అంతమే లేని మహమ్మారిలా మారిపోతోంది కరోనా వైరస్. కొత్త వేరియంట్లతో పాటూ, కొత్త లక్షణాలతో తనను తాను అప్ గ్రేడ్ చేసుకుంటూ మానవాళిపై కమ్ముతోంది. ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే దేశం అల్లకల్లోలాన్ని సృష్టిస్తోంది. డెల్టా, ఒమిక్రాన్ కేసులు రోజూ భారీగా బయటపడుతున్నాయి. ఒమిక్రాన్ చాలా తక్కువ కాలంలోనే వేగంగా వ్యాప్తి చెందుతూ భయాందోళనలకు గురిచేస్తోంది. ఇతర కరోనా వేరియంట్ల లాగే దీని లక్షణాలు రుచి, వాసన కోల్పోవడం, జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి, విరేచనాలు అని మాత్రమే ఇంతవరకు తెలుసు. ఇప్పుడు మరో కొత్త లక్షణం బయటపడింది. ఈ వైరస్ ప్రభావం చెవిలోపలి భాగంపై కూడా పడుతుందని, అది చెవి నొప్పి రూపంలో బయటపడుతుందని కొత్త పరిశోధనలో తేలింది. స్టాన్ ఫోర్ట్ యూనివర్సిటీలో జరిగిన పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది.
ఇలా తెలిసింది...
కోవిడ్ పాజిటివ్ రోగుల్లో అంతర్గత చెవి వ్యవస్థ ఎలాంటి ప్రభావాలకు లోనవుతుందో తెలుసుకోవడానికి స్టాన్ ఫోర్ట్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. రోగులు చెవి నొప్పి, చెవి లోపల జలదరింపులు (టింగ్లింగ్) వంటివి వస్తున్నాయని చెప్పారు. ఇంతవరకు ఇలాంటి లక్షణాలు కరోనా వైరస్ తో సంబంధాన్ని కలిగి ఉన్నాయని ఎవరూ కనిపెట్టలేదు. దీంతో చెవినొప్పి, చెవిలో రింగింగ్, విజిల్ శబ్ధాలు, చెవిలో షేక్ అవుతున్నట్టు వంటివి అనిపించినా కరోనా వైరస్ సోకిందనడానికి సంకేతం కావచ్చని చెబుతున్నారు పరిశోధకులు. ఇందులో అధ్వాన్నమైన విషయం ఏమిటంటే రెండు డోసుల టీకాలు వేసుకున్నవారిలో కూడా ఈ లక్షణం కనిపిస్తోంది.
ఒమిక్రాన్ ముఖ్య లక్షణాలు
1. చలి
2. గొంతులో దురత
3. ఒళ్లు నొప్పులు
4. నీరసం
5. వాంతులు
6. రాత్రిళ్లు చెమటలు పట్టడం
7. జ్వరం
8. దగ్గు
9. జలుబు
10. అలసట
11. తలనొప్పి
పైనున్న లక్షణాలు కొన్నింటితో పాటూ వినికిడి సమస్య, చెవి నొప్పి వంటివి కనిపిస్తే కరోనా టెస్టు చేయించుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. పట్టించుకోకుండా వదిలేస్తే చెవిలో చేరిన ఇన్ఫెక్షన్ వల్ల శాశ్వత వినికిడి లోపం సంభవించవచ్చు.
Also Read: భారత్‌లో ఒమిక్రాన్ వ్యాప్తి ఏ దశలో ఉందో తెలుసా.. ఇన్సాకాగ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు
Also Read: కరోనాలాంటి వైరస్‌లను అంతం చేయలేం... పర్యావరణంలో భాగంగా కలిసిపోవడమే వాటి ముగింపు, WHO కీలక వ్యాఖ్యలు