీకాళహస్తిలో కళాకారులకు శిక్షణ ఇస్తూ నూతన డిజైన్లతో ఉపాధి పొందుతున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వాసికి దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: 'భాజపాతో స్నేహం చేసి 25 ఏళ్లు వేస్ట్ చేశాం.. ఇక గల్లీ రాజకీయాలు కాదు దిల్లీయే లక్ష్యం'