పీఆర్సీ జీవోలపై ఉద్యోగులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయితే మరోవైపు పీఆర్సీ సాధన సమితి నేతలతో చర్చలకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని ఫోన్‌ చేశారు. సంప్రదింపులకు వచ్చే విషయంపై మాట్లాడారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు విజయవాడ రెవెన్యూ భవన్‌లో సమావేశమయ్యారు. రేపు సీఎస్‌కు ఇవ్వాలనుకున్న సమ్మె నోటీసు, ఉద్యమ కార్యాచరణతోపాటు మరికొన్ని ఇతర అంశాలపై మాట్లాడినట్టు తెలుస్తోంది.


అయితే రెవెన్యూ భవన్ లో సమావేశమైన సమయంలోనే.. ఉద్యోగ సంఘాల నేతలకు ఫోన్ వచ్చింది.  సమ్మె నోటీసుపై ఆలోచించాలని మంత్రులు బొత్స సత్యానారయణ, పేర్ని నాని ఉద్యోగ సంఘాల నేతలను కోరారు. సమ్మె నోటీసు ఇవ్వద్దని చెప్పారు. సంప్రదింపులు చేసి.. సమస్య పరిష్కారం కోసం కృషి చేద్దామని పేర్కొన్నారు. మంత్రుల ప్రతిపాదనను ఉద్యోగ సంఘాల నేతలు తిరస్కరించారు. జీవోలను రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని మంత్రులకు స్పష్టం చేశారు.


జీవో విడుదల


పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని ఉద్యోగులు సమ్మెకు సమాయత్తమవుతున్నాయి. అయితే మరోవైపు ఏపీ సర్కార్ కొత్త పే స్కేళ్లతో జీతాలు చెల్లించేలా మరోసారి ఉత్తర్వులు విడుదల చేసింది. 11వ పీఆర్సీ ప్రకారమే కొత్త పే స్కేళ్లతో జనవరి నెల జీతాలు చెల్లించేందుకు బిల్లులు తయారు చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. కొత్త వేతనాలను చెల్లించేలా చూడాలని డ్రాయింగ్ డిస్బర్స్‌మెంట్ ట్రెజరీ, సీఎఫ్ఎంఎస్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యోగుల సర్వీస్‌ రిజిస్టర్‌ను అనుసరించి 2018 జులై 1 నుంచి 2021 డిసెంబర్ 31 వరకు లెక్కగట్టి కొత్త పీఆర్సీ మేరకు సాఫ్ట్‌వేర్ మాడ్యూల్‌లో బిల్లులు అప్ లోడ్ చేయాలని సూచించింది.  ఈ నెల 25 లోగా ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించింది. డీడీఓలకు కొత్త పే రోల్స్ అందుబాటులో ఉంచాలని తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. 


జీతాల్లో కోత తప్పవా..


కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులు డబ్బులు భవిష్యత్తులో తిరిగి చెల్లించాల్సి పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగుల జీతాల్లో రూ.లక్షకు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. సూపరింటెండెంట్‌ కేడర్‌ ఉద్యోగులు రూ.70 వేలకు పైగా బకాయిపడే అవకాశం ఉంది. ఉపాధ్యాయులు రూ.80 వేలకు పైగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వీరి నుంచి భవిష్యత్తులో ఇచ్చే డీఏ లో ఆ మొత్తాలను వసూలు చేసుకుంటామని సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. హెచ్‌ఆర్‌ఏలో మార్పు లేని ఉద్యోగులు మాత్రం అదనంగా ప్రభుత్వం నుంచి కొంత మొత్తం పొందుతారు.