ఏపీలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ‘నవరత్నాలు’ అమలు చేస్తోందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేరుస్తుందని అన్నారు. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కోవిడ్ నేపథ్యంలో సందర్శకులను అనుమతించలేదు.
అనంతరం గవర్నర్ ప్రసంగిస్తూ.. ‘‘రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలిచాయి. అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యంగా ఏపీలో పాలన జరుగుతోంది. మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్లు, ఆక్వా హబ్‌లు ఏర్పాటు చేశాం. వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద నిధులు అందిస్తున్నాం. నాడు-నేడు కింద పాఠశాలలు, కళాశాలలను అభివృద్ధి చేస్తున్నాం. పాఠశాలల్లో విద్యార్థులకు జగననన్న విద్యాకానుక కిట్లు అందజేస్తున్నాం. వచ్చే ఉగాది పండుగ నుంచి 26 జిల్లాలో పాలన ప్రారంభం కానుంది’’ అని అన్నారు.
‘‘విద్యారంగం అభివృద్ధికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. విద్యను భవిష్యత్‌కు పాస్ పోర్టుగా ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు రూ.34 వేల కోట్లు విద్యాశాఖ కోసం ఖర్చు చేసింది. మనబడి నాడు-నేడు కింద కొత్తగా స్కూళ్లు, కాలేజీలు అభివృద్ధి చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యను తీసుకొచ్చారు. పేద విద్యార్థులకు బాసటగా జగనన్న అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చారు. జగనన్న విద్యాకానుక, విద్యాదీవెన, వసతి దీవెన,గోరుముద్ద పథకాల ద్వారా విద్యార్థులకు ఎంతో లబ్ధి చేకూరుతోంది.’’
ఏపీలో 100 శాతం మొదటి డోస్ వ్యాక్సిన్
జనవరి 21 నాటికి ఏపీలో 100 శాతం మొదటి డోస్ వ్యాక్సిన్ పూర్తయ్యింది. కోవిడ్ నియంత్రణలో భాగంగా ఇప్పటి వరకు 3.2 కోట్ల నిర్దారణ పరీక్షలు ప్రభుత్వం చేసింది. పడకలు, ఐసీయూ సౌకర్యం, ఆక్సిజన్ ఉత్పత్తి వంటి మౌలిక సదుపాయాలు కల్పించుకున్నాం. 15-18 ఏళ్ల వయసు ఉన్న వారికి 93 శాతం మేర వ్యాక్సిన్ పూర్తి చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 95 శాతం హామీలను ప్రభుత్వం నెరవేర్చింది. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది’’ అని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు.
తొలుత పోలీసు దళాల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన శకటాల ప్రదర్శన జరిగింది. మొత్తం 16 శాఖలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించారు.