అనుకున్నామా ఇలా జరుగుతుందని..?
అనుకున్నామా ఈ తరంలో ఇలా జరుగుతుందని..?
అనుకున్నామా ఈ తరంలో మన గడ్డపైనే ఇలా జరుగుతుందని..?
అనుకున్నామా ఈ తరంలో మన గడ్డపై మనపైనే 10 వికెట్ల ఘనత అందుకుంటారని..?
అనుకున్నామా ఈ తరంలో మన గడ్డపై మనపైనే ఒకే ఇన్నింగ్స్‌లో భారత సంతతి స్పిన్నరే 10 వికెట్ల ఘనత అందుకుంటారని..?


అస్సలు అనుకోలేదు..!


జిమ్‌ లేకర్‌, అనిల్‌ కుంబ్లే వంటి దిగ్గజాలు ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీశారని విన్నప్పుడల్లా ఆశ్చర్యపోతుంటాం..! ఈ తరంలో ఎవరైనా అలా చేస్తే చూడాలని ఎంతగానో ఎదురుచూశాం..! అశ్విన్‌ వంటి స్పిన్నర్లు 7, 8 వికెట్లు తీసినప్పుడల్లా అరెరెరె..! ఆ రికార్డును మిస్సయ్యాడే అనుకుంటూ నిట్టూర్పు విడుస్తాం. అలాంటిది ఒక కివీస్‌ ఆటగాడు స్పిన్నర్లకు స్వర్గధామమైన భారత్‌లో పది వికెట్ల ఘనత అందుకోవడం అద్భుతం. ఇంకా చెప్పాలంటే అంతకు మించి..!


న్యూజిలాండ్‌ ఎడమచేతి వాటం స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ నిజానికి భారత సంతతి ఆటగాడు. విచిత్రంగా అతడు పుట్టింది ఇప్పుడు మ్యాచ్‌ జరుగుతున్న ముంబయి గడ్డపైనే. అలాంటిది అక్కడే అతడు టీమ్‌ఇండియాపై ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్ల ఘనత అందుకోవడం గమనార్హం. 1956 మొదటి సారి ఇంగ్లాండ్‌ ఆటగాడు జిమ్‌లేకర్‌ ఈ రికార్డు సృష్టించాడు. దాన్ని బద్దలు కొట్టే మొనగాడు రావడం అసాధ్యమే అనుకుంటే..! 1999లో టీమ్‌ఇండియా దిగ్గజం అనిల్‌ కుంబ్లే దానిని సమం చేశాడు. అదీ చిరకాల శత్రువు పాకిస్థాన్‌పై.


దాదాపుగా 22 సంవత్సరాలకు మళ్లీ కుంబ్లే రికార్డును సమం చేశాడు అజాజ్‌ పటేల్‌. ముంబయి టెస్టు తొలిరోజు శుభ్‌మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌ను ఔట్‌ చేశాడు. ఇక రెండోరోజు వరుసగా వృద్ధిమాన్‌ సాహా, రవిచంద్రన్‌ అశ్విన్‌, మాయాంక్‌ అగర్వాల్‌, అక్షర్‌ పటేల్‌, జయంత్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌ను పెవిలియన్‌ పంపించాడు.


తొమ్మిది వికెట్లు తీసిన తర్వాత అజాజ్‌ పటేల్‌ మనసు ఉద్వేగంతో నిండిపోయింది! మరొక్క వికెట్టు తీస్తే ఎంత బాగుండో అనుకున్నాడు! 110 ఓవర్లో బంతిని అందుకున్నాడు. ఆ సమయంలో అతడి బుర్రలో ఎన్నెన్నో ఆలోచనలు గిర్రున తిరిగాయి. నాలుగు బంతులు పడ్డాయి. ఐదో బంతిని అలా వేశాడో లేదో మహ్మాద్‌ సిరాజ్‌ బంతిని గాల్లోకి ఆడేశాడు. ఎత్తుకు ఎగిరిన బంతిని రచిన్‌ రవీంద్ర అద్భుతంగా అందుకున్నాడు. తన మిత్రుడికి అపూర్వమైన కానుకను అందించాడు.


కొస మెరుపు ఏంటంటే..! ఆడుతున్నది భారత్‌లో.. ఔట్‌ చేసింది భారత్‌ని.. రికార్డు సృష్టించిన ఆటగాడు భారత సంతతి బౌలర్‌.. ఆఖరి క్యాచ్‌ అందుకున్నదీ భారత సంతతి వ్యక్తే.. చివరికి ప్రత్యర్థికి రికార్డు దక్కినా ఫర్వాలేదు అనుకున్నదీ భారతే! ఎందుకంటే కుంబ్లేకు రికార్డు దక్కనివ్వొద్దని పాక్‌ ఆటగాడు హిట్‌వికెట్‌గా వెనుదిరుగుతా అని చెప్పడం మనం విన్నాం కదా!


Also Read: India South Africa Tour: అమ్మో.. భయం! ఒమిక్రాన్‌ భయంతో దక్షిణాఫ్రికా వెళ్లేందుకు జంకుతున్న క్రికెటర్లు!


Also Read: Ind vs NZ, 2nd Test Match Highlights: పటేల్‌ స్పిన్‌ దెబ్బకు.. మయాంక్‌ 'ప్రతిఘాత్‌'! టీమ్‌ఇండియా 221/4


Also Read: Ind vs NZ, 2nd Test: థర్డ్ అంపైరా.. థర్డ్ క్లాస్ అంపైరా.. కోహ్లీ అవుట్ కావడంపై మండిపడుతున్న నెటిజన్లు


Also Read: Ganguly on Laxman: హైదరాబాద్‌ను వదిలేస్తున్న వీవీఎస్‌.. మా లక్ష్మణ్‌ బంగారం అంటున్న గంగూలీ!


Also Read: Srikanth Kidambi: గత మూడువారాల్లో ఎంతో నేర్చుకున్నా.. తర్వాతి లక్ష్యం అదే :కిడాంబి శ్రీకాంత్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి