మెరుగైన పీఆర్సీ (PRC), కోతల్లేని HRAల కోసం పోరాడుతున్న ఉద్యోగ సంఘాలకు సోషల్ మీడియా నుండి మద్దతు అంతగా రావడం లేదు. పైపెచ్చు, విచిత్రంగా వారి పోరాటంపై నెటిజెన్స్ నుండి ట్రోల్స్ వస్తున్నాయి. ప్రతీ నెలా ఒకటో తారీఖున ఠంచనుగా జీతాలు తీసుకునే ఉద్యోగులకు పీఆర్సీతో పనేంటి అన్న స్థాయిలో కామెంట్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఒక్కసారి ఉద్యోగం వస్తే చాలు దాదాపు 30 ఏళ్లపాటు ఉద్యోగ భద్రతకు ఢోకా లేని జీవితాలు గల ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు ఇంత భారీ స్థాయిలో ధర్నాలకు దిగుతున్నారు అన్న విమర్శలు నెటిజెన్స్ నుండి వస్తున్నాయి.


ప్రజల్లో సానుభూతి లేకపోవడానికి కారణం ఉద్యోగుల ప్రవర్తనే..
నిజానికి నెటిజెన్స్ నుండీ వస్తున్న విమర్శల్లో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఏంతో కొంత లేకపోలేదు. సామాన్యుడికీ, ప్రభుత్వ ఉద్యోగికీ ఉండాల్సిన సున్నితమైన బంధం ఎక్కడో తెగిపోయింది అన్న భావన ప్రస్తుత సోషల్ మీడియా ట్రెండ్ చూస్తే అర్ధమవుతుంది. దీనికి ఒక విధంగా బాధ్యత వహించాల్సింది ప్రభుత్వ ఉద్యోగులే అన్న మాట కూడా వాస్తవం. ఒక్కసారి ఉద్యోగం వస్తే చాలు చిన్న ఉద్యోగి అయినా సామాన్యుడికి అందుబాటులో ఉండడు అన్న అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది. గ్రామ స్థాయిలో ఒక చిన్న అధికారిని కలవాలన్నా బడుగుజీవికి కనీసం ఒకటి రెండు రోజులు సమయం పట్టే పరిస్థితి తెలిసిందే.


ఇక సచివాలయం స్థాయి పనులైతే సామాన్యుడికి అదో మాయా ప్రపంచం. ఏపనికి, ఎవరిని కలవాలో ఎవరి వద్ద ఏ సమాచారం దొరుకుతుందో, ఎక్కడ ఎంత అడుగుతారోనన్న పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. పైగా చాలా చోట్ల సవ్యంగా సమాధానం దొరకదు అన్న అభిప్రాయం జనాల్లో ఉంది. ఇక లంచాల పరంగా కూడా చేయి తడపనిదే చాల చోట్ల పని జరగదన్న అభిప్రాయం కలగడానికి కూడా కొందరు ఉద్యోగుల ప్రవర్తనే అన్న విశ్లేషణలు సోషల్ మీడియాలో కనపడుతున్నాయి. అందుకే తమ జీతాల పెరుగుదలకు ఉద్యోగులు చేస్తున్న ఉద్యమానికి తామెందుకు సానుభూతి చూపాలి అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఉద్యోగంలో చేరితే కనీసం 50 వేల నుండి లక్ష పైబడి జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులకు ఇంకా జీతాలు ఎందుకు పెంచాలి అన్న విమర్శలూ నెటిజెన్స్ నుండి వినవస్తున్నాయి . 

తమ తమ అజెండాతో పోస్టింగ్స్..
ఉద్యోగులపై సోషల్ మీడియాలో కనపడుతున్న విమర్శల్లో  రాజకీయ పార్టీల సోషల్ మీడియా విభాగాల  పాత్రా తక్కువేమీ కాదు. ముఖ్యంగా అధికార వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా నుండి ఉద్యోగుల ధర్నాలపై కామెంట్స్ ఎక్కువగానే పోస్ట్ అవుతున్నాయి. ఒకరిద్దరు కాస్త హద్దు దాటి పద ప్రయోగాలు చేసి తరువాత వాటిని డిలీట్ చేసిన సంఘటనలూ ఉన్నాయి. అయితే వారి సోషల్ పోస్టింగ్స్ తమ నాయకుల వ్యాఖ్యలకు అనుగుణంగా మారుతున్నాయి. ఉదాహరణకు ఒక మంత్రి ముఖ్యమంత్రిని తిడితే HRA పెరుగుతుందా అనగానే ఉద్యోగుల నిరసనలను విమర్శిస్తూ సోషల్ మీడియా లో పోస్టింగ్స్ వస్తున్నాయి. అదే ఉద్యోగులను ప్రతిపక్షాలు తప్పుదారి పట్టిస్తున్నాయి అని కామెంట్ చెయ్యగానే ఉద్యోగులకు సర్ది చెబుతూ పోస్టింగ్స్ వందల సంఖ్యలో వచ్చేస్తున్నాయి. ఈ ధోరణి గత రెండురోజులుగా సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగా కనబడుతుంది .


