పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న ఉద్యమం రోజు రోజుకు తీవ్రమవుతోంది. తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆగ్రహం ఉద్యోగుల్లో కనిపిస్తోంది.
రిపబ్లిక్‌డే సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రం ఇచ్చి తమ గోడు చెప్పుకున్నారు ఉద్యోగులు. రోజుకో విధంగా ప్రభుత్వానికి తమ నిరసన చెబుతున్న ఉద్యోగులు ఇవాళ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేశారు.
ఉద్యోగుల నిరసనలో భాగంగా విజయవాడలోని అంబేద్కర్ విగ్రహానికి ఉద్యోగ సంఘ నాయకులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశర్లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడు. బండి శ్రీనివాసరావు మాట్లాడుతు ఉన్నతాధికారులు, మంత్రులపై సీరియస్ కామెంట్స్ చేశారు. పీఆర్సీలో అన్యాయం జరుగుతుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారాయన. 27 శాతం ఐఆర్ ఇస్తూ 14 శాతం ఫిట్ మెంట్ ఎలా సిఫార్స్ చేస్తారని ప్రశ్నించారు. ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడానికే ప్రభుత్వానికి కష్టాలు వస్తాయా అంటు నిలదీశారు.
ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్పినట్టు విన్నామని... ఆడించినట్టు ఆడామని ఇకపై అలా కుదరదన్నారు. ఉద్యోగుల ప్రాణాలు తీయడానికి బుగ్గన మంత్రి అయ్యారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వంపై ఉద్యోగస్తులు కడుపు మంటతో రగిలిపోతున్నారని తెలిపారు బండి శ్రీనివాసరావు.
ప్రభుత్వం కావాలనే పీఆర్సీ విషయంలో గందరగోళాన్ని సృష్టిస్తోందన్నారు బొప్పరాజు. నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకే అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేసినట్టు పేర్కొన్నారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే పాత జీతాలే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను బయటపెడ్డటానికి ప్రభుత్వాం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. పాతజీతాలు వేయాలని డీడీవోలను రిక్వస్ట్ చేశారు బొప్పరాజు.
రోజు రీతిన ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న ఉద్యోగ సంఘాలు.. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేశాయి. రిపబ్లిక్ డే జరుపుకొంటున్న టైంలో ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని సరిచేయాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లాస్థాయిలో కూడా ఉద్యోగులు విగ్రహాలకు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్న పీఆర్సీ విధానాన్ని ప్రభుత్వం కొనసాగించాలని జిల్లా స్థాయి నాయకులు కూడా కోరుతున్నారు.
పీఆర్సీ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీ వేసింది. అయితే జీవోలు రద్దు చేస్తే గానీ చర్చలకు వెళ్లబోమంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. ఇది పద్దతి కాదంటున్న కమిటీ సభ్యులు రేపు చర్చలు రావాలని మరోసారి పిలుపునిచ్చారు. ఇదే టైంలో పీఆర్సీ ఎంత పెరిగింది... ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుందో చెబుతూ సర్కారు విస్తృత ప్రచారం చేస్తోంది. దీనిపై కూడా ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఆగ్రహంతో ఉన్నారు.