నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఇవాళ్టి నుంచి దేశంలో గణతంత్ర వేడుకలు ప్రారంభంకానున్నాయి. నేతాజీ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా గేట్ వద్ద బోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. జనవరి 23ను దేశవ్యాప్తంగా పరాక్రమ్ దివస్‌గా నిర్వహిస్తున్నారు.
“దేశమంతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని జరుపుకుంటున్న తరుణంలో, ఇండియా గేట్ వద్ద గ్రానైట్‌తో చేసిన ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నందుకు నేను సంతోషిస్తున్నాను. నేతాజీ త్యాగానికి భారత్ ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. ఆ త్యాగానికి చిహ్నమే ఈ విగ్రహం” అని ప్రధాని తన ట్విట్టర్ హ్యాండిల్‌లో రాశారు. నేతాజీ నిజమైన గ్రానైట్ విగ్రహం పూర్తయ్యే వరకు హోలోగ్రామ్ ప్రదర్శిస్తారు. “నేతాజీ బోస్ విగ్రహం పూర్తయ్యే వరకు, హోలోగ్రామ్ విగ్రహాన్ని అదే స్థలంలో ఏర్పాటుచేస్తాం. నేతాజీ జయంతి(జనవరి 23)న హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తాను’’ అని ప్రధాని మరో ట్వీట్‌లో రాశారు.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి నివాళి
నేతాజీని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్మరించుకున్నారు. స్వతంత్ర భారత్ సాధన దిశగా బోస్ సాహసోపేత అడుగులు వేశారన్నారు. బోస్‌ను ‘నేషనల్ ఐకాన్’గా నిలిపాయని, ఆయన ఆశయాలు, త్యాగాలు దేశవాసులకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయని రాష్ట్రపతి అన్నారు. గొప్ప జాతీయవాది నేతాజీ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీర్తించారు. ఏ దేశమైనా తన పౌరుల కృషి, పరాక్రమంతోనే బలంగా తయారవుతుందన్నారు.
Also Read: మీలో ఎంతమందికి తెలుసు నేతాజీ ఒక ఐఏఎస్ ఉద్యోగి అని? ఉద్యమం కోసం ఉద్యోగాన్ని వదిలేసిన మహానేత
హోలో గ్రామ్ విగ్రహం ప్రత్యేకతలు
ఓ పత్రిక ప్రకటనలో నేతాజీ విగ్రహం ప్రత్యేకతలను కేంద్రం వివరించింది. “హోలోగ్రామ్ విగ్రహం 30,000 ల్యూమెన్స్ 4K ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శిస్తారు. 90% పారదర్శకమైన హోలోగ్రాఫిక్ స్క్రీన్ సందర్శకులకు కనిపించని విధంగా ఏర్పాటు చేస్తారు. హోలోగ్రామ్ ప్రభావాన్ని సృష్టించడానికి నేతాజీ 3D చిత్రం దానిపై ప్రదర్శిస్తారు. హోలోగ్రామ్ విగ్రహం పరిమాణం 28 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ విగ్రహం ఆవిష్కరణ తర్వాత 2019, 2020, 2021, 2022 సంవత్సరాలకు సుభాస్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారాలను ప్రధానమంత్రి ప్రదానం చేస్తారు. ఈ అవార్డు విపత్తు నిర్వహణలో వ్యక్తులు, సంస్థలు చేసిన సేవలను గుర్తించి వారికి ప్రదానం చేస్తారు. ఈ అవార్డులో సంస్థలకు రూ.51 లక్షల నగదు బహుమతి, సర్టిఫికేట్ అందజేస్తారు. వ్యక్తులకు రూ.5 లక్షల నగదు బహుమతి, సర్టిఫికేట్ అందజేస్తారు.
Also Read: దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన యోధుడు నేతాజీ.. 125వ జయంతి సందర్భంగా నేతల ఘన నివాళి