ఇంటర్నెట్ వినియోగం రోజు రోజుకూ పెరిగిపోతుంది. వినియోగంతో పాటు ఆన్ లైన్ మోసాలు కూడా రెట్టింపయ్యాయి. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు పాత పద్ధతులను కొత్తగా వాడుతున్నారు. ఆన్ లైన్ లో ఆశ్లీల వీడియోలు(పోర్న్) చూసే వారిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇటువంటివి ఇటీవల కాలంలో ఎక్కువైపోయాయి. ఇటీవల వచ్చిన నివేదిక ప్రకారం పోర్న్ సైట్‌లలోని వీడియో చూస్తున్నప్పుడు ఒక పాప్ అప్ వస్తుంది. 'మీ బ్రౌజర్ లాక్ చేయబడింది' అని వినియోగదారులను హెచ్చరించే నకిలీ పాప్-అప్‌ స్ర్కీన్ మీద కనిపిస్తుంది. ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని రాజశేఖర్ రాజహరియా అనే సెక్యూరిటీ రిసెర్చర్ హెచ్చరిస్తున్నారు.  అనుమానాస్పద యూఆర్ఎల్ స్క్రీన్‌షాట్‌ ను ఆయన ట్వీట్ లో ఉంచారు. 






ట్విట్టర్‌లో ఇంటర్నెట్ భద్రతా పరిశోధకుడు రాజశేఖర్ రాజహరియా తెలిపిన వివరాల ప్రకారం... పోర్న్ చూడటం వల్ల వారి బ్రౌజర్ లాక్ చేయబడిందని పాప్-అప్ వినియోగదారులను హెచ్చరిస్తుంది. బ్రౌజర్‌ను అన్‌బ్లాక్ చేయడానికి బదులుగా వినియోగదారులు డబ్బు చెల్లించాలని అడుగుతుంది. ఆ పాప్ అప్ న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చినట్లు కనిపిస్తుంది. 173-279 నిబంధనల మేరకు వినియోగదారుడి కంప్యూటర్ 'బ్లాక్ చేయబడిందని అందులో పేర్కొంటారు. 'భారత చట్టం ద్వారా నిషేధించబడిన సైట్ లను వీక్షించిన కారణంగా బ్రౌజర్ లాక్ చేశామని పాప్ అప్ లో ఉంటుంది. 


Also Read:  ఫిబ్రవరిలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు! ఏయే రోజుల్లోనంటే!


ఈ పాప్ అప్ లో వినియోగదారులు కంప్యూటర్‌ను అన్‌లాక్ చేయడానికి జరిమానాగా రూ. 29,000 కట్టాలని ఉంటుంది. వినియోగదారుడు జరిమానా చెల్లించడంలో విఫలమైతే కంప్యూటర్‌కు సంబంధించిన కేస్ మెటీరియల్‌లు క్రిమినల్ ప్రొసీడింగ్‌ల కోసం మంత్రిత్వ శాఖకు బదిలీ చేస్తామని అందులో ఉంటుంది. జరిమానా చెల్లించడానికి వినియోగదారుడికి 6 గంటల సమయం ఉందని పేర్కొంది. ఇందులో వినియోగదారులు వీసా లేదా మాస్టర్ కార్డు ద్వారా జరిమానా చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. పేమెంట్ చేసిన వెంటనే బ్రౌజర్ అన్ లాక్ అవుతుందని పాప్ అప్ ఉంటుంది. 


ఎలా అన్ బ్లాక్ చేయాలంటే...


ఇలాంటి ఫేక్ పాప్ అప్ లకు మోస పోవద్దని రాజశేఖర్ రాజహరియా తెలిపారు. సైబర్ కేటుగాళ్లు లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖ పేరు మీద తప్పుడు పాప్ అప్ లు పంపుతున్నారని అన్నారు. దేశంలో పోర్న్ నిషేధించబడినప్పటికీ, నిషేదించిన వెబ్‌సైట్‌ల కోసం వెతికేవాళ్లను ప్రభుత్వం ట్రాక్ చేయదన్నారు. ఇలాంటి టెక్నిక్ ను గతంలో వాడేవారని, ఇప్పుడు మళ్లీ సైబర్ నేరగాళ్లు ఈ కిటుకు వాడుతున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. గత ఏడాది జూలైలో ఇలాంటి స్కామ్‌ బయటపడిందన్నారు. ఇలాంటి వాటిల్లో చిక్కకుండా ఉండేందుకు పోర్న్ సైట్లు చూడకుండా ఉండడం ఉత్తమమన్నారు. అటువంటి పాప్-అప్ మీ కంప్యూటర్‌లో కనిపిస్తే, బ్రౌజర్ విండోను క్లోజ్ చేయాలని ఆయన సూచించారు. అది పని చేయకపోతే పాప్-అప్ మీ బ్రౌజర్‌ను పూర్తిగా కనిపించకుండా చేసినట్లు అయితే టాస్క్ మేనేజర్ (ctrl+alt+delete) క్లిక్ చేసి ఎండ్ టాస్క్‌ సెలెక్ట్ చేస్తే క్లోజ్ అవుతుందని తెలిపారు. ఈ రెండు పద్ధతులు పని చేయని పక్షంలో షట్ డౌన్ ఆఫ్షన్ ఉపయోగపడుతుందన్నారు. 


Also Read: గౌతమ్ గంభీర్‌కు కరోనా పాజిటివ్.. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని ట్వీట్