తెలంగాణలో కరోనా వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం భారతినగర్‌లో జరిగిన ఫీవర్ సర్వేను ఆయన పరిశీలించారు. ఇక్కడ హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ... కరోనా సోకిన వారి కోసం రాష్ట్రంలో 56 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులుగా ఫీవర్ సర్వే చేపట్టామన్నారు. రెండు రోజుల్లో 29 లక్షల 20 వేల కుటుంబాలను సర్వే చేసి కరోనా లక్షణాలు ఉన్న లక్ష మందికి కిట్లు అందజేశామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. కరోనా విషయంలో ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దన్నారు. గర్భిణీలకు కూడా ఆసుపత్రుల్లో ప్రత్యేక వసతులు అందుబాటులో ఉంచామని తెలిపారు. చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతున్నాయని చెప్పారు. హోమ్ ఐసోలేషన్ కిట్లు వాడి జాగ్రత్తలు తీసుకుంటే రాష్ట్రంలోనూ కోవిడ్‌ వ్యాప్తి తగ్గుతుందని మంత్రి అన్నారు. మరో నాలుగు రోజుల్లో ఫీవర్ సర్వే పూర్తి చేస్తామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఫీవర్ సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. 






Also Read:  భారత్‌లో ఒమిక్రాన్ వ్యాప్తి ఏ దశలో ఉందో తెలుసా.. ఇన్సాకాగ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు


ఒమిక్రాన్ వ్యాప్తి ఏ దశలో ఉందంటే...


దేశంలో గత నాలుగు రోజులుగా 3 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. కరోనా మరణాలు సైతం భారీగా నమోదు కావడంతో ప్రజలు వైరస్ విషయంలో మరోసారి భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్ సామూహిక వ్యాప్తి (Community Transmission Stage) దశలో ఉంది. ఈ విషయాన్ని భారత SARS-CoV-2 కన్సార్టియం ఆన్ జెనోమిక్స్ లేదా ఇండియన్ SARS-CoV-2 జెనెటిక్స్ కన్సార్టియం (INSACOG) తన తాజా బులెటిన్‌లో తెలిపిందని పీటీఐ రిపోర్ట్ చేసింది.


ఇన్సాకాగ్ అనేది భారతదేశంలో కొవిడ్19 వ్యాప్తి, వైరస్ సంబంధిత వైవిధ్యాన్ని అధ్యయనం చేయడానికి, పర్యవేక్షించడానికి కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కింద ఏర్పాటు అయిన ఓ సంస్థ. ఈ ఇన్సాకాగ్ తాజా బులెటిన్ ప్రకారం.. కరోనా వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో పలు మెట్రో నగరాలలో వ్యాపించడంతో పాటు తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన BA.2 త్వరగా వ్యాప్తి చెందుతుంది. దీనిని 'స్టెల్త్ ఓమిక్రాన్' (stealth Omicron) అని పిలుస్తున్నారు. ముఖ్యంగా భారత్‌లో 530 ఈ వేరియంట్ కేసులు నమోదైనట్లు యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. 


జనవరి 10 బులెటిన్‌ను ఆదివారం విడుదల చేయగా.. కొవిడ్ బారిన పడుతున్న వారిలో ఆసుపత్రిలో చేరికలు ఎక్కువయ్యాయని, ఐసీయూ కేసులు సైతం గణనీయంగా పెరిగాయని ఇన్సాకాగ్ తెలిపింది. భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ సామూహిక వ్యాప్తి దశలో ఉందని, తద్వారా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతాయని పీటీఐ రిపోర్ట్ చేసింది. కొత్త మ్యూటేషన్లు ఈ లక్షణాలు ఉండే అవకాశం లేదని, అయితే వీటి ద్వారా కొత్త రకం వేరియంట్లు పుట్టుకొస్తాయని రిపోర్టులో స్పష్టం చేశారు. ఒమిక్రాన్ తరహాలో మ్యూటేషన్లు ఇందులో ఎక్కువ లేవు. యూకేతో పాటు  డెన్మార్క్, ఇండియా, స్వీడన్ మరియు సింగపూర్‌లో ఈ కేసులు విస్తరిస్తున్నాయని ఇదివరకే రిపోర్టులు వచ్చాయి. భారత్‌లోనూ 500కు పైగా  BA.2 కేసులు నమోదైనట్లు వెల్లడి కావడంతో వైద్య శాఖ అలర్ట్ అయింది.


Also Read: కరోనాలాంటి వైరస్‌లను అంతం చేయలేం... పర్యావరణంలో భాగంగా కలిసిపోవడమే వాటి ముగింపు, WHO కీలక వ్యాఖ్యలు