రెండుగా చీలిన టీడీపీ సోషల్ మీడియా
ఉద్యోగుల పోరాటంపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీది మరో విభిన్న ధోరణిగా కనపడుతుంది. ఆ విభాగం రెండు విధాలుగా స్పందిస్తుంది. ఒకవైపు ఉద్యోగుల పోరాటానికి మద్దతుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పెద్దఎత్తున పోస్టింగ్స్ పెడుతుంది. మరో వైపు అదే సోషల్ మీడియాలో ఉద్యోగులను విమర్శిస్తూ 2014లో చంద్రబాబు హయాంలో 43శాతం పీఆర్సీ ఇచ్చామనీ అయినప్పటికీ 2019లో ఉద్యోగులు చంద్రబాబును కాదని జగన్ ని ఎన్నుకున్నందుకు ఈ శాస్తి జరగాల్సిందేననీ పోస్టింగ్స్ చేస్తున్నారనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి . 

జీతభత్యాలు పెరిగితే ఎంప్లాయిలకు మాత్రమే బెనిఫిట్ కాదు :
ప్రస్తుతం ఏపీలో దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారి జీత భత్యాల కోసం, రిటైరయిన వారి పెన్షన్ల కోసంకలిపి ప్రతీనెలా దాదాపు 9000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. అయితే ఒక్కో ఉద్యోగి ఇంట్లో 5గురు సభ్యులు ఉన్నారనుకున్నా వారి మొత్తం సంఖ్య 65 లక్షల మంది. వీరిపై ఆధారపడి ఇంటి అద్దె, కిరాణా, ఫ్యాన్సీ, గ్యాస్, బట్టల దుకాణం, బ్యాంకు EMI లూ, స్కూల్ /కాలేజీ ఫీజులూ అంటూ అనేక వర్గాలు ఆధారపడి ఉంటాయి. నెల తిరిగేసరికి తప్పకుండా వచ్చే ఉద్యోగుల జీతాలే వీరికి భరోసా. ఉద్యోగ కుటుంబాల నుండి వీరికి చేరే డబ్బు మళ్ళీ పన్నుల రూపేణా ప్రభుత్వానికి అంది అక్కడనుండి సంక్షేమ పథకాలు, ప్రభుత్వ స్కీముల రూపంలో సామాన్యుల వద్దకు సరఫరా అవుతుంది. అందుకే ఈ నగదు సరఫరా చక్రంలో ఉద్యోగిది కీలక పాత్ర. వారికి జీతంలో పెరిగే ప్రతీ రూపాయి దీర్ఘకాలంలో సమాజంలోని విభిన్న వర్గాలపై ప్రభావం చూపుతుంది కాబట్టి వారు చేస్తున్న ఆందోళనను అర్ధం చేసుకోవాలి అంటున్నారు విశ్లేషకులు.
Also Read: Weather Updates: రెయిన్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు.. అక్కడ భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు


ప్రభుత్వానికి, సామాన్యుడికీ మధ్య సంబంధం ప్రభుత్వ ఉద్యోగులే..
అవునన్నా కాదన్నా ప్రభుత్వానికి, ప్రజలకూ మధ్య ఒక వారధిగా పనిచేసేది ఉద్యోగులే. ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయాన్నీ సామాన్యుల వద్దకు తీసుకెళ్లేది, సంక్షేమ పథకాల ఫలాలను లబ్ధిదారుల వద్దకు చేర్చేదీ వారే. అయితే తాజా ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ సంక్షేమ పథకాల ద్వారా సామాన్యులతో నేరుగా సంబంధాలు పెట్టుకుంటూ తమను చిన్నచూపు చేస్తుందనే అపోహ కొందరు ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నట్టే, ప్రభుత్వ ఉద్యోగులు కేవలం తమ లబ్ధికోసమే పీఆర్సీ, HRA లాంటి అంశాలపై పోరాడుతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఈ అభిప్రాయమే సోషల్ మీడియా పోస్టింగ్స్ రూపంలో నెటిజన్స్ నుండి వెలువడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే వీటిని తొలగించి ప్రజలకు తమ పోరాటంపై అవగాహన పెంచాల్సిన భాద్యత ఉద్యోగ సంఘాలదే. 


Also Read: Social Media Arrest : రాజద్రోహమే కాదు.. ప్రభుత్వంపై యుద్ధం కూడా ప్రకటించాడని కేసులు.. సాక్ష్యాల్లేవని బెయిలిచ్చిన కోర్టు ! 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి