భారత క్రికెట్లో రవి బిష్ణోయ్ అద్భుతమైన శక్తిగా ఎదుగుతాడని టీమ్‌ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అంటున్నాడు. అతడో గొప్ప పోరాట యోధుడని పేర్కొన్నాడు. అతడిలో నిద్రాణంగా ఉన్న నైపుణ్యాలను తట్టిలేపాల్సిన అవసరం ఉందన్నాడు. ఎలాంటి బ్యాటర్‌నైనా అతడు బోల్తా కొట్టించగలడని వెల్లడించాడు.
మరికొన్ని రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం జరగనుంది. దాంతో ఐపీఎల్ కొత్త సీజన్ సన్నాహకాలు మొదలవుతాయి. ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్‌కు ఆడిన కేఎల్ రాహుల్ ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్‌కు చేరుకున్నాడు. రూ.17 కోట్లతో అతడిని సంజీవ్ గోయెంకా గ్రూప్ ఎంచుకుంది. అతడితో పాటు నిలకడగా రాణిస్తున్న ఆసీస్ ఓపెనర్ మార్కస్ స్టాయినిస్, యువ మిస్టరీ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను తీసుకుంది.
కొన్నేళ్లుగా కేఎల్ రాహుల్ నిలకడగా పరుగులు చేస్తున్నాడు. ప్రతి సీజన్లో 500 పరుగుల మైలురాయి దాటేస్తున్నాడు. ఇప్పుడు కొత్త ఫ్రాంచైజీ తరఫునా అతడలాగే చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు. గతేడాది వరకు పంజాబ్ కింగ్స్‌కు ఆడిన బిష్ణోయ్‌ను లక్నో తీసుకోవడం వెనక రాహుల్ హస్తం ఉందనే అనుకుంటున్నారు. ఎందుకంటే ఐపీఎల్‌లో 23 మ్యాచులాడిన బిష్ణోయ్ 24 వికెట్లు తీశాడు. ఎకానమీ కూడా చాలా పొదుపుగా ఉంది. తన లెగ్ స్పిన్‌తో ఎంతో మంది బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు.
'రవి బిష్ణోయ్‌లో ఎంతో పోరాటం ఉంది. అండర్-19 నుంచి వచ్చి ఐపీఎల్‌లో ఆడిన తొలి మ్యాచ్ నుంచే తన ముద్ర వేశాడు. ఐపీఎల్ ఎంతో పెద్ద వేదిక. అతడు మరింత మెరుగయ్యేందుకు ఇదే మంచి సందర్భం. అతనెప్పుడూ పోరాటంలో ఉండాలనుకుంటాడు. స్పిన్‌ను చక్కగా ఎదుర్కొనే రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌కు అతడు బౌలింగ్ చేశాడు. నేనతడికి బంతినిచ్చి.. ఇదెంతో కష్టమైన పని అంటుంటాను. అప్పడతను.. కాదు, ఇదేం పెద్ద మ్యాటర్ కాదు. వాళ్లను ఔట్ చేస్తానని బదులిస్తాడు' అని కేఎల్ రాహుల్ అన్నాడు.
'భారత్ క్రికెట్లో రవి బిష్ణోయ్ అతిపెద్ద శక్తిగా ఎదుగుతాడు. అతడిలోని అత్యుత్తమ నైపుణ్యాలు, శక్తి సామర్థ్యాలను వెలికితీయాల్సిన బాధ్యత మనపైనే ఉంది. అప్పుడే అతడు జాతీయ జట్టుకు ఆడగలడు. టీమ్‌ఇండియాలో అత్యంత కీలక స్పిన్నర్‌గా మారగలడు' అని రాహుల్ అన్నాడు.
Also Read: IND vs WI: విండీస్ సిరీసుకు ఈ వారమే జట్టు ఎంపిక! రోహిత్ ఫిట్‌నెస్ టెస్టు సంగతేంటి?