నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కలిగిరి మండలంలోని అమ్మటివారి పాలెంలో తల్లి, కొడుకు దారుణంగా హత్యకు గురయ్యారు. రబ్బానీ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మృతురాలు మీరాబీ కుమార్తె నూర్జహాన్ తో రబ్బానీకి వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. నూర్జహాన్ భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటుంది. ఈ క్రమంలో రబ్బానీతో సంబంధం ఏర్పడింది. వారిద్దరికి ఓ బిడ్డ కూడా ఉన్నట్లు సమాచారం. ఇద్దరు కావలిలో కలిసి ఉంటున్నారు. ఆ తర్వాత వీళ్లద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో నూర్జహాన్ తన అమ్మ దగ్గరకు వచ్చేసింది. కలిగిరి మండలం అమ్మటివారిపాలెంలో తల్లి మీరాబీ, తమ్ముడు అలీఫ్ తో కలిసి ఉంటోంది.
Also Read: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి యువతి షికారు.. ఆకతాయిల ఎంట్రీతో కథలో ట్విస్ట్...
కత్తితో దాడి
అయితే నూర్జహాన్ ని భార్యగా భావించి ఆమెతోనే ఉంటున్న రబ్బానీకి ఇది నచ్చలేదు. తనని కాదని తల్లి దగ్గరకు వెళ్లే సరికి నూర్జహాన్ పై కక్ష పెంచుకున్నాడు రబ్బానీ. ఆమెకు రక్షణ ఇచ్చిన ఆమె తల్లి, తమ్ముడిపై కూడా పగ పెంచుకున్నాడు. కావలి నుంచి అమ్మటివారిపాలెంకు వచ్చిన రబ్బానీ నేరుగా నూర్జహాన్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె లేకపోయే సరికి ఆమె తల్లి, తమ్ముడితో గొడపడ్డాడు. నూర్జహాన్ ని తనతో పంపించేయాలని అన్నాడు. అయితే వారు దానికి ఒప్పుకోలేదు. నూర్జహాన్ పై ఒత్తిడి తేవద్దని కోరారు. తనతోపాటు కత్తిని కూడా తెచ్చుకున్న రబ్బానీ, కోపంలో మీరాబీని విచక్షణా రహితంగా నరికేశాడు. అడ్డం వచ్చిన ఆమె కొడుకు అలీఫ్ ని కూడా కత్తితో గాయపరిచాడు. దీంతో వారిద్దరూ రక్తపుమడుగులో పడి చనిపోయారు.
Also Read: ఈ చదువులు వద్దు.. ఒత్తిడి తట్టుకోలేక బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో ఏముందంటే..!
జంట హత్యల కలకలం
ఈ హత్యలతో నెల్లూరు జిల్లాలో కలకలం రేగింది. జంట హత్యల విషయంపై పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. సీఐ సాంబశివరావు, ఎస్ఐ లక్ష్మీ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హంతకుడు అప్పటికే అక్కడినుంచి పారిపోయాడు. రబ్బానీ వారిద్దరినీ హత్యచేశాడని ప్రత్యక్ష సాక్షుల నుంచి తెలుసుకున్నామని చెప్పారు కావలి అడిషనల్ ఎస్పీ ప్రసాద్. రబ్బానీ కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.
Also Read: ఇవిగో గుడివాడ కేసీనో ఆధారాలు... రిలీజ్ చేసిన టీడీపీ !