పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని ఉద్యోగులు సమ్మెకు సమాయత్తమవుతున్నాయి. అయితే ఏపీ సర్కార్ కొత్త పే స్కేళ్లతో జీతాలు చెల్లించేలా మరోసారి ఉత్తర్వులు విడుదల చేసింది. 11వ పీఆర్సీ ప్రకారమే కొత్త పే స్కేళ్లతో జనవరి నెల జీతాలు చెల్లించేందుకు బిల్లులు తయారు చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. కొత్త వేతనాలను చెల్లించేలా చూడాలని డ్రాయింగ్ డిస్బర్స్‌మెంట్ ట్రెజరీ, సీఎఫ్ఎంఎస్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్‌ను అనుసరించి 2018 జులై 1 నుంచి 2021 డిసెంబర్ 31 వరకు లెక్కగట్టి కొత్త పీఆర్సీ మేరకు సాఫ్ట్‌వేర్ మాడ్యూల్‌లో బిల్లులు అప్ లోడ్ చేయాలని సూచించింది. ఈ నెల 25 లోగా ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించింది. డీడీఓలకు కొత్త పే రోల్స్ అందుబాటులో ఉంచాలని తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు.
జీతాల్లో కోత తప్పవా..
కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులు డబ్బులు భవిష్యత్తులో తిరిగి చెల్లించాల్సి పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగుల జీతాల్లో రూ.లక్షకు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. సూపరింటెండెంట్ కేడర్ ఉద్యోగులు రూ.70 వేలకు పైగా బకాయిపడే అవకాశం ఉంది. ఉపాధ్యాయులు రూ.80 వేలకు పైగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వీరి నుంచి భవిష్యత్తులో ఇచ్చే డీఏ లో ఆ మొత్తాలను వసూలు చేసుకుంటామని సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. హెచ్‌ఆర్‌ఏలో మార్పు లేని ఉద్యోగులు మాత్రం అదనంగా ప్రభుత్వం నుంచి కొంత మొత్తం పొందుతారు.
11వ పీఆర్సీ అమలుకు సంబంధించిన ఫిట్‌మెంట్, హెచ్‌ఆర్‌ఏ అంశాలతోపాటు విధివిధానాలపై జనవరి 17న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. జీవో నంబరు ఒకటిలో అన్ని వివరాలను పొందుపరిచింది. 2019 జులై నుంచి మూలవేతనంపై 27% ఐఆర్ ఇచ్చిన ప్రభుత్వం తాజా జీవోల్లో 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ ప్రయోజనం కల్పిస్తామని, 2022 జనవరి జీతంతో కలిపి కొత్త వేతనాలు చెల్లిస్తామందని ప్రకటించింది. కొత్త పీఆర్సీలో ఫిట్ మెంట్ ను 23 శాతానికి కుదించింది. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులన్నీ మర్చి సిటీ కాంపెన్సేటరీ అలవెన్సు తొలగించింది. దీంతో ఇప్పటికే అదనంగా తీసుకున్న ఐఆర్ మొత్తాన్ని లెక్కించి ఆ మొత్తాన్ని డీఏ బకాయిల నుంచి మినహాయిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ మినహాయింపుల తర్వాత అదనంగా చెల్లించాల్సి వస్తే జీపీఎఫ్ ఖాతాలకు వాయిదాల్లో జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఒక వేళ ఉద్యోగులు ప్రభుత్వానికి బకాయి ఉంటే దానిని భవిష్యత్తులో ఇచ్చే డీఏ నుంచి మినహాయించుకుంటామని వెల్లడించింది. ఈ నెల 17న ఇచ్చిన జీవో నెం.1 లో ఈ విషయాన్ని పేర్కొంది.
Also Read: రాజద్రోహమే కాదు.. ప్రభుత్వంపై యుద్ధం కూడా ప్రకటించాడని కేసులు.. సాక్ష్యాల్లేవని బెయిలిచ్చిన కోర్టు !