రిపబ్లిక్ డే సందర్భంగా చాలా మంది చాలా రకాలుగా స్వాతంత్ర సమర యోధులకు నివాళులర్పించారు. కానీ నెల్లూరు జిల్లాకు చెందిన ఉజ్వల ఖ్యాతి అనే అమ్మాయి మాత్రం వినూత్న రీతిలో నివాళులర్పించింది. అరుదైన రికార్డు కోసం ప్రయత్నించింది. సాధారణంగా ఒక్కొక్కరిలో ఒక్కో కళ దాగి ఉంటుంది. చిన్ననాటి నుంచే పెయింటింగ్స్, చిత్రాలపై ఆసక్తి చూపిన యువతి ఉజ్వల మాత్రం వినూత్నంగా రావి ఆకులపై తన కళను ప్రదర్శించింది. తన ప్రయత్నానికి ఫలితంగా ఆకులపైనే అద్భుతమైన రీతిలో నాయకుల ఫోటోలను రూపొందించింది.


73 మంది స్వాతంత్ర సమరయోధుల చిత్రాలను 73 రావి ఆకులపై చిత్రీకరించిన ఉజ్వల ఖ్యాతి.. వాటన్నిటినీ భారత దేశ చిత్ర పటం ఆకారంలో అమర్చింది. ఒక్కో చిత్రానికి 7 నిముషాల సమయం పట్టింది. మొత్తంగా 9 గంటల సేపు కష్టపడి ఈ చిత్రాలను గీసింది. నెల్లూరు నగరంలోని దర్గా మిట్టకు చెందిన ఉజ్వల ఖ్యాతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని. స్వతహాగా చిత్ర లేఖనంపై ఆమెకు ఆసక్తి ఎక్కువ. నెల్లూరులోని అమీర్ ఆర్ట్ అకాడమీలో ఆమె శిక్ష కూడా తీసుకుంటోంది. ఈ క్రమంలో రిపబ్లిక్ డే సందర్భంగా ఇలాంటి వినూత్న ప్రయత్నం చేపట్టింది. ఈ ప్రయత్నం స్థానికులనే కాక.. చూసిన వారందర్నీ అమితంగా ఆశ్చర్య చకితుల్ని చేస్తోంది.


యాక్రిలిక్ కలర్స్, ప్రత్యేక బ్రష్ లు ఉపయోగించి ఇలా రావి ఆకులపై నాయకుల చిత్రాలు గీసింది ఉజ్వల ఖ్యాతి. ఈ ఫీట్ ద్వారా ప్రపంచ రికార్డు సాధించేందుకు ఆమె ప్రయత్నాలు మొదలు పెట్టింది. భవిష్యత్తులో మరిన్ని వినూత్న ప్రయోగాలు చేస్తానని చెప్పింది. మైక్రో ఆర్ట్ వంటి కళలు తనకు ఇష్టమని ఈ యువతి చెబుతోంది. ఉజ్వల ఖ్యాతి తల్లి మాట్లాడుతూ.. ఆమె రెండో తరగతిలో ఉన్నప్పుడే చిత్ర లేఖనంపై ఆసక్తి ఉందని గుర్తించినట్లుగా చెప్పారు. గత ఐదేళ్ల నుంచి ఉజ్వల ఎంతో ఓపిగ్గా చిత్ర లేఖనం నేర్చుకుందని తెలిపారు. తనకు తమ వైపు నుంచే కాక, తన గురువు నుంచి కూడా ఎంతో సహకారం అందిందని ఉజ్వల తల్లి చెంచులక్ష్మి తెలిపారు.


‘‘నేను గత ఐదేళ్లుగా డ్రాయింగ్ నేర్చుకుంటున్నాను. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 73 రావి ఆకులపై 73 స్వాతంత్ర్య సమరయోధుల బొమ్మలు వేశాను. మొత్తం చిత్రాలు వేయడానికి 9 గంటల సమయం పట్టింది. నాకు కాన్వాస్ పెయింటింగ్ కూడా వచ్చు’’ అని ఉజ్వల తెలిపారు.


Also Read: హ్యాపీ రిపబ్లిక్ డే.. దేశభక్తిని రగిలించే ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు తెలపండిలా..


Also Read: Happy Republic Day 2022: భారత రాజ్యాంగం గురించి ఈ 12 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..