పీఆర్సీ జీవోలపై ఆగ్రహంతో ఉన్న ఏపీ ఉద్యోగ సంఘాలు... ఆ జీవోలను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సీఎస్ ను కలిసి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే ప్రభుత్వంతో చర్చిస్తామని పీఆర్సీ సాధన సమితి తేల్చిచెప్పింది. చర్చలకు రావాలని ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ చేసిన చర్చల ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. మంత్రుల కమిటీ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాలని కోరింది. అయితే ఉద్యోగ సంఘాలు జీవోలు రద్దు చేస్తేనే చర్చల గురించి ఆలోచిస్తామని ప్రకటించారు. అశుతోష్‌ మిశ్ర కమిటీ నివేదిక బయటపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 


విజయవాడలో పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్‌ కమిటీ ఆదివారం సమావేశమైంది. సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రభుత్వం, వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని కమిటీ ఖండించింది. ఇలాంటి ఎప్పుడూ చూడలేదని స్పష్టం చేసింది. జనవరి నెలకు పాత జీతాలే ఇవ్వాలని డిమాండ్ చేసింది. జిల్లాలతో ఉద్యమ కార్యాచరణ, సోషల్ మీడియా సమన్వయం కోసం 8 మంది సభ్యులతో పర్యవేక్షణ సెల్‌ను ఏర్పాటు చేశామని కమిటీ తెలిపింది. స్టీరింగ్‌ కమిటీలో సభ్యులను 20కి పెంచినట్లు వెల్లడించారు. 


Also Read: సమ్మె వద్దు.. చర్చించుకుందాం రండి.. ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రుల ఫోన్


ఉద్యోగులపై దుష్పచారం 


ఉద్యోగులు ప్రభుత్వంపై యుద్ధం చేయడం లేదని ఉద్యోగుల జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉన్నారు.  ఉద్యోగులను రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదన్నారు. సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా ప్రభుత్వం, వైసీపీ నేతలు ఉద్యోగులపై విమర్శలు చేస్తున్నారన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాల్సిన ప్రభుత్వం దానిని విరుద్ధంగా రెచ్చగెట్టే వాతావరణం సృష్టించకూడదని హితవు పలికారు. ఉద్యమ సమయంలో ఆవేదనతో మాట్లాడిన వారిపై కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వాలంటీర్ల ద్వారా ఉద్యోగులపై దుష్పచారం చేస్తున్నారని ఆవేదన చెందారు. ఉద్యమంలోకి ఏ రాజకీయ పార్టీనీ రానివ్వడం లేదని బొప్పరాజు తెలిపారు. పీఆర్సీ నివేదికపై చర్చించకుండానే నివేదిక ఇవ్వడంపై నిరసన తెలుపుతున్నామని ఆయన అన్నారు. ఉద్యమంలో ఎవరూ రాజకీయ, వ్యక్తిగత దూషణలు చేయవద్దని బొప్పరాజు కోరారు. 


ఇవాళ సమ్మె నోటీసు


సీఎస్ కు ఇవాళ మధ్యా్హ్నం 3 గంటలకు సమ్మె నోటీసు ఇస్తామని ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు తెలిపారు. స్టీరింగ్‌ కమిటీలో వివిధ అంశాలపై చర్చించామన్నారు. ఉద్యోగులు ఇవాళ రోడ్లపైకి రావడానికి ప్రభుత్వమే కారణమని ఆయన అన్నారు. పీఆర్సీ ప్రకటిస్తే జీతాలు పెరగడం చూశామని, కానీ ఇప్పుడు జీతాల రికవరీ చూస్తున్నామన్నారు. జనవరి నెలకు పాత జీతాలే ఇవ్వాలని సీఎస్‌ను కోరామని ఆయన అన్నారు. ప్రభుత్వం కొత్త జీతాలు ఇవ్వాలని ట్రెజరీ అధికారులను ఒత్తిడి చేస్తుందని అది సరికాదన్నారు. 


ఉద్యోగ సంఘాలన్నీ కలిసి పోరాడుతున్నాయి


పీఆర్సీ జీవోల వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. పీఆర్సీపై చర్చల సమయంలో సమన్వయలోపంతో నష్టం జరిగిందని ఆయన అన్నారు. అందుకే ఇప్పుడు అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి పోరాడుతున్నాయన్నారు. పీఆర్సీ ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. అశుతోష్‌ మిశ్ర నివేదిక బయటపెట్టాలని కోరారు. 


కొత్త పీఆర్సీ బలవంతంగా అమలు సరికాదు


పీఆర్సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటేనే ప్రభుత్వంతో చర్చలు ఉంటాయని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ పేర్కొన్నారు. మంత్రుల కమిటీ ఏర్పాటుపై మీడియాలో చూశామని, ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపేందుకు అధికారంగా కమిటీ ఏర్పాటు చేసినట్లు ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదని ఆయన అన్నారు. కొత్త పీఆర్సీని బలవంతంగా అమలుచేయడం సరికాదని ఆయన అన్నారు. రాజకీయ వివాదాలకు తావు ఇవ్వకుండా ఉద్యోగులకు జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు.


Also Read: కొత్త పీఆర్సీ మేరకే జీతాలు... ఏపీ సర్కార్ మరోసారి ఉత్తర్వులు