చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని అక్రమ క్వారీలపై అధికారుల వరుస దాడులు కొనసాగుతున్నాయి. నాలుగు బృందాలు అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తున్న క్వారీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. గడిచిన రెండు వారాలుగా క్వారీలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతోందని గుర్తించిన అధికారులు, సంబంధిత వాహనాలను అలాగే తరలింపునకు సిద్ధంగా ఉన్న గ్రానైట్ దిమ్మెలను సీజ్ చేశారు. తన నియోజకవర్గంలో అధికార వైసీపీ నేతలు పెద్ద ఎత్తున అక్రమ క్వారీకి పాల్పడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన తరుణంలో అధికారులు ముమ్మర తనిఖీలు కొనసాగిస్తున్నారు. 



చంద్రబాబు ఆరోపణలతో వెలుగులోకి 


ఈ నెల మొదటి వారంలో కుప్పంలో పర్యటించిన చంద్రబాబు మూడు రోజుల పాటు ఇక్కడే గడిపారు. చివరి రోజు అనూహ్యంగా ఆయన అక్రమ క్వారీలను సందర్శించారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర ప్రమాదకర ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు అక్కడ క్వారీ జరుగుతున్న తీరును చూసి నివ్వెర పోయారు. ఎలాంటి అనుమతులు లేకుండా నియోజకవర్గంలోని శాంతిపురం, గుడుపల్లె మండలాలలో పెద్ద ఎత్తున క్వారీలు జరుగుతున్నట్లు స్థానిక నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. క్వారీ జరుగుతున్న ప్రాంతాలను స్వయంగా చంద్రబాబు పరిశీలించారు. స్థానిక వైసీపీ నేతలు అలాగే మంత్రి పెద్దిరెడ్డి పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి ఆశీస్సులతోనే కుప్పం వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. కాగా చంద్రబాబు ఆరోపణలు చేసిన 24 గంటల వ్యవధిలోనే మైనింగ్ అధికారులు రంగంలోకి దిగారు. 


Also Read: ఆర్టీసీ ఉద్యోగులూ సమ్మెలోకి ! ప్రభుత్వంలో విలీనం చేశాక వారికొచ్చిన కష్టాలేంటి ?


మైనింగ్ అధికారుల వరుస దాడులు 


చంద్రబాబు పర్యటించిన శాంతిపురం మండలంలోని ముద్దునపల్లె, సి బండపల్లి గ్రామాలలోని క్వారీలను అధికారులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో మైనింగ్ శాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డితో సహా పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. శాంతిపురం, గుడుపల్లె మండలాల్లో అక్రమ క్వారీ జరుగుతోందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన మైనింగ్ అధికారులు ఎట్టకేలకు దూకుడు పెంచారు. పెద్ద ఎత్తున మైనింగ్ అధికారులు కుప్పం చేరుకొని, నాలుగు బృందాలుగా విడిపోయి పలు క్వారీలలో తనిఖీలు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా అనేక చోట్ల అక్రమ మైనింగ్ చేస్తున్నారని అధికారులు గుర్తించారు. గడచిన పది రోజులుగా కుప్పం నియోజకవర్గం అంతటా మైనింగ్ అధికారులు దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు మైనింగ్ కు వినియోగించే నాలుగు ప్రొక్లెయినర్లు, 10 కంప్రెసర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తరలించడానికి సిద్ధంగా ఉన్న 200 గ్రానైట్ దిమ్మెలను సీజ్ చేశారు. ఈ దాడులు మరిన్ని రోజుల పాటు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాగా అధికారుల తనిఖీలతో మైనింగ్ మాఫియా ఎక్కడికక్కడ సైలెంట్ అయ్యారు.


Also Read: కొత్త పీఆర్సీపై రంగంలోకి వాలంటీర్లు... ప్రభుత్వ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశాలు