ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి హమీష్ గ్రిఫిన్. ఇతనికి భార్య, కొడుకు ఉన్నారు. ఉన్న ఊరిలో ఉద్యోగం దొరక్క 3,200 కిలోమీటర్లు కుటుంబంతో ప్రయాణం చేసి టాస్మానియాకు చేరుకున్నాడు. ఒక హాలిడే రిసార్ట్ సంస్థలో కొత్త ఉద్యోగం వచ్చింది. ఇంటర్య్వూ ప్రాసెస్ అంతా ఆన్ లైన్లో జరిగింది. ఆఫర్ లెటర్ మెయిల్ వచ్చాక టాస్మానియాకు వచ్చేశాడు హమీష్. మొదటి రోజు జాబ్‌లో చేరాక ఓ రెండు గంటలు పనిచేశాడు. ఈ లోపే అతడిని ఉద్యోగంలోంచి తీసేస్తున్నట్టు చెప్పారు కంపెనీవారు. షాక్ తిన్న హమీష్ ఎందుకో చెప్పమని ప్రశ్నించాడు. దానికి సంస్థ యజమానులు ఇచ్చిన సమాధానం విని దిమ్మదిరిగింది. ‘నువ్వు మరీ లావుగా ఉన్నావు. పనులు చేయలేవేమో అనిపిస్తోంది. ఆ సోఫాను జరుపమన్నా కూడా నువ్వు చేయలేవేమో’అని చెప్పారు వాళ్లు.  వారు చెప్పిన సమాధానం విని చాలా బాధ పడ్డాడు. తన ఆవేదనను ఫేస్‌బుక్ లో పంచుకున్నాడు. ఆ పోస్టు వైరల్ గా మారిపోయింది. 


ఆ పోస్టులో ‘నేను పనిచేయగలనని నిరూపించుకోవడానికి నాకు అవకాశం ఇవ్వలేదు. కానీ నేను పనులు చేయలేనని, నిచ్చెన ఎక్కలేనని, లాన్ మూవర్‌ను నెట్టలేనని, లావుగా ఉన్నానని మాత్రం వారే నిర్ణయించేశారు. పని చేసేటప్పుడు నాకు గాయాలు కావచ్చేమో అని నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నామని చెప్పారు. నేను వారితో ఏకీభవించలేను. ఎందుకంటే నేను క్వీన్స్ ల్యాండ్లోని పార్క్‌కు మేనేజర్‌గా ఎనిమిదేళ్లు పనిచేశాను ’ అని రాసుకొచ్చాడు. అలాగే తన కుటుంబ పరిస్థితిని వివరించాడు. ‘నాకన్నా చాలా అధ్వానమైన ఆర్ధికస్థితిలో చాలా మంది ఉన్నారని నాకు తెలుసు, కానీ మేము ఇప్పుడు నిరాశ్రయులం అయ్యాము. నాకు స్కూలుకెళ్లి చదువుకునే చిన్న పిల్లాడు ఉన్నాడు. వాడిని నేను ఈ ఏడాది స్కూలుకి పంపలేను.  ఈ ఉద్యోగాన్ని నేను ఒక చెడ్డ కలగా భావిస్తున్నాను. నిజానికి ఇది చాలా బాధపెట్టిన సంఘటన’ అని వివరించారు.  ఊబకాయాన్ని ఒక అనారోగ్య మెడికల్ కండిషన్‌గా చూపించడాన్ని అతడు ఖండించాడు. 


అయితే ఈ అంశంపై కోర్టుకెళ్లాడు హమీష్. అతని తరుపు లాయర్లు మాట్లాడుతూ అనారోగ్యానికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేకుండా... ఆరోగ్యకారణాలతో తొలగిస్తున్నామని చెప్పడం వివక్ష కిందకే వస్తుందని అన్నారు.  హమీష్ పోరాటం విజయం సాధిస్తుందో లేదో చూడాలి. కొత్త ఉద్యోగం కోసం టాస్మానియ వచ్చే ముందు క్వీన్స్ ల్యాండ్ లోని తన ఇంటిని కూడా అమ్మేశాడు. ఇది ఇంకా బాధిస్తున్న విషయమని అంటున్నారు హమీష్. 


Also read: ఆ తెగలో పుట్టిన ఆడపిల్లలు అదృష్టవంతులు... పెళ్లయ్యాక కూడా పుట్టిల్లే, అల్లుడే ఇల్లరికం వస్తాడు


Also read: మీ ఇంటి ఆడపిల్ల ఏదైనా సాధించగలదు... అవకాశం ఇచ్చి చూడండి, పెళ్లి చేసి పంపేయకండి