ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగులు కూడా పోరు బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ఇతర ఉద్యోగులతో పాటు సమ్మెలోకి వెళ్తామని ప్రకటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని పట్టుబడి పోరాడి సాధించుకున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. అలాంటిది ఇప్పుడు వారికి వచ్చిన కష్టం ఏమిటి..? వారు కూడా ఏం కోరుతున్నారు..? ఎందుకు సమ్మెకు వెళ్తామంటున్నారు..?
Also Read: నేడు సమ్మె నోటీసు ఇవ్వనున్న ఉద్యోగ సంఘాలు... పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని ప్రకటన
కార్పొరేషన్ ఉద్యోగులుగా ఉన్న సౌకర్యాలు మాయం !
ఏపీఎస్ఆర్టీసీ కింద గతంలో ఉద్యోగులు ఉండేవారు. ఇది ప్రత్యేకమైన కార్పొరేషన్. ఆర్టీసీ ఉద్యోగులందర్నీ ప్రభుత్వంలో విలీనం చేశారు. పీటీడీ ఉద్యోగులుగా మార్చేశారు దీంతో కార్పొరేషన్ ఉద్యోగులుగా ఉన్నప్పుడు ఉన్న మెడికల్ సౌకర్యం స్థానంలో ఇ.హెచ్.ఎస్. కిందకు వచ్చారు. ఇప్పుడు వారికి వైద్యం గతంలోలా సరళంగా అందడం లేదు. గతంలో ఆర్టీసీ ఉద్యోగులు తక్కువ.. కార్మికులు ఎక్కువ. ఉదాహరణకు డ్రైవర్, కండెక్టర్, మెకానికల్ కాటగిరీ ఉద్యోగులకు కార్మిక చట్టల ప్రకారం పని గంటలు ఉండేవి. కానీ ఉద్యోగులుగా మారిన తర్వాత ట్రేడ్ యూనియన్ హక్కులను వర్తించడం లేదు. విలీనం కాకముందు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను ఇవ్వాల్సి ఉందని.. వాటిని ఇవ్వలేదని అంటున్నారు. ఆర్టీసి ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న స్టాఫ్ రిటైర్‌మెంట్ బెన్‌ఫిట్ స్కీమ్ ను రద్దు చేశారు.
కొత్త ఉద్యోగ నియామకాలు నిలిపివేత !
ఆర్టీసీ ఎక్కువగా మ్యాన్ పవర్ మీద ఆధారపడుతుంది. అయితే ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఉద్యోగాల నియామకం ఊసే లేదు. ప్రస్తుతానికి ఆర్టీసీలో 10వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉద్యోగ సంఘం నేతలు చెబుతున్నారు. తాత్కాలికంగా బండి నడిపించడానికి ఔట్ సోర్సింగ్ పద్దతిని ఎంచుకుంటున్నారు. అలాగే సర్వీసులో చనిపోయిన వారికి ఇచ్చే ఇన్సూరెన్స్ పథకాల ప్రీమియమ్‌లు అన్నీ ఉద్యోగుల వేతనాల నుండే రికవరీ చేస్తున్నారు. ఈ కాలంలో ఉద్యోగులకు వివిధ రకాల రికవరీలు పెరిగాయి. ఇలా వివిధ కారణాలతో విలీనంతో ష్టపోయామన్న భావనకు ఆర్టీసీ ఉద్యోగులు వస్తున్నారు.
ఆర్టీసి ఉద్యోగులకు 1.6 శాతం ఫిట్‌మెంట్ మాత్రమే సిఫార్సు చేశారు. విలీనంతో ప్రభుత్వ ఫించను వస్తుందని ఆశించిన ఆర్టీసి ఉద్యోగులకు సీపీఎస్ లేదా పీఎఫ్ పించన్ ఆప్షన్ ఇచ్చారు. ప్రభుత్వం బయట పెట్టని అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికలో ఆర్టీసి ఉద్యోగులకు మెరుగైన ఫిట్‌మెంట్ సిఫారసు చేసినట్లుగా చెబుతున్నారు. విలీనం వల్ల నష్టపోతున్న ప్రయోజనాలు.. పీఆర్సీ వల్ల కోల్పోతున్న ప్రయోజనాలు భర్తీ చేయాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే అన్ని సంక్షేమ అంశాలను పి.టి.డి.ఉద్యోగులకు అమలు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నారు . ఈ డిమాండ్లతో వారూ సమ్మెకి సై అంటున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి