Gambhir Corona Positive: కరోనా వైరస్ వ్యాప్తి దేశంలో మరోసారి పెరిగింది. ఇటీవల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఈ జాబితాలో గౌతమ్ గంభీర్ చేరారు. టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
తనకు లక్షణాలు కనిపంచడంతో టెస్టులు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తనకు తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్నాయని గౌతమ్ గంభీర్ తెలిపారు. ఇటీవల తనని కలిసిన వారందరూ తప్పక కొవిడ్19 నిర్దారణ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. ఇటీవల పర్యటనల్లో పాల్గొన్న బీజేపీ జాతీయ నేతలు కరోనా బారిన పడి కోలుకున్నారు.
దేశంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఢిల్లీ ఒకటి. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులో కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ అధికంగా ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా విజయం సాధించిన గౌతమ్ గంభీర్ పార్టీ పనుల్లో బిజీగా ఉంటున్నారు. పార్టీ పనులు చూసుకుంటూనే క్రికెట్‌కు సంబంధించిన అంశాలపై స్పందిస్తున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌పై సైతం గంభీర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. జట్టులో సరైన మార్పులు చేయకపోతే ప్రతికూల ఫలితాలు వస్తాయని చెప్పారు.
నిన్నటితో పోల్చితే దేశంలో 50 వేల పాజిటివ్ కేసులు తక్కువ నమోదయ్యాయి. వరుసగా ఐదోరోజులు 3 లక్షలు దాటిన కరోనా కేసులు నేడు భారీగా తగ్గాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,55,874 (2 లక్షల 55 వేల 874) మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో మరో 614 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. నిన్నటితో పోల్చితే కరోనా మరణాలు 170 వరకు పెరిగాయి. నిన్న ఒక్కరోజులో 2 లక్షల 67 వేల 753 మంది కరోనాను జయించారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 22,36,842కు చేరుకుంది.
Also Read: ICC Awards: 2021లో ఉత్తమ టెస్టు క్రికెటర్ అవార్డు ఇతనే.. ఎన్ని పరుగులు చేశాడంటే?