మగపిల్లాడు కావాల్సిందే, అతడే కదా  ఇంటి పేరును నిలబెట్టే వారసుడు... ఇది మన సమాజంలో ఎప్పటినుంచో నానుకుపోయిన నమ్మకం. ఆ నమ్మకాలు మనం పెట్టుకున్నవి. మార్చుకుంటే మారిపోతాయ్, కానీ మార్చుకోం. తరతరాలుగా రక్తంలో ఇంకిపోయిన మూఢనమ్మకాలను అంత సులువుగా తీసిపారేసే పెద్దమనుషులు ఎంత మంది ఉన్నారు మన సమాజంలో. ఇద్దరూ కూతుళ్లే పుట్టారని ఏడ్చే తల్లిదండ్రులు, బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటూ పాత చింతకాయపచ్చడి సామెతలు చెప్పే మూర్ఖులు తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఆడపిల్ల మారింది, అప్పట్లోలాగా పదహారేళ్లకు పెళ్లిచేసుకుని వెళ్లిపోయే పప్పు ముద్ద కాదు, అనుకుంటే  అంతరిక్షపు అంచులను తాకగలదు, రాజకీయాల్లో రాణించగలదు, ఆటోమేషన్ కాలంలోను తన సత్తా చాటగలదు.  గృహిణిగా, తల్లిగా మాత్రమే ఆమె పాత్రను పరిమితం చేయకండి... ఆమె రెక్కలకు కాస్త స్వేచ్ఛనివ్వండి ఉద్యోగిగా, ప్రజాప్రతినిధిగా, ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదగగలదు. అలాంటి స్వేచ్ఛను పొంది తమకంటూ సొంతగుర్తింపును సాధించి రాణిస్తున్న అమ్మాయిలు ఎంతో మంది.


శిరీష బండ్ల
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శిరీష అయిదేళ్ల వయసులో తల్లిదండ్రులతో పాటూ అమెరికా వెళ్లింది. అప్పట్నించి అక్కడే స్థిరనివాసం. అక్కడ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఏరోస్పేస్ ఇంజినీర్ గా పనిచేయడం మొదలుపెట్టింది. వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ వారి అంతరిక్ష యాత్ర ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ అంతరిక్ష యాత్ర చేసిన వ్యక్తుల్లో ఆమె కూడా ఒకరు. చాలా తక్కువ మందికి వచ్చే అవకాశం ఇది. శిరీషకు ఇష్టమైనది చదువకునే, ఉద్యోగం చేసే స్వేచ్ఛను ఆమె తల్లి దండ్రులు అందించారు. 


షెఫాలీ వర్మ
కేవలం పదిహేనేళ్ల వయసుకే భారత క్రికెట్ జట్టుకు ఎంపికై సచిన్ రికార్డులను బద్ధలు కొట్టింది షెఫాలీ. ఓపెనర్ గా దిగి బంతిని సిక్సర్లు బాదడంలో ఈ అమ్మాయి స్పెషల్. మహిళల టీ20 ప్రపంచకప్ లో భారతజట్టు ఫైనల్ కు చేరిందంటే ఈమెనే కారణం. రోహత‌క్ లో జన్మించిన ఈమె వయసు ప్రస్తుతం 17 ఏళ్లు మాత్రమే.  దేశం మెచ్చిన క్రికెటర్ గా ఎదగడంలో ఆమెకు తండ్రి నుంచి అందిన సహకారం ఇంతా అంతకాదు. చదువు మాని ఆడపిల్ల క్రికెట్ ఆడుతుంటే ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు. అయినా ఆయన వెనకడుగు వేయకుండా కూతురికి శిక్షణనిప్పించారు. అలాగని వారిది ధనిక కుటుంబం కాదు, మధ్యతరగతిదే. 


హర్నాజ్ కౌర్ సంధు
పంజాబ్‌కు చెందిన హర్నాజ్‌కు చిన్నప్పట్నించి మోడలింగ్ అంటే ఇష్టం. సినిమాల వైపు వెళ్లాలన్న ఆసక్తి ఉండేది. ఆమె ఆశలకు, ఆశయాలకు తల్లిదండ్రులు అడ్డుగా నిలవలేదు. ప్రోత్సహించారు. దీంతో కేవలం 17 ఏళ్లకే ర్యాంప్ పై వాక్ చేసి మోడల్‌గా మారింది. కొన్ని చిత్రాల్లోనూ నటించింది. చదువుకుంటూనే ‘మిస్ ఛండీఘర్’, ‘మిస్ పంజాబ్’ కిరీటాలను సాధించింది. ఈ విజయాలు ఆమె తల్లిద్రండుల్లో మరింత నమ్మకాన్ని పెంచాయి. దీంతో ఏకంగా మిస్ ఇండియా పోటీలకే పంపారు. అక్కడ కూడా గెలిచి నిలిచింది. చివరికి 21 ఏళ్ల తరువాత మిస్ యూనివర్స్ కిరీటాన్ని స్వదేశానికి తెచ్చింది. ఇది కేవలం ఆమె కృషి ఫలితమే కాదు ఆమెలో ఆత్మస్థ్యైర్యాన్ని నింపి ప్రోత్సహించిన కన్నవారిది కూడా.  







ప్రియాంక మోహితే
బెంగళూరుకు చెందిన ప్రియాంక మోహితే ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతాలలో ఒకటైన మౌంట్ అన్నపూర్ణను అధిరోహించింది. ఎక్కేందుకు కష్టమైన పర్వతాలలో అది కూడా ఒకటి. ఆమె ఒక పక్క ఉద్యోగం చేస్తూనే సెలవుల్లో పర్వతాలు అధిరోహిస్తుంది. ఆమెకు పర్వతారోహణ అంటే చాలా ఇష్టం అందుకే 2015 నుంచి ఆ పని మొదలుపెట్టింది. కిలిమంజారో, ఎవరెస్ట్ పర్వతాలు కూడా ఎక్కింది ప్రియాంక. ఈమె 8000 మీటర్లు ఎత్తు దాటిన పర్వతాలు ఇప్పటివరకు నాలుగు ఎక్కింది. ఈమెకు కర్ణాటక ప్రభుత్వం పలు అవార్డులతో సత్కరించింది కూడా. 


ప్రతి ఆడపిల్ల విజయంలో ఆమె తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల పాత్ర చాలా ముఖ్యం. వారు అండగా ఉంటే ఆమె ఎంతటి విజయాన్నయినా సాధిస్తుంది.