దేశ ప్రజలు 73వ గణతంత్ర దినోత్సవాన్ని వేడుకలా జరుపుకుంటున్నారు. కరోనా కోరలు చాస్తున్నా కట్టుదిట్టమైన ఆంక్షలు పాటిస్తూ జెండా వందనం చేశారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ కొందరు విదేశీయులను అభినందించారు. భారత్ పట్ల వారు పెంచుకొన్న మమకారం, అనుబంధానికి కృతజ్ఞతలు తెలియజేశారు. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, ప్రపంచంలోనే అద్భుతమైన ఫీల్డర్ జాంటీ రోడ్స్‌ను మోదీ కొనియాడారు. అతడీ దేశానికి నిజమైన ప్రచారకర్త అని వెల్లడించారు.
మైదానంలో చిరుతలా పరుగెత్తుతూ.. పక్షిలా గాల్లోకి ఎగురుతూ బంతిని అందుకొనే జాంటీ రోడ్స్‌ను ఎవరూ మర్చిపోలేరు. తొంభయ్యోవ దశకంలో అతడి ఫీల్డింగ్ చూసి ప్రపంచమే అబ్బురపడింది. ఫీల్డింగ్ చేస్తే అతడిలా ఉండాలని క్రికెట్ ప్రపంచం సరికొత్త ప్రమాణాలు నిర్దేశించింది. నిజానికి జాంటీకి భారతదేశమంటే ఎంతో ఇష్టం. ఇక్కడి సంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలను ఎంతో ప్రేమిస్తాడు. ఈ దేశానికి వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక హిందూ సంప్రదాయం నేర్చుకుంటూనే ఉంటాడు. యజ్ఞాలు, యాగాలు చేయించాడు. తన కుమార్తెకు 'ఇండియా' అని పేరు పెట్టాడు.
టీమ్‌ఇండియాతో మ్యాచుల కోసం జాంటీరోడ్స్ చాలాసార్లు ఇక్కడికి వచ్చాడు. అంతేకాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబయి ఇండియన్స్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశాడు. గతేడాది అతడు పంజాబ్ కింగ్స్‌కు మారాడు.
'భారతదేశ మిత్రులైన మీకు, మరికొందరికి నేనీ లేఖ రాస్తున్నాను. భారత్ పట్ల మీ అనుబంధం, ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా దేశం, మా ప్రజలతో మీరిలాగే కలిసి పనిచేస్తారని నా విశ్వాసం. కొన్నేళ్లుగా మీరు భారతదేశం, ఇక్కడి సంస్కృతి పట్ల ప్రేమ పెంచుకొన్నారు. ఈ జాతి పేరును ప్రతిబింబించేలా ఇండియా అని మీ కుమార్తెకు పేరు పెట్టడం మీ ఇష్టాన్ని తెలియజేస్తోంది. మీరు నిజంగా మా దేశానికి నిజమైన బ్రాండ్ అంబాసిడర్. మన దేశాల మధ్య ఇలాగే సత్సంబంధాలు కొనసాగాలి. మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మిమ్మల్ని కలిసి మాట్లాడేందుకు ఎదురు చూస్తుంటాను' అని జాంటీకి మోదీ లేఖ రాశారు.
'నరేంద్ర మోదీజీ.. ప్రేమపూర్వక మీ మాటలకు ధన్యవాదాలు. భారతదేశానికి వచ్చిన ప్రతిసారీ వ్యక్తిగా నేనెంతో ఎదిగాను. భారతీయులు అందరితో పాటు మా కుటుంబం అంతా గణతంత్ర వేడుకలను జరుపుకుంటోంది. భారతీయుల హక్కులను కాపాడుతున్న రాజ్యాంగాన్ని మేమెంతో గౌరవిస్తున్నాం' అని మోదీకి జాంటీ బదులిచ్చారు. భారతీయులు జరుపుకొనే ప్రతి పండుగను జాంటీ జరుపుకుంటాడు. దీపావళిని జరుపుకున్న వీడియోలు, చిత్రాలను అతడు సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
Also Read: IND vs WI: విండీస్ సిరీసుకు ఈ వారమే జట్టు ఎంపిక! రోహిత్ ఫిట్‌నెస్ టెస్టు సంగతేంటి?