గణతంత్ర దినోత్సవరం రోజున తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. దీనికి కారణం రాజ్‌భవన్‌లోజరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు సీఎ కేసీఆర్ హాజరు కాకపోవడమే. ఉద్దేశపూర్వకంగానే రాజ్ భవన్ కు సీఎం కేసీఆర్ వెళ్ళలేదని.. ఇది గవర్నర్ ను అవమానించటమేనని ఈటల రాజేందర్ మండిపడ్డారు. గవర్నర్ ఎవరైనా ఉండొచ్చునని.. గవర్నర్ కుర్చీకి గౌవరం ఇవ్వాలన్నారు. రాజ్ భవన్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొనకుండా  సంప్రదాయాలను కేసీఆర్ తుంగలో తొక్కారని..  తాను హాజరుకాకుంటే సీనియర్ మంత్రినైనా రాజ్ భవన్ కు పంపించి ఉండాల్సిందన్నారు.


స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కేంద్రంపై విమర్శలు చేయడాన్ని ఈటల ఖండించారు. పోచారం స్పీకర్ కుర్చీకే మచ్చ తెచ్చే విధంగా ఈ రోజు మాట్లాడుతున్నారని...స్పీకర్ హదాలో కేంద్రంపై విమర్శలు వన్నెను తీసుకరావన్నారు. స్పీకర్ హోదాలో మాట్లాడకూడని మాటలు పోచారం మాట్లాడుతున్నారని... అలా చేయడం రాజ్యాంగం పై విషం కక్కడమేనని మండిపడ్డారు. పోచారం మాటలను చూస్తే సీఎం కావాలనే రాజ్ భవన్ కీ వెళ్లలేదనేది స్పష్టం అవుతుందోన్నారు. కేంద్రంపై విమర్శలు చేయాలనుకుంటే స్పీకర్ కుర్చీకి రాజీనామా చేసి చేయాలనిసూచించారు. 


ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఫెడరల్ స్ఫూర్తికే విఘాతమని.... సీఎంకి శోభ నివ్వదన్నారు.  తెలంగాణలో బీజేపీ నేతలపై జరుగుతున్న దాడులను ఈటల ఖండించారు. ప్రజాస్వామ్య వాదులు బాధ పడే సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి...ఇలాంటివి జరగడం రాష్ట్ర ప్రజలకు క్షేమం కాదన్నారు.  సీఎం మాటలతో ప్రజలను ఒప్పించే సత్తా కోల్పోయాడు కాబట్టే దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. శాంతి భద్రతలు కాపాడటంలో తెలంగాణ ప్రభుత్వ పెద్దలు విఫలమయిందని..  ప్రజాప్రతినిధులకే రక్షణ లేకుంటే ప్రజల ప్రజల పరిస్థితి ఏంటని ఈటల ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వానికి అంతిమ ఘడియలకు దగ్గర పడ్డాయని.. బెంగాల్ కాదు.. ఇది తెలంగాణ అని టీఆర్ఎస్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. 


రాజ్‌భవన్‌లో జరిగే గణతంత్ర వేడుకల్లో  ముఖ్యమంత్రి పాల్గొనడం సంప్రదాయంగా వస్తోంది. గతంలో  గవర్నర్‌గా నరసింహన్ ఉన్నప్పుడు కేసీఆర్ ఖచ్చితంగా వెళ్లేవారు. అయితే కేసీఆర్‌కు ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సారి వెళ్లలేదని భావిస్తున్నారు.. అయితే వెళ్లకపోవడం గవర్నర్‌ను అవమానించడం ఏమీ కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది. గవర్నర్ పట్ల తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ వ్యతిరేక ప్రకటనలు చేయలేదని కొంత మంది గుర్తు చేస్తున్నారు. టీఆర్ఎస్ వర్గాలు కూడా రాజ్‌భవన్‌కు సీఎం వెళ్లకపోవడం ఈటల చెప్పినంత సీరియస్ ఇష్యూ కాదని.. రాజకీయాల కోసమే విమర్శలు చేస్తున్నారని అంటున్నారు.