AP Weather Updates: దక్షిణ తమిళనాడు నుంచి రాయలసీమ వరకు ఉన్న ద్రోణి, సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ఫలితంగా నేడు ఏపీలో వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో చలి తీవ్రత తగ్గడం లేదు. వర్షాలు తగ్గిన కారణంగా తెలంగాణలో చలి తీవ్రత తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలే అందుకు కారణమని వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయి. అయితే వాతావరణ శాఖ ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదు.
అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో నేడు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. రేపు సైతం తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఎలాంటి సమస్య లేదని అధికారులు సూచించారు. వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, యానాం, పుదుచ్చేరిలలో నేడు వర్షాలు కురవనున్నాయి. ఏపీలో ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాల కారణంగా చలి తీవ్రత పెరిగింది. అత్యల్పంగా నందిగామలో 16.5 డిగ్రీలు, జంగమేశ్వరపురంలో 16.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. బాపట్లలో 17.7 డిగ్రీలు, అమరావతిలో 17.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తగ్గలేదు కానీ వర్షాల కారణంగా చలి గాలులు వీస్తున్నాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోనూ నేడు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు సైతం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల పడతాయని అంచనా వేశారు. రెండు రోజుల తరువాత వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. కోస్తాంధ్రతో పోల్చితే రాయలసీమలో చలి తీవ్రత అధికంగా ఉంది. అత్యల్పంగా అనంతపురంలో 15.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, కర్నూలులో 17.8 డిగ్రీలు, నంద్యాలలో 18.2 డిగ్రీలు, ఆరోగ్యవరంలో 19 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణకు ఎలాంటి వర్ష సూచన లేదని తెలిపింది. ఆకాశం నిర్మలమై కనిపిస్తుంది. నైరుతి దిశ నుంచి గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రంలో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలు ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. ఉదయం వేళలో కొన్నిచోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది.
Also Read: Nellore Police: నెల్లూరు పోలీసుల మర్యాదలే వేరబ్బా.. నిజమేనా అని డౌటా..! అయితే ఇది చదవండి