ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిని మానవబాంబుగా మారి చంపేస్తానని ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టి తీసేసిన జనసేన సానుభూతి పరుడు ఫణికి గుంటూరు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ కేసు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ ఫణిపై రాజద్రోహం, ప్రభుత్వంపై యుద్ధం చేయడం వంటి కేసులు పెట్టారు. ఆ సెక్షన్లు పెట్టడానికి ఆధారాలేమిటని న్యాయమూర్తి ప్రశ్నించారు. డిలీట్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ తప్ప మరేమీ ఆధారం లేకపోవడంతో పోలీసులు ఉద్దేశపూర్వకంగా నిందితుడ్ని జైల్లో ఉంచేందుకు ఈ సెక్షన్లు పెట్టారని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమాండ్ రిపోర్టును తరిస్కరించి.. బెయిల్ మంజూరు చేశారు.
Also Read: నెల్లూరు జిల్లాలో ఘాతుకం... సహజీవనంలో గొడవలు ఇద్దరి దారుణ హత్య
రాజమండ్రికి చెందిన పవన్ ఫణి.. హైదరాబాద్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నాయి. జనసేనపై అభిమానంతో టీడీపీ, వైసీపీపై ట్వీట్లు చేస్తూ ఉంటారు. అయితే ఆయన ఇటీవల మానవబాంబుగా మారి సీఎం జగన్‌ను చంపేస్తానని పోస్టు పెట్టి.. కాసేపటికి తీసేశాడు. ఆ తర్వాత పోలీసులు పట్టుకుంటారేమోనన్న భయంతో ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేశారు. అయితే అయితే సైబర్ క్రైం పోలీసులు మాత్రం వెంటపడి పట్టుకుని రాజద్రోహం.. ప్రభుత్వంపై యుద్ధం కేసులు పెట్టారు. శుక్రవారం అరెస్ట్ చూపించారు. శనివారం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు.
అయితే ఫణితో తమ పార్టీకి సంబంధం లేదని జనసేన ప్రకటించింది. సోషల‌్ మీడియాలో దుష్ప్రచారం చేసే వారిని ప్రోత్సహించమని జనసేన మీడియా విభాగం తెలిపింది. సీఎంను చంపుతానని పోస్టు చేసిన వ్యక్తికి, తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. పార్టీ అభిమాని ముసుగులో పోస్టులు చేసేవారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సామాజిక మాధ్యమాల్లో హుందాగా వ్యవహరించాలని.. వాస్తవ, విశ్లేషణాత్మక, చైతన్యపరిచేలా పోస్టులు ఉండాలని చెప్పింది.