ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్‌కు 2021 సంవత్సరానికి గానూ ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. ఈ సంవత్సరం జో రూట్ టెస్టు క్రికెట్‌లో ఎంతో నిలకడను ప్రదర్శించాడు. గుర్తుండిపోయే ఇన్నింగ్స్ కూడా ఆడాడు. 2021లో జో రూట్ 15 టెస్టు మ్యాచ్‌ల్లోనే 1708 పరుగులు సాధించాడు.


ఒకే క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో 1,700కు పైగా పరుగులు చేసిన ఆటగాళ్లు కేవలం ఇద్దరు మాత్రమే. పాకిస్తాన్ క్రికెటర్ మహ్మద్ యూసుఫ్ 2006లో 11 టెస్టుల్లో 1,788 పరుగులు సాధించాడు. 1976లో వెస్టిండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ 11 టెస్టుల్లో 1710 పరుగులు సాధించాడు. వీరి తర్వాత ఈ మార్కును చేరుకుంది జో రూటే.


ఆసియాలో, స్వదేశంలోనూ ఎంత బలమైన బౌలింగ్ అటాక్ మీద అయినా రూట్ ఎంతో కంట్రోల్‌తో ఆడాడు. గాలేలో శ్రీలంకపై, చెన్నైలో భారత్‌పై ఎంతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతోపాటు టెస్టులో తను 14 వికెట్లు తీసుకున్నాడు. అహ్మదాబాద్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసుకోవడం విశేషం.


భారత్‌తో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రూట్ 218 పరుగులు చేశాడు. అత్యుత్తమ పేస్, స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ రూట్ ఈ పరుగులు చేయడం విశేషం. ఆ తర్వాత రూట్ శ్రీలంక సిరీస్‌లో కూడా అద్భుతంగా రాణించాడు. గాలే టెస్టులో 228 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.