పీఆర్సీ జీవోలపై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ ఐకాస అధ్యక్షుడు కెవీ కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేశారు. సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడంపై పిటిషన్ లో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం, ఆర్థిక, రెవెన్యూ ముఖ్యకార్యదర్శులు, కేంద్ర ప్రభుత్వం, పే రివిజన్ కమిషన్ ను ప్రతివాదులుగా చేర్చారు. హైకోర్టు వచ్చే సోమవారం.. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది.


కమిటీ వేసినట్టు ప్రకటన


పీఆర్సీని వ్యతిరేకిస్తున్న ఏపీ ఉద్యోగులకు నచ్చజెప్పేందుకు, ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని వివరించి చెప్పేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ , ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ సహా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సభ్యులుగా ఉన్నారు . సమ్మెకు సై అంటున్న ఉద్యోగులతో చర్చించడంతోపాటు వారిని కొత్త పీఆర్సీకి ఒప్పించడం వీరి లక్ష్యం . 


కమిటీ వేశారన్న సమాచారం లేదు: మంత్రి పేర్ని నాని


కేబినెట్ మీటింగ్ వివరాలను తెలపడానికి వచ్చిన మంత్రి పేర్ని నానిని ఈ కమిటీ పై వివరాలు అడుగ‌్గా తనకు దీనిపై ఎలాంటి సమాచారం లేదని చెప్పడం ఆశ్చర్యపరిచింది. అలాగే ఫిబ్రవరి 7 నుంచి ఉద్యోగులు సమ్మెకు దిగుతున్న విషయమూ తన దృష్టికి ఇంకా రాలేదని ఆయన అన్నారు. ఇక ఉద్యోగుల నిరసనపై మాట్లాడుతూ ప్రభుత్వాన్ని లేదా ముఖ్యమంత్రిని తిడితే ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న ఇంటి అద్దె భత్యం పెరుగుతుందా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగులు సామరస్య పూర్వకంగా వ్యవహరించాలని, న్యాయంగా పోరాడితేనే ఫలితం వస్తుందని హితవు పలికారు. ఉద్యోగులు రోడ్డెక్కకూడదని ప్రభుత్వం కోరుకుంటుందని మంత్రి పేర్ని నాని న్నారు . 


 ఏదో కమిటీ వేసారని తెలుసు :ఉద్యోగ సంఘాలు





కొత్తగా పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడ్డ నాలుగు ప్రధాన ఉద్యోగసంఘాల నేతలు కూడా ఈ కమిటీపై పెద్దగా ఆసక్తి లేనట్టు మాట్లాడారు . ప్రభుత్వం తమకు పీఆర్సీపై నచ్చజెప్పేందుకు ఏదో కమిటీ వేసిందని విన్నామని వారన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం మొండిగా ఉందన్న పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాస్.. జీవోలను రద్దు చేశాకే చర్చలకు వెళతామని స్పష్టం చేశారు. 




ఆదిలోనే అనుమానాలు


11వ  పీఆర్సీ జీవోలపై అటు ప్రభుత్వం..ఇటు ఉద్యోగ నాయకులూ పట్టుదలగా ఉండడంతో ఈ కమిటీ ద్వారా సహేతుకమైన నిర్ణయం వస్తుందా అన్న అనుమానాలు మొదలవుతున్నాయి. ఈ జీవోలు రద్దు చేశాకే చర్చ అని ఉద్యోగులూ, అటు కాస్త హెచ్చరికలతోనే నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్న మంత్రుల మాటలతో ఈ పంచాయితీ క్షణానికో మలుపు తిరుగుతోంది.


Also Read: ఏపీ సర్కార్‌కు మరో ఝలక్.. ఇక ఆ ఉద్యోగులు కూడా రంగంలోకి.. ఈ నెల జీతాలు రానట్లే..!


Also Read: ఫిబ్రవరి 7 లేదా 8 నుంచి నిరవధిక సమ్మె.. ఏపీ ఉద్యోగ సంఘాల నిర్ణయం !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి