ఇండోనేషియాలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ఎంతో నేర్చుకున్నట్లు భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ తెలిపాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలిపారు. గత మూడు వారాల్లో ఇండోనేషియాలో గుర్తుంచుకోదగ్గ అనుభవాన్ని పొందినట్లు పేర్కొన్నాడు. ఎంతో నేర్చుకుని అక్కడ నుంచి వస్తున్నట్లు పేర్కొన్నాడు. అభిమానుల ప్రేమ, మద్దతుకి ధన్యవాదాలు తెలిపాడు. తర్వాత వరల్డ్ చాంపియన్ షిప్ మీద దృష్టి పెట్టనున్నట్లు ఆ పోస్టులో పేర్కొన్నాడు.
భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో గ్రూప్ దశలోనే వెనుదిరిగాడు. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓటములు ఎదురవడంతో శ్రీకాంత్ టోర్నీ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.
శ్రీకాంత్ తన మొదటి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన తోమా జూనియర్ పొపోవ్‌పై 21-14, 21-16 తేడాతో గెలుపొందాడు. అనంతరం థాయ్‌ల్యాండ్‌కు చెందిన కున్లువట్ వితిద్సార్న్ చేతిలో 18-21, 7-21 తేడాతో పరాజయం పాలయ్యాడు. ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో మలేషియాకు చెందిన లీ జి జియా చేతిలో 19-21, 14-21 తేడాతో పోరాడి ఓడాడు.
అయితే సెమీస్‌కు భారత్‌కు చెందిన మరో ఆటగాడు లక్ష్యసేన్ చేరుకున్నాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు కూడా సెమీస్‌కు చేరింది. లక్ష్యసేన్ సెమీస్‌లో డెన్మార్క్ ఆటగాడు విక్టర్ అక్సెల్‌సన్‌తో పోటీపడనున్నాడు. పీవీ సింధు తన ప్రియమైన ప్రత్యర్థి జపాన్‌కు చెందిన అకానే యమగూచితో పోటీపడనుంది. మహిళల డబుల్స్‌లో కూడా అశ్విని పొన్నప్ప - ఎన్.సిక్కిరెడ్డి ద్వయం గ్రూప్ దశలోనే ఇంటి దారి పట్టింది. పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌కు అసలు ప్రాతినిధ్యమే లేదు.
వరల్డ్ చాంపియన్‌షిప్ ఈ నెల 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు స్పెయిన్‌లో జరగనుంది. ఇప్పుడు దీనిపైనే దృష్టిపెట్టనున్నట్లు కిడాంబి శ్రీకాంత్ తెలిపాడు.