రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకి ఆన్ లైన్ లో మంత్రి మండలి ఆమోదం తెలపడం, ఆ తర్వాత ముసాయిదా నోటిఫికేషన్లు విడుదల కావడం తెలిసిందే. ఈ క్రమంలో ఎప్పటినుంచో ఉన్న ఈ ప్రతిపాదనలు ఇప్పుడు పట్టాలెక్కాయని అర్థమవుతోంది. ఉగాదిలోగా కొత్త జిల్లాల ప్రక్రియ పూర్తవుతుందని క్లారిటీ వచ్చింది. ఒక్కో లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తున్న ఈ క్రమంలో అసలు నెల్లూరు జిల్లా ఎన్ని జిల్లాలు అవుతుంది, ఎవరెవరికి ఏయే ఉపయోగాలుంటాయనేది ఓసారి చూద్దాం. 




నెల్లూరు జిల్లాకు విశాలమైన సముద్ర తీరం, సోమశిల ప్రాజెక్ట్, కృష్ణపట్నం పోర్ట్.. ఇలా చాలా ప్రత్యేకతలున్నాయి. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం కూడా జిల్లా పరిధిలోనే ఉంటుంది. అయితే ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడితే.. నెల్లూరు జిల్లా పరిధిలో ఏమేముంటాయి, కొత్తగా ఏర్పడే తిరుపతి లోక్ సభ నియోజకవర్గ జిల్లాలో ఏముంటాయనేది ముసాయిదాలో ఉంది. 




మూడు రెవెన్యూ డివిజన్లు.. 35 మండలాలతో నెల్లూరుని జిల్లా కేంద్రంగా ఉంచుతూ శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాని ఏర్పాటు చేస్తారు. కొత్తగా ఏర్పాటయ్యే నెల్లూరు జిల్లాలో నెల్లూరు, ఆత్మకూరు, కావలి రెవెన్యూ డివిజన్లు కొనసాగుతాయి. అదే సమయంలో ప్రకాశం జిల్లా కందుకూరు రెవెన్యూ డివిజన్‌ లోని మండలాలను కావలి రెవెన్యూ డివిజన్‌ లో విలీనం చేయాలని ప్రతిపాదించారు. నెల్లూరు రెవెన్యూ డివిజన్‌లో కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా- ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌లో ప్రస్తుత మొత్తం ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని సీతారామపురం, ఉదయగిరి, వింజమూరు, వరికుంటపాడు, దుత్తలూరు మండలాలు కలుస్తాయి. కావలి డివిజన్‌లో కావలి, కందుకూరు, అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అన్ని ప్రాంతాలతో పాటు ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి, కావలి, కొండాపురం మండలాలు విలీనం అవుతాయి. 




ఇక నెల్లూరులోని మూడు నియోజకవర్గాలను తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఏర్పాటయ్యే జిల్లాలో కలుపుతారు. ఈ కొత్త జిల్లాకు బాలాజీ జిల్లా అని పేరు పెట్టబోతున్నారు. వాస్తవానికి సర్వేపల్లి నియోజకవర్గం కూడా బాలాజీ జిల్లాలోకే వెళ్లాల్సి ఉండగా.. భౌగోళిక అవసరాల దృష్ట్యా దాన్ని నెల్లూరులోనే కొనసాగిస్తారు. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుపతి కేంద్రంగా ఏర్పడే బాలాజీ జిల్లాలో కలుస్తాయి. ఇప్పటికే రెవెన్యూ డివిజన్లుగా ఉన్న నాయుడుపేట, గూడూరుకు కొన్ని మండలాలను కలిపి.. బాలాజీ జిల్లాలో కొనసాగిస్తారు. 


పోర్టులు నెల్లూరుకి, షార్ బాలాజీకి..
కొత్తగా జిల్లాలు విభజించిన తర్వాత.. కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులు నెల్లూరు జిల్లాలో ఉంటాయి. సోమశిల జలాశయం కూడా నెల్లూరులోనే ఉంటుంది. ఇక శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం, శ్రీసిటీ, మేనకూరు సెజ్ వంటివి బాలాజీ జిల్లాలోకి వెళ్లిపోతాయి. ఉపాధి అవకాశాలు నెల్లూరు జిల్లా వాసులకే ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. అయితే బాలాజీ జిల్లాలో కలిసే నెల్లూరు జిల్లా నియోజకవర్గాలకు కూడా తిరుపతి కేంద్రం అవుతుంది. ఆధ్యాత్మిక నగరి వారి సొంత జిల్లా అవుతుంది. ఒకరకంగా నెల్లూరు జిల్లా విడిపోయినా.. అన్ని నియోజకవర్గాలకు సమ ప్రాధాన్యం దక్కినట్టవుతుంది.